- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచ యుద్ధాల వెనుక.. పచ్చి నిజాలు
ప్రఖ్యాత కవి Wilfred Owen తన Send Off పద్యంలో .. A few, a few, too few for drums and yells.. యుద్ధంలో విజయం గురించి

ప్రఖ్యాత కవి Wilfred Owen తన Send Off పద్యంలో .. A few, a few, too few for drums and yells.. యుద్ధంలో విజయం గురించి మనం విజయ గంటలు మోగించినప్పుడు సైనికులు ఎవరూ ఉండరు. అందరూ యుద్ధానికి బలై ఉంటారు. అది అప్పటి మాట. నేడు సైనికులే కాదు. ప్రజలు కూడా ఉండరు..
యుద్ధం కావాలి.. కావాలి అన్న ప్రజలకు కూడా నేడు మారణాయుధాలు ఎంత భయంకరమైనవో బహుశా తెలీ దేమో.. పాలస్తీనాను చూస్తున్నాం. పిల్లలు పాలకు వాచిపోతున్నారు. ఒక బ్రెడ్ ముక్క కుటుంబం మొత్తం పంచుకుంటున్నారు. సైనికుడు బోర్డర్ దగ్గర కాపలా కాసి మనల్ని రక్షిస్తాడు అనేది పాత కాన్సెప్ట్. నేడు బాంబులు మన ఇంటి మీద, మన తల మీద, మన నగరాల మీద పడతాయి.
ప్రజలకు యుద్ధాలు అవసరం లేదు!
మారణాయుధాలు అమ్మడంలో ఇజ్రాయెల్, అమెరికా, రష్యా, ఫ్రాన్స్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ దేశాలకు వారి ఆయుధాలు అమ్మే దేశాల మార్కెట్ కావాలి. అంటే యుద్ధం రావాలి. అది రావాలంటే అందుకోసం ఒక స్టోరీ కావాలి. ఒక నెరెటివ్ కావాలి. నిజానికి యుద్ధాలు ప్రజలకు అవసరం లేదు.. ఏ దేశంలోని శ్రామిక వర్గం యుద్ధాలు కోరుకోదు. అంత సమయం వారికి ఎక్కడిది? 12 గంటలు పనిచేసి మరో నాలుగు గంటలు విపరీతమైన రష్‌గా ఉన్న బస్సులు, ట్రైన్లలో అలసి సొలసి ఇంటికి వచ్చిన శ్రామిక వర్గానికి ఆలోచన చేసే తీరిక ఏది? కానీ వారికి యుద్ధం అనే ఆలోచన కూడా పెట్టుబడిదారీ మీడియా ఇస్తుంది. ఇదిగో మీరు ఇలా ఆలోచిస్తూ ఉండండి.. యుద్ధం కావాలి అని.
యుద్ధాలు వారికే అవసరం!
వాస్తవానికి యుద్ధాలు నాయకులకు అవసరం. అంతర్జాతీయ పెట్టుబడికి అవసరం. ఆయుధాల ఫ్యాక్టరీలకు అవసరం. బ్యాటిల్ టెస్టెడ్ గ్రౌండ్‌ల కోసం ఒక నేల అవసరం. ఆ నేలలో ప్రజలు ఏ బాంబులతో ఎలా చనిపోతారో రీసెర్చి అవసరం. ఏ మిస్సైల్‌తో ఎంతమందిని చంపవచ్చు, ఏ మిస్సైల్ ఎంతమందిని ఎలా కాటేస్తుంది అని చెప్పే బ్యాటిల్ టెస్ట్ అవసరం. ఆ టెస్ట్ రిజల్ట్స్ చూపించి వెపన్స్ ఫెయిర్‌లో కస్టమర్స్‌కి కాన్ఫిడెన్స్ పెంచడం అవసరం. ఇదిగో ఈ బాంబు పాలస్తీనాలో ఇంతమందిని చంపింది. ఇదిగో ఈ బాంబు ఉక్రెయిన్‌లో ఫలానా సమయంలో ఇంత మందిని చంపింది. మన బ్లడ్ రిపోర్ట్ లాగానే, మన ఎక్స్‌రే రిపోర్ట్ లాగానే బేటిల్ టెస్టెడ్ రిపోర్ట్‌లు కూడా బాంబుల ప్యాకింగ్ బ్రోచర్‌లో ఉంటాయి. ఇదంతా బిజినెస్. మనమంతా మతాలూ, కులా లూ అని మనం వాదించుకుంటాం. కానీ బాంబులు అమ్ము కునే దేశాలకు వీటితో పని లేదు. వాటి అమ్మకాలు జరిగితే చాలు.. ఎక్కువేసి సంఖ్యలో జనాలు చస్తే చాలు.. వీరి ఆజ్ఞలు జీ హుజుర్ అని వింటూనే ఉంటే సరే.. లేకపోతే, బంగ్లాదేశ్ పరిస్థితి నెలకొంటుంది.
ఇజ్రాయెల్ చేసింది అదే!
