- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ ఆత్మగౌరవ భవనాలు.. లక్ష్యం దారి తప్పుతోందా?
తెలంగాణలో బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం లక్ష్యం అమలు లోపాలతో దారి తప్పుతోంది. భూముల లీజులు, ట్రస్టుల నిర్వహణలో జరిగిన అక్రమాలు బీసీ వర్గాల హక్కులపై ప్రభావం చూపుతున్నాయి.

తెలంగాణలో బీసీ వర్గాల ఆత్మగౌరవాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కార్యక్రమం, అమలు లోపాలతో ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. స్పష్టమైన ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, వాటి ఉల్లంఘనతో అసలు ఉద్దేశ్యం దెబ్బతింటోంది.
బీసీల స్వయం నిర్వహణను ప్రోత్సహించేందుకు..
ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం. 189 ద్వారా 36 బీసీ కులాలకు సుమారు 67 ఎకరాలు 30 గుంటల భూమి కేటాయించబడింది. ఈ భూములను ఆయా కులాల సామాజిక, విద్యా, ఆర్థిక అభివృద్ధి కోసం వినియోగించాల్సి ఉంది. అనంతరం జీఓ నెం. 20 ద్వారా సుమారు రూ. 60 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. అదే విధంగా, Memo No: 2574/D/2018-24, తేదీ: 02.11.2021 ద్వారా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా కులాల సంఘాలు కామన్ ట్రస్ట్ లేదా సొసైటీగా ఏర్పడితే భవనాల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను వారికి అప్పగిస్తామని పేర్కొంది. ఈ నిర్ణయం బీసీ వర్గాల స్వయం నిర్వహణను ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశ్యం.
బీసీ వర్గాల హక్కులపై దెబ్బ!
అయితే, అమలు దశలో అనేక లోపాలు చోటు చేసుకున్నాయి. ట్రస్టుల ఏర్పాటు పారదర్శకంగా జరగకపోవడం, కొంతమంది వ్యక్తులు తమ అనుచరులతోనే ట్రస్టులను నియంత్రించడం వంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజమైన ప్రతినిధులు పక్కనపడటం వల్ల ఈ ప్రాజెక్ట్ విశ్వసనీయత కోల్పోతోంది. టెండర్ విధానాలను పక్కనపెట్టి కాంట్రాక్టులు కేటాయించడం, నిధుల విడుదలలో జాప్యం, ట్రస్టుల నిర్లక్ష్యం వంటి కారణాలతో భవనాల నిర్మాణం నిలిచిపోయింది. ఇది పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదు.. బీసీ వర్గాల హక్కులపై నేరుగా దెబ్బగా మారింది.
చై.నా. సంస్థకు లీజ్ ఇవ్వడం దారుణం
ముఖ్యంగా, భూముల వినియోగంలో జరుగుతున్న మార్పులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. బీసీ వర్గాల అభివృద్ధి కోసం కేటాయించిన భూములను ఇతర సంస్థలకు లీజ్ ఇవ్వడం వల్ల కేటాయింపు అసలు ఉద్దేశ్యం దెబ్బతింటోంది. ఇలాంటి చర్యలు కొనసాగితే, ఈ ప్రాజెక్ట్ లక్ష్యం పూర్తిగా నీరుగారిపోయే ప్రమాదం ఉంది. ప్రత్యేకంగా, కురుమ సంఘానికి కేటాయించిన భూమిని ‘నారాయణ చైతన్య’ విద్యాసంస్థకు 15 సంవత్సరాలపాటు లీజ్ ఇవ్వడం తీవ్రమైన వివాదానికి దారితీసింది. ఇది నిబంధనలకు విరుద్ధమే కాకుండా, భవిష్యత్తులో భూమి హక్కులపై తీవ్రమైన చట్టపరమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఒకవేళ ఏ సంస్థయినా నిరంతరంగా 12 సంవత్సరాలపాటు స్వాధీనం కొనసాగిస్తే, భవిష్యత్తులో హక్కులపై బలమైన క్లెయిమ్‌లు ఏర్పడే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు..
ప్రభుత్వ జాగరూకత తప్పనిసరి
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇతర ప్రయోజనాల కోసం భూములను లీజ్ ఇవ్వడానికి ప్రత్యేక జీఓలు జారీ చేయడం అసలు లక్ష్యానికి విరుద్ధం. అలాంటి చర్యలు బీసీ వర్గాల హక్కులను బలహీన పరుస్తాయి. బీసీ ఆత్మగౌరవ భవనాలు వాణిజ్య అవసరాల కోసం కాదు.. బీసీ యువతకు వసతి, విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మారాల్సిన సామాజిక ఆస్తులు. వాటి వినియోగం కూడా అదే దిశగా ఉండాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే జరిగిన లీజ్ ఒప్పందాలను సమీక్షించి, నిబంధనలకు విరుద్ధమైన వాటిని రద్దు చేయాలి. ముఖ్యంగా కురుమ సంఘం– నారాయణ చైతన్య లీజ్ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి. ట్రస్టుల వ్యవస్థపై సమగ్ర విచారణ జరిపి, పారదర్శకతను నెలకొల్పాలి. బీసీ వర్గాల అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు అమలులో దారి తప్పితే, అది సామాజిక న్యాయానికి విరుద్ధం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అసలు లక్ష్యాన్ని కాపాడాలి.
- సయ్యద్ రఫీ






