త్యాగ నిరతికి ప్రతీక బక్రీద్

by Ravi |   (  Updated:2026-05-28 00:30:50  IST  )

ఈదుల్ అజ్హా లేదా బక్రీద్ పండుగ అసలైన సందేశమైన త్యాగం, మానవత్వం, ప్రేమ, పంచుకోవడం, సామాజిక సౌహార్ద్రతపై, మతాలకు అతీతంగా మానవ విలువలను గుర్తు చేసే ప్రత్యేక కథనం.

త్యాగ నిరతికి ప్రతీక బక్రీద్
X

భారతదేశం అనేక మతాలు, సంస్కృతులు, సంప్రదాయాల సమాహారం. ఇక్కడి పండుగలు కేవలం ఒక మతానికి సంబంధించిన ఆనంద సందర్భాలు మాత్రమే కాదు. అవి మానవ జీవితానికి నైతిక విలువలను నేర్పించే వేదికలు.. అలాంటి ఒక గొప్ప సందేశాన్ని మోసుకొచ్చే పర్వదినమే 'ఈదుల్ అజ్హా' లేదా 'బక్రీద్'. ఈ పండుగను చాలా మంది కేవలం 'ఖుర్బానీ (జంతు బలి) పండుగ'గానే చూస్తారు. కానీ, దాని వెనుక ఉన్న అసలైన అంతరార్థం- ప్రేమ, త్యాగం, సహనం, విధేయత, విశ్వజనీన మానవత్వం. దేవుని ఆజ్ఞకు లోబడి, తనకు అత్యంత ప్రియమైన దాన్ని సైతం త్యాగం చేయడానికి సిద్ధపడిన ప్రవక్త ఇబ్రాహీం (అలైహిస్సలాం) నిబద్ధతే ఈ పండుగకు ప్రేరణ. మనిషి తనలోని స్వార్థం, అహంకారం, ద్వేషం, లోభాన్ని త్యాగం చేయడం. అందుకే బక్రీద్ ప్రతి కాలంలోనూ మానవ సమాజానికి ఒక శాశ్వతమైన విలువను అందిస్తోంది. ప్రస్తుత సమాజంలో మతం, కులం, భాష, రాజకీయాల పేరుతో విభ జనలు ఎక్కువవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా చిన్న విషయాలు కూడా విద్వేషాలకు దారితీస్తున్న ఈ తరుణంలో, ఈ పర్వదినం మనకు 'మతం కంటే మానవత్వమే మిన్న' అనే సత్యాన్ని గుర్తు చేస్తుంది. అలాగే బక్రీద్‌లో ఉన్న మరో మహోన్నతమైన అంశం 'పంచుకోవడం'. ఖుర్బానీ మాంసాన్ని బంధువులతో పాటు నిరుపేదలకు పంచడం. ఇది కేవలం ఒక ఆచారం కాదు. ఎవరూ ఆకలితో అలమటించకూడదనే సామాజిక స్పృహ. హిందూ సంప్రదాయంలో దానం, యజ్ఞం, త్యాగాలకు ఎంతటి ఉన్నత స్థాన ముందో, ఇస్లాంలోనూ త్యాగానికి అంతటి ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ పండుగను ఒక మత చట్రంలో చూడకుండా, మానవ విలువల పండుగగా స్వీకరించాలి. ఈదుల్ అజ్హా సందర్భంగా ప్రతి ఇంట్లో ఆనం దం నిండాలని, ప్రతి మనసులో ప్రేమ పెరగాలని, సమా జంలో సౌహార్ద్రత బలపడాలని కోరుకుందాం. మనిషి తన స్వార్థాన్ని త్యజించి, అవసరంలో ఉన్నవారికి తోడుగా నిలిచినప్పుడే.. అది నిజమైన 'ఖుర్బానీ' అవుతుంది.

- యండి. ఉబైద్ ఖాన్

63054 14351

Next Story