త్యాగానికి ప్రతీక బక్రీద్

by Disha edit |
త్యాగానికి ప్రతీక బక్రీద్
X

బక్రీద్ పండుగ ముస్లీంలకు ఎంతో ప్రత్యేకమైంది. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ పవిత్రమైన పండుగల్లో ఒకటి. ఈ బక్రీద్ పండుగనే ‘ఈద్ అల్-అధా’ అని కూడా పిలుస్తారు. రంజాన్ తర్వాత వచ్చే ఇస్లామిక్ క్యాలెండర్‌లో ముఖ్యమైన నెలల్లో ఈ నెల ఒకటి. ఇస్లాం మతంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్ తీర్థయాత్రను ముస్లింలు చేయవలసి ఉంటుంది. ఈ మాసం ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరతారు. హజ్ యాత్ర కోసం అరబ్ దేశమైన సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి చేరుకుని మసీద్‌లో ఉన్న కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజ్ చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు.

హజ్ తీర్థయాత్రకు వెళ్ళినవారు మక్కా నుండి మదీనాను సందర్శిస్తారు. అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్ను బలి ఇవ్వడానికి సిద్ధమౌతాడు. ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు. ఈదుల్ జుహా అనేది మనిషి యొక్క త్యాగ నిరతిని చాటిచెప్పే పండుగ. ఈ పండుగనే బక్రీద్ అంటారు. ప్రవక్త ఇబ్రహీం తన కొడుకైన ఇస్మాయిల్‌ను కత్తితో మెడను కోస్తున్నట్టు ఒక రోజు కల వస్తే .. ఆ అల్లాహ్ తన కొడుకునే కోరుతున్నాడేమోనని భావించి.. తన కొడుకును బలి ఇవ్వడానికి సిద్దపడతాడు. ఇబ్రహీం త్యాగాన్ని మెచ్చిన అల్లాహ్ ప్రాణ త్యాగం వద్దని ఏదైనా జీవిని బలి ఇవ్వాలని కోరతాడు. ఇబ్రహీం భక్తికి, త్యాగానికి గుర్తుగా ఆయనను సత్కరించేందుకే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారు.

ఖుర్బాని అంటే పేదలకు మాంసాన్ని దానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలు ఉన్నాయి. ఖుర్బాని అంటే సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం అని కూడా అర్థం. అంటే దైవ సాన్నిధ్యాన్ని పొందడం. దైవానికి సమర్పించడం. దైవం కోసం త్యాగం చేయడం అని భావం. అంతే కాదు.. ప్రాణత్యాగానికైనా వెనుకాడడని ఇదే ఖుర్బాని పరమార్థమని ముస్లిం పెద్దలు కొందరు అంటారు. మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం పేదల ప్రజలకు, రెండో భాగం తమ బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం మాంసాన్ని పంచి పెడుతారు. ఆకలి అనేది అందరి సమానమైనది కాబట్టి ఈ పండగకు నిరుపేద కుటుంబాలకు శక్త్యనుసారంగా దానధర్మాలు చేస్తూ కొంత మందికైన ఆకలి తీర్చగాలిగాం అని సంతృప్తి చెందుతారు. ధర్మం అంటే దానగుణం ముడిపడి ఉన్నదే. మతం ఏదైనా మానవత్వం చాలా గొప్పది.

యాసర్ హుస్సేన్

90522 39669

Next Story