- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ హక్కుల బోనం.. అందరికీ ఆహ్వానం
పలు రాజకీయ, సామాజిక ఉద్యమాలకు ప్రతిబింబంగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ.. ఇప్పుడు అదే కోవలో బీసీ ఉద్యమాన్ని

పలు రాజకీయ, సామాజిక ఉద్యమాలకు ప్రతిబింబంగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ.. ఇప్పుడు అదే కోవలో బీసీ ఉద్యమాన్ని కూడా వేలు పట్టుకు నడిపించేందుకు సిద్ధమైంది. ఓయూలో మొదలైన ఉద్యమాలు అనేకం విజయాన్ని ముద్దాడాయి. ఇప్పుడు మిగిలిందల్లా బీసీ ఉద్యమమేనని మేధావులు, ప్రజాస్వామిక వాదులు విశ్లేషిస్తున్నారు. గతం తాలూకు ఉద్యమ అనుభవాలను తీసుకొని అడుగులు వేసేందుకు ఓయూ సిద్ధం అవుతోంది.
1969 నుంచి మొదలైన తెలంగాణ ఉద్యమం అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నట్టుగానే ప్రస్తుత బీసీ ఉద్యమం కూడా పురిటినొప్పులు పడుతోంది. భావజాల వ్యాప్తి ద్వారా స్వరాష్ట్రం సాధ్యం అని తెలంగాణ సిద్దాంతకర్త జయశంకర్ ప్రకటించారు.
గత అనుభవాలను తీసుకొని..
సాంస్కృతిక చైతన్యం అందుకు జోడించకపోవడంతో ఉద్యమంలో సామాన్య ప్రజలు సమీకృతమయ్యేందుకు ఆలస్యమైంది. సాంస్కృతిక చైతన్యం ద్వారానే అందరూ ఒక గొడుగు కింద జతకూడుతారని ఉద్యమం తారాస్థాయిలో కొనగుతున్న సమయంలో భావించి.. సబ్బండ వర్గాలను మమేకం చేశారు. అప్పుడు కదలిక మొదలై ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం అయ్యారు. ఆ తెలంగాణ ఉద్యమ అనుభవాలను తీసుకొని ఓయూలో పురుడు పోసుకున్న ఏబీసీ జాక్ వాటిని ప్రస్తుత ఉద్యమానికి జోడించాలని సంకల్పించింది. బీసీల్లోని అన్ని కులాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం అంత సులభంగా జరిగే పనేం కాదు. మనువు సృష్టించిన కులం అడ్డుగోడను బద్దలు కొట్టడం అసాధ్యమేమీ కాకపోయినా.. అంత ఈజీ అయితే కాదు..
బీసీలను ఏకం చేసేందుకు..
ఉత్పతి, శ్రామిక వర్గాలు అన్ని ఒకే కేటగిరిలో ఉన్నప్పటికీ వారు ఒకే గొడుగు కిందకు రాకుండా చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, యాదవ, గౌడ, వడ్డెర అంటూ అందర్నీ విడదీసేలా చేశారు. అందుకే బీసీలలో అందరం ఏకం అవుదామనే స్పృహ ఏళ్లుగా రాలేకపోపోతోంది. బీసీ రిజర్వేషన్ల సాధన, రాజ్యాధికారం రావాలని పోరాటం చేస్తున్న శక్తులు, వ్యక్తులు.. సాంస్కృతిక చైతన్యం లేకుండా బీసీలను ఏకం చేయలేమని ఏబీసీ జాక్ పసిగట్టింది. అందుకే ఉద్యమ అవసరాలు, భవిష్యత్ ఉద్యమాల నిర్మాణం.. అన్ని కులాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేలా ఓ సాంస్కృతిక ఉద్యమం మొదలు పెట్టాలని నిర్ణయించాం. ఆ ఆలోచన నుంచే బీసీ హక్కుల బోనం పుట్టింది. అందుకు ఓయూ వేదిక కావడం హర్షణీయంగా ఉంది. జులై 15వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎల్లమ్మ గుడి వరకు ఈ సాంస్కృతిక కార్యక్రమం కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్ధి మహా గర్జన తలపెట్టినప్పుడు ఎలాగైతే వచ్చారో.. తెలంగాణ మహిళాలోకం ఇంటికో బోనంతో ఓయూకు రండి.. తెలంగాణ మహిళలందరూ ఆహ్వానితులే..
ప్రశాంత్ పగిళ్ళ
ఓయూ, ఏబీసీ జాక్
95812 62429






