ఇవి కంచెలు ధ్వంసం అవుతున్న కాలం..

by Ravi |   (  Updated:2025-11-01 01:15:14  IST  )

ఆట ప్రాచీన కాలం నుంచే ఉన్నది. అందులో దోపిడీ, అణచివేత అనాదిగా సాగుతున్నాయి. ఒక మారుమూల పల్లెలో నుండి బయలు దేరిన దర్శకుడు సెల్వరాజ్. తాను చూసిన ఒక గ్రామీణ ఆటగాడు

ఇవి కంచెలు ధ్వంసం అవుతున్న కాలం..
X

ఆట ప్రాచీన కాలం నుంచే ఉన్నది. అందులో దోపిడీ, అణచివేత అనాదిగా సాగుతున్నాయి. ఒక మారుమూల పల్లెలో నుండి బయలు దేరిన దర్శకుడు సెల్వరాజ్. తాను చూసిన ఒక గ్రామీణ ఆటగాడు మనతి గణేశ్ బతుకు పోరాటాన్ని దృశ్యమానం చేశాడు. ఆయన తీసిన బైసన్ తెలుగు ,తమిళ భాషల్లో విజయవంతంగా నడుస్తోంది.

ఇరవయ్యో శతాబ్దపు ప్రథమార్థంలో తమిళనాడు, మహారాష్ట్ర కేంద్రంగా మొదలైన స్వాభిమాన ఉద్యమాలు, ఆర్య, ద్రావిడ సంవాదంలో ఆధిపత్య పురాణ ప్రతీకలు పురాణ పురుషులను పునఃసమీక్షతో పాటు, పురాణ పరంపరలో విజేతలు పరాజితులు ఆధిపత్య కుట్ర అని, ఆ కుట్రను ఎండగట్టే క్రమంలో అపారమైన సాహిత్యం వచ్చింది.

సృజనతో కుల వ్యవస్థకు ఎదురీది..

ప్రతీకలు పరాజితులు కనుక, పరాజితుల కోణం నుండి ఆధిపత్య సంవాదాన్ని వినిర్మాణం చేసే పని మొదట నాటకాలు మొదలు పెట్టాయి. సామాజిక శాస్త్రాలలో ఈ షిఫ్ట్ ఎన్నో నూతన ఆవిష్కరణలకు, చర్చలకు దారి చూపింది. పురాణ పాత్రలను వినిర్మాణం చేసే ఈ పనిని 'ప్రళయన్' అనే రచయిత దళిత ఉపకథ పేరుతో తిరగ రాశాడు. ఆ నాటకాలు తమిళనాడులో ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ కృషి వెనక ద్రావిడ నాట ప్రజ్వరిల్లిన స్వాభిమాన పోరాట స్ఫూర్తి ఉంది. అది పెరియార్ నడ యాడిన నేల. ప్రళయన్, మనతి గణేష్, మారి సెల్వరాజ్ వారు తమ రంగంలో తమ సృజనతో వర్తమాన కుల వ్యవస్థకు ఎదురీది నూతన దారులేసిన ధీరులు.

జన్మభూమి చుట్టూ భావోద్వేగాల సమాహారం..

మారి సెల్వరాజ్ తమిళనాడు రాష్ట్రంలో తిరునల్వేలి జిల్లా పులియాంకులం పరిసర గ్రామంలో పుట్టి పెరిగాడు. తన ఊరి చుట్టూ విస్తారమైన టీ ఎస్టేట్స్, అరటి తోటలతో నిండినా... ఆ సమీప గ్రామాల కూలీలు వెట్టిచాకిరీ చేస్తారు. ఆ వెట్టిలో మారి సెల్వరాజ్ కుటుంబం కూడా ఉన్నది. ఆయన కవిత్వం రాసినా, కథ, నవల రాసినా.. ఆఖరికి ఆత్మకథ మర్చిపోవాలనే అనుకుంటున్నా, రాసినా, తాను పుట్టి పెరిగిన తిరునల్వేలి చుట్టూ అల్లుకున్న భావోద్వేగాల సమాహారం. తన పరిసర గ్రామాల్లో విస్తరించిన కాఫీ తోటలు, అరటి తోటలలో తన పూర్వీకుల మొదలు తన దాకా పని చేసిన క్రమంలో యాజమాన్యపు కర్కశ పెత్తందారీతనం కింద నలిగిన ఎన్నో పసివాడని జ్ఞాపకాలు ఉన్నాయి. కనుకనే, ప్రతి సినిమాలో అతను అనుభవించిన 'కుల దాష్టీకం'ని అంత బలంగా దృశ్యమానం చేశారు. సెల్వరాజ్‌కి ఐదో సినిమా. విక్రమ్ కొడుకు ధృవ్ హీరో. బైసన్ ఆయన సినీ జీవితంలో మరో మైలురాయి. బైసన్ అంటే ఎనుబోతు.