ఇప్పుడు ఇజ్రాయెల్ ఆ పనే చేస్తుంది. తన ఆయుధాల శక్తి తెలిపేందుకు పాలస్తీనాను టెస్ట్ గ్రౌండ్‌గా వాడుకుంటుంది. ఆ రిజల్ట్ చూపించి ఇతర దేశాల్లో తన ఆయుధాలు గ్రాండ్ ఫాదర్ అమెరికా ఆశీస్సులతో అమ్ముకుంటుంది. మన కోల్‌కతా, హైదరాబాద్ బుక్ ఫెయిర్ లాగా వెపన్స్ ఫెయిర్ చేసుకుంటుంది. ‘టెస్టెడ్’ అని స్టాంప్ కొట్టి మరీ అమ్ముకుంటుంది. ఇలా ఎందుకు అని ప్రశ్నించే ప్రతిపక్ష నేతల, మానవ హక్కుల కార్యకర్తల, రచయితల, జర్నలిస్టుల మొబైల్స్‌లోకి పెగాసస్ అనే భయంకరమైన మాల్‌వేర్ నిశ్శబ్దంగా పంపించేస్తుంది. విచిత్రంగా దీనిని కూడా అమ్ముకుంటుంది.
దేశాలు శాంతంగా ఉంటే ఎలా?
దేశాల్లో తమ పాత ఆయుధాలు చెల్లిపోవాలి. కొత్తగా తయారైన ఆయుధాలు వేల కోట్ల రూపాయలతో కొనుగోలు జరగాలి. అలా జరగాలంటే దేశాలు శాంతంగా ఉండకూడదు. ఘర్షణలకు దిగాలి. ఏవీ లేకపోతే, కొత్త స్టోరీ తయారు చేసి అమలులోకి తేవడానికి అమెరికా గూఢచారి సంస్థలు ఉండనే ఉన్నాయి. హిట్లర్ ఒక ప్రత్యేక మతస్థులను ఊచకోత కోయడానికి తానొక్కడే కారణం కాదు. అసంఖ్యాకమైన ప్రజలు అది కోరుకున్నారు. ఇప్పట్లానే ప్రజలు దేశభక్తితో ఊగిపోయారు. అలా ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేసే ప్రక్రియ ప్రణాళికా బద్ధంగా కొనసాగింది. ఏ దేశంలో అయినా, ఏ కాలంలో అయినా, సామ్రాజ్యవాదులకు, ఫాసిస్టులకు, అంతర్జాతీయ పెట్టుబడికి యుద్ధాలకు ఓ కథనే ఉంటుంది.
చరిత్ర నుండి మనం నేర్చుకోం!
ప్రపంచ యుద్ధాలు రెండు చూశాం. హిరోషిమా, నాగాసాకీలో పరమాణు బాంబులు టెస్టింగ్ చూశాం. అత్యంత మానవ విషాదం చూశాం. రేడియేషన్ ప్రమాదం చూశాం. అయినా చరిత్ర నుండి మనం నేర్చుకోం. విలవిలలాడుతున్న మానవ జాతిని చూశాం. చూస్తున్నాం. పాత వెర్షన్ మొబైల్ ఎక్సేంజ్‌లో అమ్మేసి అప్డేడేటెడ్ మొబైల్ కొంటాం. ఇదీ అంతే. అంతర్జాతీయ పెట్టుబడి అసలు ఉద్దేశాలు మనకు అర్థం కాకపోతే, ఆయుధాలు అమ్ముకునే దేశాల అసలు అజెండా మనకు అర్థం కాకపోతే, దేశంలోని మీడియా, కోర్టులు, ప్రశ్నలు వేసే పౌరులు పక్కకు జరిగి ఒకే ఒక నాయకుడికి విపరీతమైన అధికారాలను అందించే దేశాల ఫాసిస్టు స్వభావం మనకు అర్థం కాకపోతే, శ్రామిక వర్గం ఇంకా యుద్ధం కోరుతూ అంధకారంలోనే ఉంటుంది.
యుద్ధాన్ని గ్లోరిపై చేయవద్దు!
ఒక పద్యంలో Owen అంటాడు. May creep back.. Up half known roads. యుద్ధం చివర సైనికుల దయ నీయమైన పరిస్థితి చూస్తాం ఈ పద్యంలో.. నేడు ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. Owen, PB Shelleyలు నాటి యుద్ధాలను రొమాంటిసైజ్ చేసే కవుల ద్వంద్వం ప్రమాణాలను ఎండగడుతూ వీర మరణాల తప్పుడు నెరెటివ్స్‌ను ఎండగడుతూ యుద్ధం వెనుక పచ్చి నిజాలను నిర్భయంగా కవితల్లో బంధించారు. యుద్ధం గ్లోరిఫై చేసిన కుహనా మేధావి వర్గం ఆ రోజూ ఉంది. నేడూ ఉంది.
ఠాగూర్ ఈనాడు ఉంటే...
ఆ రోజు అంటే చదువుకున్న వారు తక్కువ. కాబట్టి, చదువు అందితే వీరి ఉన్నతమైన విలువలు పెరుగుతాయని ఠాగూర్ లాంటి కవులు ఆశపడ్డారు. వారి మెదడు, హృదయం అభివృద్ధి కోసం కష్టాలు పడ్డారు. ఆలోచనలు అందించారు. నేడు చదువుకున్న వారు బాగా పెరిగారు.. కానీ, నేడు వారి మెదడులోనే, హృదయంలోనే ఇంత వయొలెన్స్, ఇంత ద్వేషం ఎలా పుడుతుందో..? ఠాగూర్ ఈనాడు ఉంటే మరో గీతాంజలి రాసేసే వారేమో!
- కేశవ్
ఆర్థిక సామాజిక విశ్లేషకులు
98313 14213






