- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

భారత ఇతిహాస చరిత్రలో పితృవాక్య పరిపాలనకై కానల కేగిన శ్రీరాముడు, తన ఆచరణ ద్వారా లోకానికి ఇచ్చిన సందేశం, ప్రతి వ్యక్తికి, తన కన్న తండ్రి ఒక ఆరాధ్య దైవమని.. అందువల్ల తండ్రి కోసం ఏ త్యాగానికైనా వెనుకాడవద్దని.. వాస్తవంగా ప్రతి తండ్రి తన సంతాన ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం పరితపిస్తాడు. వారి క్షేమం కోసం ఏ త్యాగానికైనా, చివరికి తన ప్రాణాలనైనా బలి పెట్టడానికి సిద్ధపడతాడు.
అయితే, ప్రస్తుత మన సమాజంలో తమను ప్రేమించే తండ్రిని గౌరవించడం అటుంచి తండ్రి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న యువతను, చివరికి ఆస్తుల కోసం కన్న తండ్రి ప్రాణాలను కూడా తీస్తున్న నికృష్టుల గురించి కూడా వార్తల్లో వింటున్నాం. అటువంటి ఉదంతాలు విన్నప్పుడు హృదయం బాధతో బరువెక్కుతుంది. అయితే, సమాజం మొత్తం ఇటువంటి నీచులతో నిండిపోయిందని భావిస్తే అది పెద్ద పొరపాటే. ఎందుకంటే, కుళ్లిన ఈ సమాజంలో కూడా బాపు రచయిత, గడ్డం సతీష్ లాంటి కొడుకులను కూడా అక్కడక్కడా మనం చూస్తున్నాం. ఇటువంటి వారి గురించి విన్నప్పుడు మనసు ఆనందంతో పులకరించిపోతుంది.
బాధాతప్త హృదయ ఘోష
ఇక పుస్తకం విషయానికి వస్తే తన రచనకు ‘బాపు’గా నామకరణం చేశాడు రచయిత సతీష్. ప్రముఖ ఆర్టిస్ట్ పి.ఎస్. చారి సృజించిన కవర్ పేజీని పరిశీలిస్తే, కవర్ పేజీ, పుస్తకంలోని ఒక నిరుపేద కుటుంబ గాథను ప్రతిబింబింపజేస్తుంది. కవర్ పేజీకి చిత్రకారుడు ఎన్నుకొన్న రంగు నలుపు. అది శోకానికి, బాధకు చిహ్నం. దీనర్థం ఈ రచన బాధాతప్త హృదయం పలికిన రోదనా గీతమని..ఈ రచన మొత్తం 22 జ్ఞాపకాల సమాహారం. మరొక ప్రముఖ చిత్రకారుడు వేణుమాధవ్ ప్రతి జ్ఞాపకానికొక సముచిత చిత్రాన్ని వేశాడు. ఇక ‘బాపు’ పుస్తకాన్ని తెరిచి చదివితే కవర్ పేజీ సూచించినట్టు అదొక మూగ రోదన. తనను అమితంగా ప్రేమించిన తన కన్న తండ్రి తనకు శాశ్వతంగా దూరమైనప్పుడు కన్న కొడుకు గుండె బాధతో తల్లడిల్లింది. ఆ బాధాతప్త హృదయం నుంచి వెలువడిన ఘోష అక్షరాలుగా రూపం దిద్దుకొని బాపు రచనను సమాజానికందించింది. ఇక ఈ రచన చదువుతుంటే, మన కండ్లు చెమర్చకుండా ఉండలేవు. రచన మొత్తం తెలంగాణ పల్లెటూరి భాషలోను, యాసలోనూ సాగడం ఒక విశేషం.
కోట్ల మంది రైతుల బాధలకు ప్రతీక
‘బాపు’ రచనలోని ప్రధాన పాత్ర తెలంగాణ-కరీంనగర్ జిల్లా మానకొండూర్‌కు చెందిన ఒక పేద రైతు గడ్డం రామస్వామి. ఆయన భార్య పేరు వజ్రమ్మ. ఆ దంపతుల సంతానం కొడుకు సతీష్, కూతురు రమ. ఇక రామస్వామి పేదరిక జీవితం భారతదేశంలోని కోట్ల మంది నిరుపేద రైతుల బాధలకు ప్రతీక. గ్లాసెడు పాలల్ల నాలుగు గ్లాసుల నీళ్లు పోసి ఐదు గ్లాసుల చాయ చేసుకొనే కుటుంబం. యూరియా బస్తా కొనేందుకు డబ్బు లేక ఎనుబది రూపాయల కోసం ఇల్లిల్లూ తిరిగిన వైనం. గాలివానకు ఇంటి రేకులు కొట్టుకొనిపొతే కొడుకుని మంచమ్మీద పడుకోబెట్టి కొడుకు మీద వానచుక్క పడకుండా వానలో తడిసిపోతూ కొడుకుకు రక్షణగా నిలబడ్డ తండ్రి. ఉన్న కొన్ని నూకలను పిల్లి పారబోస్తే ఆ పూటకు కొడుకు కడుపు నింపలేని తల్లిదండ్రుల తపన.
