బిహార్ ఎస్‌ఐఆర్ వివాదం.. విపక్ష ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయా?

by Ravi |   (  Updated:2025-11-21 01:15:42  IST  )

బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్.) దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

బిహార్ ఎస్‌ఐఆర్ వివాదం.. విపక్ష ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయా?
X

బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్.) దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలైతే ముఖ్యంగా ఎన్డీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాలలో ఎస్ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానాలు కూడా చేయడం గమనార్హం.

ఎన్నికల కమిషన్ కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, విపక్షాలకు చెందిన వారి ఓట్లను తొలగి స్తుందని పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడమే కాకుండా కాంగ్రెస్ అగ్రనేత ఓట్ చోరీ పేరుతో బిహార్‌లో భారీ యాత్ర కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో విపక్షాలు తమ ఓటమికి అసలు కారణాలు విశ్లేషించుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకుంటూ ప్రధాన ప్రతిపక్షంగా పోరాడుతూ ప్రజలకు చేరువైతే వచ్చే ఎన్నికల్లో అయినా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు.

ఎస్.ఐ.ఆర్ అంటే భూతమైపోయిందా?

అయితే విపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనా? అందుకే ఎన్‌డీయే పక్షాలు భారీ విజయాన్ని నమోదు చేశాయా అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. ఎన్నికల ఫలితాలు, అధికార, విపక్షాలకు వచ్చిన, ఎన్నికల సంఘం ప్రకటించిన ఓట్ల సంఖ్యను పరిశీలిస్తే నిజానిజాలు తెలుస్తాయనడంలో సందేహం లేదు. వాస్తవానికి ప్రతి ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం ఓటర్ జాబితా సవరణ, కొత్త ఓటర్లను చేర్చడం, లేని వారిని తొలగించడం మామూలుగా నిర్వహించే ప్రక్రియే. అయితే బిహార్‌లో ప్రత్యేక పరిస్థితులు, విదేశీ అక్రమ చొరబాటుదారుల దృష్ట్యా ఎస్.ఐ.ఆర్. నిర్వహించినట్లు ఈసీ ప్రకటించింది. భారతీయులు కాని వారు, అనర్హులు ఓటేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించబోమని, అలాగే డూప్లికేట్ ఓట్లు, వలస వెళ్లిన వారి ఓట్లు తొలగించడం మామూలేనని ఈసీ ప్రకటించింది.

అన్ని పార్టీలకూ భారీగా ఓట్ల పెంపు..

ఇక విపక్షాల ఆరోపణల్లో నిజమెంత అనే విషయాన్ని పరిశీలిస్తే ఆర్జేడీకి 2020 ఎన్నికల్లో 97,38,855 ఓట్లు పోలవగా ఈసారి 1,15,46,055 ఓట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి 2020 ఎన్నికల్లో 39,95,319 ఓట్లు రాగా, ఈసారి ఎన్నికల్లో ఈ సంఖ్య మరింత పెరిగి 43,74,579 ఓట్లు వచ్చాయి. అంటే ఆర్జేడీకి గతంలో కంటే 18,07,200 ఓట్లు అధికంగా రాగా, కాంగ్రెస్ పార్టీకి 3,79,260 ఓట్లు అధికంగా పోలవడం గమనార్హం. ఒకవేళ విపక్షాలు ఆరోపించినట్లుగా ఎస్.ఐ.ఆర్. ద్వారా ఎన్నికల సంఘం కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా వ్యవహరించినట్లయితే ప్రధాన విపక్ష కూటమి పార్టీలకు ఓట్లు భారీగా తగ్గిపోవాలి కదా అని బీజేపీ అనుకూల వర్గాలు వాదిస్తున్నాయి. అనర్హులైన వారి ఓట్లతో విపక్షాలు గెలువాలనుకోవడం శోచనీయమని వారు విమర్శిస్తున్నారు. అక్రమంగా దేశంలోకి చొర బడడమే నేరమైతే ఎన్నికల ప్రక్రియను అక్రమ ఓటింగుతో ప్రభావితం చేసే అవకాశం కల్పించాలని విపక్షాలు ఆశించడం దారుణమని వారు దుయ్యబడుతున్నారు.

