సామాజిక న్యాయం పేరు మీద.. రాజకీయ నాటకం?

by Ravi |   (  Updated:2025-10-12 01:00:57  IST  )

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9 రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన ఈ జీవో, కోర్టులో నిలబడదని తెలిసినా

సామాజిక న్యాయం పేరు మీద.. రాజకీయ నాటకం?
X

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9 రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన ఈ జీవో, కోర్టులో నిలబడదని తెలిసినా రాజకీయ ప్రయోజనాల కోసం విడుదల చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా సామాజిక న్యాయంపై చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో, ఈ అంశం బిహార్ ఎన్నికలతో ముడిపడి ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వం నిజంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనుకుంటే, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి, ప్రత్యేక చట్టం లేదా రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని సాధించవచ్చు. కానీ, అలా చేయలేదు.

కోర్టులో కొట్టేస్తారని తెలిసినా..

సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం, రిజర్వేషన్ల శాతం 50% మించకూడదు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కలిపి ఇప్పటికే 25% ఉన్నాయి. దీనికి బీసీల 42% రిజర్వేషన్లు జోడిస్తే, మొత్తం రిజర్వేషన్ల శాతం 67% దాటుతుంది. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు పూర్తిగా విరుద్ధం. ఈ విషయం తెలిసినప్పటికీ, ప్రభుత్వం ఈ జీవోను జారీ చేయడం వెనుక రాజకీయ ఎత్తుగడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీసీ జనాభాను తమవైపు తిప్పుకోవడానికి ఇది ఒక ప్రచార అస్త్రంగా ఉపయోగపడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

స్టేతో నిలిచిపోయిన నామినేషన్లు..

జీవో-9 విడుదలైన వెంటనే అనేక పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. దసరా సెలవుల ముందు జీవో జారీ చేసి, కోర్టు విచారణను ఆలస్యం చేయాలని ప్రభుత్వం ప్రయత్నించిందని పిటిషనర్లు ఆరోపించారు. చివరికి, హైకోర్టు ఈ జీవోపై నాలుగు వారాల పాటు స్టే విధించింది. దీంతో నామినేషన్లు వేయడానికి సిద్ధమైన అభ్యర్థులకు నిరాశ ఎదురైంది. కోర్టు స్టే వస్తుందని ప్రభుత్వం ఊహించలేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. కోర్టులో నిలబడని నిర్ణయం తీసుకుని, ఎన్నికల ముందు ఓటర్లను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తున్నాయి. ఈ జీవో వల్ల నామినేషన్ల ప్రక్రియ నిలిచిపోవడమే కాకుండా, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని అనిశ్చితి నెలకొంది. ఇది రాజకీయ పార్టీలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.

బీహార్ ఎన్నికల డ్రామాయేనా?

దేశ రాజకీయాల్లో ఇప్పుడు బీహార్ ఎన్నికల సందడి నెలకొంది. సామాజిక న్యాయం, రిజర్వేషన్ల అంశాలు బిహార్ ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో జీవో 9 విడుదల, దానిపై కోర్టు స్టే రావడం యాదృచ్ఛికంగా జరగలేదనేది రాజకీయ వర్గాల అభిప్రాయం. ‘తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని నిరూపించుకుని, ఆ నినాదంతో బీహార్‌లోని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం జరుగుతోందని’ విమర్శకులు అంటున్నారు. బీహార్‌లో కులగణన, రిజర్వేషన్లు ముఖ్యమైన అంశాలు కాబట్టి, ఈ తరహా నిర్ణయాలు అక్కడి ఓటర్లపై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు.

బీసీల ఆశలపై చన్నీళ్లు...

కేవలం బిహార్ ఎన్నికల కోసం తొందర పాటుగా జీవో జారీ చేయడం చూస్తే, అక్కడి ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసమే తప్ప, నిజమైన సామాజిక న్యాయం కోసం కాదని స్పష్టమవుతోంది. అక్కడి ఎన్నికల్లో రాజకీయ మైలేజీ కోసం తెలంగాణ ప్రజలను బలిపశువులను చేస్తున్నారనే విమర్శలు బలం పుంజుకుంటున్నాయి. ఈ పరిణామాలు రాజకీయాల్లో నైతికతపై తీవ్ర ప్రశ్నలు లేవ నెత్తుతున్నాయి.

-కందుకూరి రాకేష్

9100642346

Next Story