ఇమానమెక్కిన బాపు
డబల్ రొట్టె తినేందుకు జ్వరం వచ్చిందని చెప్పుకొన్న కొడుకు, బడిలో చేరిన సతీష్ కొత్త కాపీలు కొనలేక తక్కిన పిల్లల వద్ద జంట కమ్మలను అడుక్కున్న దీనత్వం, పేదరికంతో సకాలంలో పరీక్ష ఫీజు కట్టలేకపోతే హాల్ టిక్కెట్ ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టిన టీచర్లు, చివరగా.. తన తండ్రిని విమానమెక్కించాలన్న సతీష్ కోరిక తండ్రి జీవితకాలంలో తీరక, తండ్రి మరణానంతరం ఆయన అస్థికలను కాశీ, ప్రయాగలకు విమానంలో తీసికొనిపోతూ ‘ఇమానమెక్కిన బాపు’ అని రోదించిన సతీష్, ఈ అంశాలన్నీ మన గుండెలను పిండేస్తాయి.
అడుగడుగునా పోరాటం
వాస్తవంగా, రామస్వామి ప్రధాన శత్రువులు పేదరికం, నిరక్షరాస్యత. ఒకవైపు తాను తన శత్రువులతో పోరాడుతూ మరొకవైపు తన కన్నకొడుకు సతీష్‌కు రక్షణ కవచంగా నిలుస్తూ, కొడుకుకు ఉన్నత విద్యావంతుడిని చేసి, ఉన్నతోద్యోగంలో చూడాలని ఆ ముదుసలి తండ్రి ఆరాటం. అందుకోసం ఏ త్యాగానికైనా సిద్ధమేనన్న రామస్వామి. తనను అమితంగా ప్రేమించే తన తండ్రి తపనను, బాధలను చూసి, తానొక ఉన్నత విద్యావంతుడై, మంచి కొలువు సాధించి, తన తండ్రి కళ్లల్లో ఆనందం చూడాలని కొడుకు ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా కుళ్లిన సమాజంలో అడుగడుగునా పోరాటం చేయాల్సి వచ్చి పోరాడిన కొడుకు సతీష్. అయితే, సతీష్ పోరాటం అంత సామాన్య పోరాటమేమీ కాదు. ప్రతి అడుగునా విష నాగులున్న కుళ్లిన సమాజం, దీనికి తోడు గాలివాన రూపంల ఇంటి కప్పు నెత్తుకపోయి పగబట్టిన ప్రకృతి, దుర్భర దారిద్య్రం. వీటన్నిటితో పోరాటం సాగించి జీవితంలో విజయం సాధించి ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడిన కొడుకు సతీష్ మనకు కనబడుతాడు.
విజయంతో పూర్తయిన ఆశయం..
తనకెదురైన ప్రతికూల శక్తులన్నింటినీ జయించి, విజయ శిఖరాలనధిరోహించి, ఇక తన కన్న తండ్రి కళ్లల్లో తన విజయ ప్రతిబింబ మెరుపులను చూద్దామనుకున్న తరుణంలో ‘నీ విజయంతో నా ఆశయం పూర్తయింది బిడ్డా- ఇక నాకు సెలవు’ అంటూ తండ్రి రామస్వామి తనువు చాలించడం సతీష్ జీవితంలో ఒక భరించరాని విషాదం. ఆ విషాద గర్భాన్ని చీల్చుకొని పురుడు పోసుకున్న ఈ రచన తండ్రి కొడుకుల అనుబంధ మాధుర్యాన్ని లోకానికి తెలియజేయడమే కాదు, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న నేటి సమాజానికి ఒక దిక్సూచి.
పుస్తకం: బాపు
రచన: గడ్డం సతీష్
పేజీలు:140
వెల: రూ.116/
ప్రచురణ: అజ్జిరమ్మ పబ్లికేషన్స్
ప్రతులకు: గడ్డం సతీష్
99590 59041
బసవరాజు నరేందర్ రావు,
99085 16549