ప్రజా తీర్పును పరిహసించడమే!

అలాగే 2020 ఎన్నికల్లో బీజేపీకి 82,02,067 ఓట్లు రాగా, ఈసారి ఎన్నికల్లో 1,00,81,143 ఓట్లు వచ్చాయి. అంటే బీజేపీకి కూడా 18,79,076 ఓట్లు గతంలో కంటే ఎక్కువగా వచ్చాయి. ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన జేడీయూకి 2020 ఎన్నికల్లో 64,85,179 ఓట్లు రాగా, ఈసారి ఎన్నికల్లో 96,67,118 ఓట్లు పడ్డాయి. అంటే 31,81,939 ఓట్లు అధికంగా పోలయ్యాయి. వాస్తవాలు ఇలా ఉండగా ఇప్పటికీ కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలు ఎస్.ఐ.ఆర్. నిర్వహించి ఈసీ తమకు రావాల్సిన ఓట్లను తొలగించడంతోనే బీజేపీ, ఎన్‌డీఏ పార్టీలు భారీ విజయాన్ని సాధించాయని విమర్శించడం ప్రజా తీర్పును పరిహసించడం కాక మరేమిటి? వాస్తవానికి ఎన్‌డీఏ పక్షాలలో ఉన్న ఐక్యత విపక్షాలలో లేకపోవడం ఒక కారణం కాగా తమ మిత్రపక్షాలకు ఓటు బదిలీ జరగకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు.

ఓటమి, గెలుపు మధ్య చిన్న గీత

అంతేకాకుండా పొత్తు కుదరకపోవడంతో 11 స్థానాల్లో మిత్ర పక్షాలే స్నేహపూర్వక పోటీ అంటూ పోరాడటం, ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మకపోవడంతో పాటు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ను ప్రకటించడం కూడా రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి మిత్రపక్షాలకు నచ్చలేదు. ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరు కాకపోవడం కూడా ఆ కూటమిలో ఉన్న విభేదాలను బయట పెట్టినట్లయింది. అంతేకాకుండా ఆర్జేడీ అరాచక పాలనను నితీశ్ కుమార్ పది హేనేళ్ల పాలనతో ప్రజలు పోల్చుకోవడం కూడా విపక్షాల ఘోర వైఫల్యానికి కారణంగా పేర్కొనవచ్చు.

ప్రతిపక్షం ప్రజలకు చేరువైతేనే..

ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఎన్డీయే పక్షాల నాయకులు, ఒకవేళ ఈసారి ఎన్డీయేకు ఓటేయకపోతే జంగిల్ రాజ్ మళ్లీ వస్తుందని, ప్రజలు అభివృద్ధికి దూరమవుతారని చేసిన విమర్శలను సమర్థంగా తిప్పికొట్టడంలో ఇండియా కూటమి పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయి. ఇండియా కుటమిలోని లోపాలు, నితీశ్ కుమార్ ప్రభుత్వం మహిళల ఖాతాల్లో జమ చేసిన రూ.10 వేల ఆర్థిక సహాయం కూడా ఆ పార్టీల విజయానికి బాటలు వేసింది. అంతేకాకుండా హర్ ఘర్ జల్ యోజన, ఉజ్వల గ్యాస్ యోజన, పీ.ఎం. ఆవాస్ యోజనతో పాటు ప్రధానమంత్రి మోడీపై ఉన్న విశ్వాసం కూడా ఎన్‌డీఏ పక్షాల విజయానికి కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా విపక్షాలు తమ ఓటమికి అసలు కారణాలు విశ్లేషించుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకుంటూ ప్రధాన ప్రతిపక్షంగా పోరాడుతూ ప్రజలకు చేరువైతే వచ్చే ఎన్నికల్లో అయినా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు.

-శ్యామ్ సుందర్ వరయోగి

98669 66904

Next Story