తెలంగాణలో కమలం ఎదుగుతోంది… కానీ గెలుస్తుందా?

by Ravi |   (  Updated:2026-02-24 01:15:06  IST  )

2026 ఫిబ్రవరి 11న జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి ఒక రియాలిటీ చెక్ లాంటివి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు గెలిచి, 35% ఓట్ షేర్‌తో దూసుకుపోయిన బీజేపీకి, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఒక గట్టి ఎదురుదెబ్బగా నిలిచాయి..

తెలంగాణలో కమలం ఎదుగుతోంది… కానీ గెలుస్తుందా?
X

2026 ఫిబ్రవరి 11న జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి ఒక రియాలిటీ చెక్ లాంటివి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు గెలిచి, 35% ఓట్ షేర్‌తో దూసుకుపోయిన బీజేపీకి, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఒక గట్టి ఎదురుదెబ్బగా నిలిచాయి.. ఓట్ల శాతం పెరగడం వేరు, క్షేత్రస్థాయిలో అధికారాన్ని చేజిక్కించుకోవడం వేరు అనే నిజాన్ని ఈ ఫలితాలు మరోసారి స్పష్టం చేశాయి.

తెలంగాణలో బీజేపీ ఎదుగుదల ఒక ఎత్తుపల్లాలు లేని ప్రయాణం కాదు. ఓట్ల శాతం పెరుగుతున్నా, అధికారం అనే ‘మ్యాజిక్ ఫిగర్’ ఎందుకు అందడం లేదనే అంశాన్ని గణాంకపరంగా, సామాజిక కోణంలో విశ్లేషిస్తే తప్ప నిజాలు తెలియవు..

ఓటు షేర్ వర్సెస్ సీట్ల మార్పిడి

రాజకీయాల్లో ఓట్ల శాతం పెరగడం ఒకెత్తు, అవి సీట్లుగా మారడం మరొక ఎత్తు. బీజేపీ ఓట్లు ప్రధానంగా ఉత్తర తెలంగాణ (ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్) హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. నల్గొండ, ఖమ్మం వంటి ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి ఇప్పటికీ 10% కంటే తక్కువ ఓట్లు వచ్చే నియోజకవర్గాలు డజన్ల సంఖ్యలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్త సగటు ఓటు శాతం (35%) చూసి మురిసిపోయినా, ఈ దక్షిణ జిల్లాల్లో ఓట్లు పెరగనంత కాలం అసెంబ్లీలో మెజారిటీ (60 సీట్లు) రావడం అసాధ్యం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓట్లతో కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే గెలువగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓట్లతో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో 35% ఓట్లతో 8 ఎంపీ సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. పైన చూస్తే ఓటు శాతం పెరుగు‌తోంది కానీ, అసెంబ్లీలో సీట్ల సంఖ్య 10 దాటడం లేదు.. దీనర్థం బీజేపీ ఓట్లు పెరుగుతున్నాయి కానీ అవి గెలుపు అంచు వరకు చేరడం లేదు.

సామాజిక సమీకరణాలు..

తెలంగాణ సమాజం కుల రాజకీయాలకు, అస్తిత్వ పోరాటాలకు పెట్టింది పేరు.. బీజేపీ 'బీసీ ముఖ్యమంత్రి' నినాదాన్ని తెచ్చినప్పటికీ, క్షేత్ర స్థాయిలో ఉన్న బలమైన బీసీ ఉప-కులాలు (మున్నూరు కాపు మినహా, యాదవ, పద్మశాలి, గౌడ మొదలైనవి) ఇంకా పూర్తిస్థాయిలో బీజేపీ వైపు మళ్లలేదు. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలో బీజేపీ ప్రదర్శన చాలా బలహీనంగా ఉంది. రాష్ట్రంలో సుమారు 13-14% ఉన్న ముస్లిం ఓటర్లు బీజేపీని ఓడించే క్రమంలో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ వైపు వెళ్తున్నారు. ఇది దాదాపు 30 - 40 నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపు అవకా శాలను దెబ్బతీస్తోంది. హైదరాబాద్ దాని చుట్టుపక్కల ఉన్న సెటిలర్లు (ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన వారు) 2024 లోక్‌సభలో బీజేపీకి అండగా నిలిచారు. కానీ, అసెంబ్లీ విషయానికి వస్తే వారు స్థానిక భద్రత, అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపు తున్నారు. అభివృద్ధి ఎజెండా కంటే భావోద్వేగ ఎజెండా ఎక్కువైనప్పుడు తటస్థ ఓటర్లు దూరం జరుగుతున్నారు.