రచ్చబండ క్షాత్ర పరీక్షలో తలమునకలై..

తొంబయ్యవ దశకంలో తమిళనాట జరిగిన కథే బైసన్ సినిమాకి స్ఫూర్తి. ఇది ఒక కబడ్డీ ఆటగాడి విజయ గాథ. అతని పేరు మనతి గణేశన్, ఇండియన్ కబడ్డీ ఆటలో చెరగని ముద్ర అతనిది, క్రీడారంగంలో అత్యున్నత అర్జున అవార్డీ. డెబ్భై యనభయ్యో దశకంలో ఊరంతా రచ్చబండ దగ్గరే ఉండేది. వెనుకటి సుతులు యాది జేసుకుని ఆటలు, పాటల యక్షగానాలతో మార్మోగే కాలాన, జట్లు జట్లుగా గ్రామాలలో ఆటలు ఉండేవి. అవి నిజానికి ఆదర్శమైన రోజులు. ప్రతి రచ్చబండ క్షాత్ర పరీక్షలో తల మునకలై ఉం డేవి. అంతేకాదు పగలు, కక్షలు, కుట్రలూ ఉండేవి. కుల అణచివేత, పెత్తందారీతనపు ఆగడాలు ఉండేవి. అందుకే హీరో ఇలా అంటాడు, గ్రామ గ్రామాన ఎక్కడ చూసినా కంచెలే, పొలం చుట్టూ, పారే పంట కాలువ చుట్టూ, మనిషికీ మనిషికీ మధ్య కులం పేరు మీద కట్టబడ్డ అప్రకటిత కంచెలను రాజేసిన కులాల అంతరాలను ధ్వంసం చేసుకుని, ఆ కంచెలు దాటడమే ఒక పోరాటంగా వ్యవస్థీకృతమైన కుల వ్యవస్థలో ఒక దళిత ఆటగాడు, పగలు-ద్వేషాలతో కొట్టుకుని చచ్చే ఆ గ్రామం నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించే క్రమంలో, ఆ మధ్యయుగ కుల రొచ్చులోంచి బయటపడి ప్రపంచ కబడ్డీ ఆటగాడిగా తనను తాను ధ్వంసం చేసుకుంటూ నిలబడ్డ ఒక తిరునల్వేలి ఆటగాడి కథ ఇది. అత్యంత నేర్పుతో తీసిన సినిమా ఇది.

కుల అభిజాత్యం కింద నలిగి...

గ్రామాల మధ్య ఇంకా మాట్లాడితే ఊరుకీ, వాడకీ మధ్య పెరిగిన అభిజాత్యాల నేపథ్యం ఈ సినిమాలో పాండ్య రాజు, కందసామి అనే ఇద్దరు కుల నాయకుల మధ్య చెలరేగిన ఆధిపత్య పోరు బ్యాక్ డ్రాప్‌లో నడుస్తుంది. తన ఊరిలో రెండు వైరి వర్గాల మధ్య నలిగి హతులైన తన సహచరుల తలపులతో, జపాన్ దాకా వెళ్లి అక్కడ కూడా అవమానాలు పడి, దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెడతాడు. వర్తమాన కాలంలో వ్యవస్థీకృతమైన కుల దోపిడీలో మనతి గణేష్ లాంటి వాళ్లు విజేతలుగా నిలబడడానికి బతుకు పోరాటమే చేశారు.

అసలు ఎవరీ మారి సెల్వరాజ్..

ఒక పల్లెటూరి పిల్లవాడుగా నగరానికి వచ్చి, ఆఫీసు అసిస్టెంట్‌గా పనిచేసి, కవిగా, రచయితగా, పాటల రచయితగా, నిర్మాతగా వెండి తెరమీద బలమైన గొంతుగా మిగిలాడు. అతను వెండితెర వాకిలిలో ఊరికీ, వాడకీ మధ్య కనిపించని గోడలను ధ్వంసం చేస్తున్నాడు. వాడ పలకల మీద చిర్రా చిటికెన పుల్లతో ఆశయాల ఆనవాళ్లకు జీవం పోస్తున్న కథలను రాయ సాగాడు. కీకారణ్యం లాంటి చరిత్ర పుస్తకాల్లో అస్పృశ్య గాథల దారులు పోస్తున్న ఈ కాలపు వెండితెర కరికాలుడు. జీవితాలకి, ఆశయాలకి నమ్మకాల మధ్య కాలం మిగిల్చిన గాయాల మీద నడిచిన ఒక ధీరుడి కథ ఇది.

సినిమా: బైసన్

నటీనటులు: ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్

కథ, దర్శకత్వం: మారి సెల్వరాజ్

విడుదల: థియేటర్లలో


సమీక్షకులు

-డా. గుర్రం సీతారాములు

77805 87586

Next Story