- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై ప్రజలు రేషన్ బియ్యం అమ్ముకోరు..ఎందుకంటే?
ఏడాదిలోనే ఎంత మార్పు! ప్రతీ గ్రామాల్లో వాడల్లో, గల్లీల్లో వ్యాపారులు రేషన్ బియ్యం కొంటామనే శబ్దం వినిపించలేదు.

ఏడాదిలోనే ఎంత మార్పు! ప్రతీ గ్రామాల్లో వాడల్లో, గల్లీల్లో వ్యాపారులు రేషన్ బియ్యం కొంటామనే శబ్దం వినిపించలేదు. ఆ మాటకొస్తే అమ్మేందుకూ వాకిట్లో వేచి చూసిన వారూ కనిపించలేదు. పైగా ప్రతి ఒక్కరూ రేషన్ షాపులకు ఒకటికి రెండుసార్లు వెళ్లి మరీ సన్నబియ్యం తెచ్చుకుని మనసారా ఆస్వాదిస్తూ, కడుపారా తిన్నారు. ఒక్క గింజ అంటే ఒక్క గింజైనా పక్కదారి పట్టలేదు. ప్రజాపాలనలో తెలంగాణ ప్రభుత్వం పౌరసరఫరాల్లో విప్లవాత్మక మార్పు తెస్తోంది.
యథార్థానికి దగ్గరగా ఆలోచించి
దోషులు తప్పించుకున్నా పర్వాలేదు.. ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అని న్యాయవ్యవస్థలో ఒక సూక్తి వింటాం. రేషన్ విషయంలో కూడా అంతే.. అక్కడక్కడా అనర్హులు రేషన్ పొందినా సరే.. నిజమైన అర్హులకు మాత్రం అన్యాయం జరగొద్దు. సమాజంలో దర్జాగా, నేరుగా ఎలాంటి పైరవీల అగత్యం లేకుండా కుల మతాలకు అతీతంగా బీదలందరూ సొంతం చేసుకునేవి చౌకధరల నిత్యావసరాలు. చాలా మంది రేషన్ బియ్యం పంపిణీ ఎత్తివేయాలని అంటారు! అందుకు ఆ బియ్యం విషయంలో జరిగే అక్రమాలను ఉటంకిస్తారు. వాస్తవమే, గడప ముందు మొదలై సముద్రాల మీదుగా తీరాన్ని దాటించే మాఫియా పడగలెత్తింది. అయినా సరే, జలుబు పట్టిందని ముక్కు తొలగించుకోలేం కదా. ఇక్కడే ముఖ్యమంత్రి యథార్థానికి దగ్గరగా ఆలోచించారు. తినడానికి రేషన్ బియ్యం ఏ మాత్రం అనువుగా లేకపోవడమే రేషన్ బియ్యం తొవ్వ తప్పడానికి ఓ కారణంగా తేల్చారు. అదే సమయంలో తమ పాలనను నమ్ముకున్న రాష్ట్ర ప్రజలు మంచి ఆహారం తీసుకోవాలని తలిచారు. అందుకు సన్న బియ్యం పంపిణీనే చక్కని పరిష్కారంగా విధాన నిర్ణయం తీసుకున్నారు. పౌరసర ఫరాల శాఖ సమర్థవంతంగా అమల్లోకి తెచ్చారు.
సమర్థవంతంగా అమలుపరిస్తే..
తెలంగాణ ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం లబ్దిదారుల్లో నూటికి 88 శాతం మందికి సన్న బియ్యం అందాయి. 71.08 లక్షల రేషన్ కార్డుల ద్వారా 1.47 లక్షల టన్నుల సన్న బియ్యం పేదల ఇళ్లకు చేరాయి. ఈ ఏప్రిల్ కోసం 1.67 లక్షల టన్నుల సన్న బియ్యాన్ని రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సివిల్ సప్లయీస్ విభాగం అందుబాటులో ఉంచింది. సన్న బియ్యం తొలిసారి అందజేసిన అనుభవం, అసలైన లబ్ధిదారుల సరాసరి ఫీడ్ బ్యాక్ మేరకు రాబోయే రోజుల్లో మరింత సజావుగా సమకూర్చాలి. ఈ మాసంలో ఇంకా దక్కని వారు కేవలం 12 శాతమే అయినందున వారికీ చేరేలా స్పెషల్ డ్రైవ్ తరహా పూనిక అవసరం. ఆ ప్రకారం సన్న బియ్యం పథకాన్ని సుసంపన్నం చేయాలి. ఈ స్కీంను దిగ్విజయంగా కొనసాగిస్తే..ఒక్క తిండి గింజయినా సామాన్య ప్రజలు వదులుకోరు. అత్యంత పాపులర్ అవుతోన్న సన్న బియ్యం పథకం దరిమిలా జనంతో మమేకం అయ్యేందుకు ఊరూరా కాంగ్రెస్ శ్రేణులు బీదల ఇంట చేతులు కడుగుతున్నాయి!
-ఇల్లెందుల దుర్గాప్రసాద్
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
94408 50384






