ఆన్‌లైన్ మోసాలతో జాగ్రత్త!

by Ravi |   (  Updated:2025-06-15 01:00:19  IST  )

ఆధునిక డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ లాటరీ సైబర్ మోసాలు సమాజానికి పెను సవాలుగా మారాయి.. మనుషుల మానసిక అత్యాశను

ఆన్‌లైన్ మోసాలతో జాగ్రత్త!
X

ఆధునిక డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ లాటరీ సైబర్ మోసాలు సమాజానికి పెను సవాలుగా మారాయి.. మనుషుల మానసిక అత్యాశను అడ్డం పెట్టుకుని అమాయకులను నిండా ముంచుతున్న సైబర్ నేరగాళ్లు.. వారి మోసపూరిత పన్నాగాలతో ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. ఇంటర్నెట్ విస్తృతి పెరిగిన కొద్దీ ఈ మోసగాళ్లు కొత్త రూపాలు సంతరించుకుంటూ, ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు.. లాటరీ తగిలిందని, బహుమతి గెలిచారని నమ్మించి, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో లక్షలు గుంజుతున్న సంఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నాయి.

ఇటీవలి కాలంలో ఈ సైబర్ మోసాల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCSB) నివేదికల ప్రకారం, 2023 మే నెలలో ప్రారంభమైనప్పటి నుండి, కేవలం ఆన్‌లైన్ స్టోర్ మీషో పేరుతో జరిగిన మోసాల్లోనే బాధితులు సుమారు 2.9 కోట్ల రూపాయలు కోల్పోయారు. లాటరీ మోసాలకు సంబం ధించి ఒకే నెలలో 15 ఫిర్యాదులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 54 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగిని కేరళ లాటరీ పేరుతో ఏకంగా 7.55 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. ఈ ఘటనలు ఆన్‌లైన్ లాటరీ మోసాల తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి.

మోసగాళ్ల పన్నాగం..

ఈ మోసగాళ్ల మోసపూరిత పద్ధతులు రోజురోజుకూ అధునాతనంగా మారుతున్నాయి. సాధారణంగా, బాధితులకు లాటరీ తగిలిందని, భారీ నగదు బహుమతి గెలిచారని తెలియజేస్తూ ఫోన్‌కాల్స్, ఎస్ఎంఎస్‌లు, ఈమెయిల్స్ వస్తాయి. ఈ సందేశాలు ప్రముఖ సంస్థల, ప్రభుత్వ సంస్థల అధికారిక కమ్యూనికేషన్‌ల వలె కనిపించేలా జాగ్రత్తగా రూపొందించబడతాయి. ఆ బాధితులు ఎటువంటి లాటరీ లో పాల్గొనకపోయినా, వారికి అయాచిత నోటిఫికేషన్లు వస్తాయి. యూట్యూబ్, ఎక్స్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో నమ్మదగిన తప్పుడు ప్రకటనలు ఇస్తారు. బహుమతిని క్లెయిమ్ చేసుకోవడానికి జీఎస్టీ, ఇన్‌కం టాక్స్, స్టేట్ ట్యాక్స్ అంటూ డబ్బులు గుంజు తారు.. స్టాంప్ డ్యూటీ అంటూ నకిలీ నాన్-జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లను కూడా సృష్టిస్తారు.. ఈ చెల్లింపులు చేయకపోతే బహుమతిని కోల్పోతారని బెదిరిస్తారు. కొన్నిసార్లు, నకిలీ వెబ్సైట్లు, నకిలీ పత్రాలను సృష్టించి బాధితులను నమ్మిస్తారు. క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయమని కోరడం, ఫిషింగ్ లింక్‌లను పంపడం ద్వారా వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను సేకరిస్తారు. ఇలా నిఘా లేకుండా ప్రకటనలను అనుమతించే సోషల్ మీడియా వేదికలపై కూడా కేసులు నమోదు చేయాలి.

ఫిర్యాదు చేయాల్సిన విధానం..

ఒకవేళ మీరు ఆన్‌లైన్ లాటరీ మోసానికి గురైనట్లయితే, వెంటనే చర్యలు తీసుకోవడం అత్యవసరం. మొదటగా, 1930 నంబర్‌కు కాల్ చేయాలి. ఇది సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్. నేరం జరిగిన గంటలోపు ఫిర్యాదు చేయడం ద్వారా పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశాలు మెండుగా ఉంటాయి.. లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ https://cybercrime.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసేటప్పుడు, మోసానికి సంబంధించిన అన్ని వివరాలను, స్క్రీన్ షాట్లను, బ్యాంక్ లావాదేవీల వివరాలను, సందేశాలను, కాల్ రికార్డులను సమర్పించాలి. లేదా మీ స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. మోసం ఏదైనా బ్యాంకుకు సంబంధించినదైతే, ఆ బ్యాంకు మోసం నివారణ విభా గానికి, ఆర్‌బీఐ అంబుడ్స్మన్‌కి ఫిర్యాదు చేయవచ్చు. మోసపూరిత ఎస్ఎంఎస్‌లు, కాల్స్‌కి సంబంధించి టెలికాం ట్రాయ్‌కి కూడా ఫిర్యాదు చేయవచ్చు.

మోసాలను నివారించడమెలా?

ఇటువంటి మోసాల బారిన పడకుండా ఉండటానికి కొన్ని నివారణ చర్యలు పాటించాలి.. అవి మీరు ఎటువంటి లాటరీలో పాల్గొనకపోయినా, లాటరీ తగిలిందని సందేశం వస్తే నమ్మవద్దు. ఇక ముందస్తుగా డబ్బు చెల్లించమని కోరే ఏ లాటరీ అయినా నకిలీదే అని గుర్తించాలి. అలాగే మీ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దు. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దు. తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్‌కి స్పందించవద్దు. సందేశాలు, ఈ మెయిల్స్‌లో వ్యాకరణ దోషాలు, స్పెల్లింగ్ తప్పులు ఉంటే అనుమానించాలి. మోసగాళ్లు తరచుగా బాధితులపై ఒత్తిడి తెచ్చి, ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వకుండా వెంటనే డబ్బు చెల్లించమని డిమాండ్ చేస్తారు. కానీ తొందరపడొద్దు. ఏదైనా ఆఫర్లపై అనుమానం ఉంటే, అధికారిక వెబ్ సైట్ల ద్వారా లేదా అధికారిక సంప్రదింపు వివరాల ద్వారా ఆ సంస్థను నేరుగా సంప్రదించి ధృవీకరించుకోవాలి. సైబర్ నేరాల గురించి అవగాహన పెంచు కోవడం, అప్రమత్తంగా ఉండటం ద్వారా మీ ఆర్థిక వివరాలను, వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత.

డా.కట్కూరి

సైబర్ సెక్యూరిటీ న్యాయ నిపుణులు..

9490934520

Next Story