దెబ్బ తీస్తున్న ప్రణాళిక లేమి..

లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు దేశ ప్రయోజనాలు, నరేంద్ర మోడీ నాయకత్వం వైపు చూశారు.. కానీ మున్సిపల్ ఎన్నికల నాటికి సీన్ మారింది. మున్సిపాలిటీల్లో డ్రైనేజీ, రోడ్లు, నీటి సరఫరా వంటి అతి సామాన్యమైన సమస్యలు ప్రధానం. బీజేపీ ప్రచారం ఇంకా జాతీయవాదం, కేంద్ర పథకాల చుట్టూనే తిరుగుతోంది. కానీ, గల్లీ స్థాయి సమస్యలపై స్థానిక ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు దశాబ్దాలుగా గ్రామాల్లో, వార్డుల్లో బలమైన నెట్‌వర్క్ ఉంది. బీజేపీకి చాలా చోట్ల వార్డు స్థాయి నాయకులు లేకపోవడం, కొత్తగా చేరిన వారిపైనే ఆధారపడటం మైనస్‌గా మారింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీలు, పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల వంటి హామీలు ఓటర్లను ఆకర్షించాయి. అసెంబ్లీ ఓటమి తర్వాత కుంగిపోతుందని భావించిన బీఆర్ఎస్, మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది. పట్టణ ఓటర్లలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌కు పడకుండా, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీలి పోయింది. గతంలో పట్టణాల్లో బీజేపీకి ఏకపక్షంగా పడే ఓట్లు, ఈసారి బీఆర్ఎస్ బలమైన అభ్యర్థుల వల్ల పక్కకు మళ్లాయి.. దీనివల్ల లాభం చేకూరింది మాత్రం కాంగ్రెస్‌కే. రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పులు, అంతర్గత విభేదాలు ఈ ఎన్నికలపై స్పష్టమైన ప్రభావం చూపాయి. హైద రాబాద్‌తో పాటు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి నగరాల్లో మధ్యతరగతి ఓటర్లు, సెటిలర్లు బీజేపీకి వెన్నె ముకగా ఉండేవారు. కానీ ఈ ఎన్నికల్లో వారు స్థిరత్వం వైపు మొగ్గు చూపారు.

నేర్చుకోవాల్సిన పాఠాలు..

మున్సిపల్ ఫలితాలు బీజేపీకి ఒక హెచ్చరిక. బీజేపీ తెలంగాణలో అధికారం చేపట్టాలంటే కేవలం హిందుత్వ లేదా మోడీ ఇమేజ్ సరిపోదు.. పైనుంచి వచ్చే మోడీ ఇమేజ్ ఓట్ల శాతాన్ని పెంచగలదు కానీ కింద పటిష్టమైన పునాది లేనిదే అధికారాన్ని అందించలేదు.. ప్రస్తుతం పట్టణ ఓటర్లు కేవలం భావోద్వేగాల కంటే, నిత్య జీవితంలో ఎదురయ్యే మౌలిక వసతులకే పెద్దపీట వేస్తున్నారని ఈ ఎన్నికలు నిరూపించాయి. అతిగా హిందుత్వ, జాతీయవాదం అజెండా కాకుండా, అభివృద్ధి నిధుల వినియోగం పై ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూ, దక్షిణ తెలంగాణపై ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తూ, సంస్థాగతంగా వార్డు స్థాయి కమిటీలను ఏర్పరుస్తూ, బూత్ స్థాయి నుండి కేడర్ బలోపేతం చేస్తూ, ఒంటరి పోరాటం కాకుండ భావసా రూప్యత గల చిన్న వర్గాలను కలిపి తనదైన శైలిలో ముందుకెళ్తే అధికారం అసాధ్యమేమి కాదు..

-డాక్టర్. కేశవులు బి. ఎండీ. (సైకియాట్రీ)

చైర్మన్ తెలంగాణ మేధావుల సంఘం

85010 61659

Next Story