- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బనకచర్ల పాపం..ఎవరిది?
నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. కోట్లాడి ఎన్నో త్యాగాలు, వేలమంది యువకుల ప్రాణ త్యాగాలతో స్వరాష్ట్రంలో అవి తెచ్చుకుందామనుకుందాం.

నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. కోట్లాడి ఎన్నో త్యాగాలు, వేలమంది యువకుల ప్రాణ త్యాగాలతో స్వరాష్ట్రంలో అవి తెచ్చుకుందామనుకుందాం. కానీ రాష్ట్రం ఏర్పాటయ్యాక సరిగ్గా పదేళ్లకే మళ్లీ అదే నీటి కోసం తెలంగాణ ప్రజల గుండె వెచ్చవుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం చేపట్టాలనుకుంటున్న బనకచర్ల ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి గోదావరి మీద ఆధిక్యత గల్లంతవుతుంది. గోదావరిపై భవిష్యత్తులో ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా పోతుంది. ఇది కేవలం ఒక నీటి ప్రాజెక్టు కాదు, తెలంగాణ భవిష్యత్ సాగుకు చిరకాల గాయం.
బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టులో భాగంగా ఉంది. ఇది కేవలం ఓ హెడ్ రెగ్యులేటర్ పేరు కాదు.. ఇది గోదావరి నీటిని దోచుకునేందుకు రూపొందించిన ఓ రాష్ట్ర వ్యూహం. ఆ ప్రభుత్వం గోదావరి జలాల్ని పోలవరం ప్రాజెక్టు ద్వారా బొల్లపల్లి రిజర్వాయర్‌కి తరలించి, అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ప్రాంతాలకు మళ్లించి అక్కడి కరువు సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
పునాది వేసింది కేసీఆరే...
ఆంధ్రప్రదేశ్ రూ. 84,000 కోట్లతో చేపట్టబోయే బనకచర్లకు పునాది వేసింది కేసీఆర్, హరీశ్ రావేనని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.. గోదావరి, కృష్ణా నదీ జలాలకు సంబంధించి 2016 ఫిబ్రవరి 21న ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీటి పారుదల శాఖ మంత్రులు పాల్గొన్నారు. అయితే ఆ సమావేశం మినిట్స్‌కు సంబంధించి ఎనిమిది పేజీల్లోని ఆరో పేజీలో 'గోదావరి నుంచి ఏటా 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. కృష్ణా బేసిన్ మీద నిర్మించాల్సిన ప్రాజెక్టులకు వెయ్యి టీఎంసీలు అవసరం.. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు' అని కేసీఆర్ ప్రతిపాదించిన విషయం బయటకు తెలిసింది. ఆ సమావేశంలో జరిగిన నిర్ణయం మేరకే ఇప్పుడు బనకచర్లను ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు తెస్తున్నట్లు అర్థమవుతుంది. అంతేకాకుండా 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాకా.. 2019లో ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రగతిభవన్‌లో సమా వేశమై ' రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు తాను పెద్దన్నగా సహకరిస్తాన'ని కేసీఆర్ హామీ ఇచ్చారు.
మా ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి!
కేసీఆర్ చెప్పడం వల్లే చంద్రబాబు బనకచర్ల చేపట్టారని, కానీ, గోదావరి బేసిన్‌లో తెలంగాణకు 968 టీఎంసీలు, ఏపీకి 518 టీఎంసీల కేటాయింపులు మాత్రమే ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టి వాడుకున్నాక మిగిలిన నీళ్లు కిందకు పోతే అవి వారు తీసుకుంటే ఎవ్వరికి అభ్యంతరం లేదు.. కానీ ఆ ప్రభుత్వం సమ్మక్కసాగర్, సీతరామ సాగర్‌తో పాటు గోదావరిలోని అన్ని ప్రాజెక్టులకు అభ్యంతరాలు చెబుతూ అనుమతులు రాకుండా చేస్తున్నది. అందుకే గోదావరిపై తెలంగాణ కట్టిన ప్రాజెక్టులకు 968 టీఎంసీలు వాడుకో వడానికి ముందుగా అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. ''రాష్ట్రానికి కేసీఆర్ చేసిన ద్రోహం వల్ల ఏపీకి నీళ్లు వరదలెక్క వస్తున్నయ్.. మేడిగడ్డ కూలిపోయింది. సుందిళ్ల అక్కరకు రాలే.. అన్నారం గురించి చెప్పాల్సిన పనేలేదు. అవే సక్కగుంటే ఆ నీళ్లు ఎత్తిపోసుకునేటోళ్లం. అప్పుడు ఏపీకి నీళ్లు వస్తుండెనో, రాకుండెనో తెలుస్తుండే" అని సీఎం అంటున్న మాటలు వాస్తవమే కదా! కృష్ణా జలాల్లో 555 టీఎంసీలు, గోదావరిలో 1000 టీఎంసీల నీటిని వాడుకునేందుకు తెలంగాణకు ఎన్‌ఓసీ ఇస్తే మీ ప్రాజెక్టులపై మా తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలా కానీ పక్షంలో "బనకచర్లను ఎలా అడ్డుకోవాలో మాకు తెలుస''ని ఏపీ సీఎంను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలను ఆషామాషీగా తీసుకోవద్దు. అందుకే ఈ విషయంలో రాష్ట్ర ప్రజలందరూ పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలబడాలి.
ఉద్యమం తప్పదా?
బనకచర్ల ప్రాజెక్టు అనేది కేవలం నీటి అంశం కాదు. ఇది తెలంగాణ జీవన స్థితిగతులపై రాజకీయ దాడి. ఇది ఓ రాజకీయ వివాదం కాదు. ఇది జీవన ప్రశ్న, కాళేశ్వరం కడలి వేళ్లలోకి పోయినా, బనకచర్ల ద్వారా గోదావరి నీళ్లను తరలిస్తే తెలంగాణ పంటలు, జీవితాలు ఎండిపోతాయి. నీటి కోసం ఉద్యమించిన తెలంగాణ.. మళ్లీ నీటి కోసమే ఉద్యమించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. తెలంగాణ ఉద్యమంలో గోదావరి తీరంలో వేలమంది యువకులు, రైతులు "మా నీళ్లు మా వంటిల్లు దాటి పోకూడదు" అని ప్రాణాలిచ్చారు. ఇప్పుడు అదే గోదావరి నీటిని ఎత్తిపోసి, తెలంగాణ గుండెని ఎండబెట్టడాన్ని చూస్తూ ఊరుకుంటే.. అది మన అమరవీరుల త్యాగానికి విరుద్ధం. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే రేపటి తెలంగాణ ఎండిపోయిన ఎడారి భూమిగానే మిగిలిపోతుంది.
డాక్టర్ కేశవులు ఎండి,
చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం,
85010 61659






