సీజేఐపై దాడి క్షమించరాని చర్య.. కానీ!

by Ravi |   (  Updated:2025-10-15 01:00:41  IST  )

దేశ పరిపాలన వ్యవస్థలో శాసన, కార్య నిర్వాహక, న్యాయవ్యవస్థలలో అత్యంత ప్రధానమైనది, విశ్వసనీయమైనది, గౌరవించదగినది న్యాయ వ్యవస్థ. ఈ వ్యవస్థ కింద పనిచేసే వారి గౌరవానికి విధులకు భంగం కలిగించడం ఎంత మాత్రం క్షంతవ్యం కాదు

సీజేఐపై దాడి క్షమించరాని చర్య.. కానీ!
X

దేశ పరిపాలన వ్యవస్థలో శాసన, కార్య నిర్వాహక, న్యాయవ్యవస్థలలో అత్యంత ప్రధానమైనది, విశ్వసనీయమైనది, గౌరవించదగినది న్యాయ వ్యవస్థ. ఈ వ్యవస్థ కింద పనిచేసే వారి గౌరవానికి విధులకు భంగం కలిగిం చడం ఎంత మాత్రం క్షంతవ్యం కాదు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే సమాజ స్థితిగతులు అదుపు తప్పుతాయి.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ రామకృష్ణపై కోర్టు హాలులో లాయర్ రాకేష్ కిషోర్ బూటు విసరడం దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయంపై భారత ప్రధానమంత్రి తీవ్రంగా ఖండించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సంయమనాన్ని పాటించిన ప్రధాన న్యాయమూర్తిని అభినందించారు.

తీర్పులను ప్రజలు ఏనాడూ ధిక్కరించలే!

స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ దేశ న్యాయవ్యవస్థపై సామాన్య ప్రజలకు ఎనలేని గౌరవం ఉంది. సామాన్య ప్రజలు ఏనాడు కోర్టు ఉత్తర్వులను దిక్కరించే సాహసం చేయలేదు. ఎన్నో తీర్పుల వల్ల అపరాధి నిరపరాధి అయ్యాడు. నిరపరాధి అపరాదయ్యాడు. వాస్తవం మాట్లాడాలంటే ఈ దేశంలో కోర్టుల్లో తీర్పులు చెప్పే న్యాయమూర్తులు, కేసులను వాదించే లాయర్లు అధికారం, ధన బలం ఉండే వారి వైపే నిలబడడం సర్వసాధారణమైన విషయం. ఎంత పెద్ద నేరం చేసినా, సుప్రీంకోర్టులో కొందరు ప్రముఖ లాయర్లు కొందరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను మేనేజ్ చేసి, తమ క్లైంట్లకు బెయిల్ తీసుకుని విడిపించుకొస్తారు. పలుకుబడి లేని లాయర్ల బెయిల్ అప్లికేషన్లను సుప్రీంకోర్టులోని బెంచీలు కన్నెత్తి కూడా చూడవు సుమా!

దాడిపై చర్చ మంచిదే కానీ..

ఇక ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం గురించి పెద్ద చర్చే జరుగుతుంది. ఒక వర్గం ప్రధాన న్యాయమూర్తి దళితుడైనందున ఈ దాడి జరిగిందని, ఈ దాడిని రాజ్య వ్యవస్థ వ్యూహాత్మకంగా చేయించిందని, మెజారిటేరియన్ మత ఉన్మాదానికి ఇది పరాకాష్ట అని తన మీడియా ప్లాట్ ఫామ్‌పై గగ్గోలు పెడుతుంది. అయితే వారు దానికి వెనకాల ఏం జరిగిందో కూడా తెలుసుకోవాలి.. దేశంలోనే అత్యున్నత స్థానంలో పనిచేసే ప్రధాన న్యాయమూర్తి ఖజురహో దేవాలయంలోని విష్ణుమూర్తికి సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంలో వ్యంగ్య మైన వ్యాఖ్యలు చేయడం దేశ ప్రజలను బాధించిందని ఒక వర్గం పేర్కొంది. ఇస్లాం మతానికి సంబంధించిన పిటిషన్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే దేశం రావణాకాష్టంగా మండేదని, ఎన్ని ప్రభుత్వ ఆస్తులు ధ్వంస మయ్యేవో తెలియదని అంటూనే, బీజేపీ మీడియా ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తులే జోక్యం చేసుకున్న విషయం ఈ సందర్భంగా ఒక వర్గం చర్చకు పెట్టింది.

నిష్పాక్షికతే న్యాయ వ్యవస్థకు ప్రాణాధారం!

న్యాయ వ్యవస్థలో పనిచేసే వారికి అన్ని మతాల పట్ల సమాన భావన ఉండాలని, రాజకీయ నాయకుల మాదిరి న్యాయమూర్తులు కుహనా లౌకిక వాద ముసుగు వేసుకుంటే న్యాయవ్యవస్థ విశ్వసనీయత కోల్పోతుంది, వారి మాటల్లో, వారి చేతల్లో నిష్పాక్షికత కొరవడితే దేశ న్యాయవ్యవస్థ మూల స్తంభాలు కూలిపోతాయని ఈ వర్గం ఇదే సందర్భంలో చర్చను లేవదీసింది.

న్యాయవ్యవస్థలో రాజకీయం దూరితే డేంజర్!

ఈ దేశ న్యాయవ్యవస్థ పనితీరుపై జాతి హితైషులు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సుప్రీంకోర్టును తను చెప్పు చేతుల్లో పెట్టుకుని సీనియారిటీని కాలదన్ని, తన అనుకూలమైన వ్యక్తిని సీజేఐగా అపాయింట్ చేసినప్పుడు ఈ దేశ మేధావులు గోడమీది పిల్లులా ప్రవర్తించారు. మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తరుణ్ గగోయ్‌పై లైంగిక వేధింపుల కేసు, ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రచ్చ చేసి పత్రికలకెక్కడం, తమకు అనుకూలమైన వ్యక్తులను న్యాయమూర్తులుగా వేసుకోవడం, సెంట్రల్ జ్యూడిషరీ అపాయింట్మెంట్ కమిషన్ నిర్మాణాన్ని వ్యతిరేకించడం వంటి విషయాలన్నీ న్యాయవ్యవ్థపై ప్రజలకు అపనమ్మకాన్ని కలిగించేవే!

న్యాయమూర్తుల గౌరవానికి భంగం కలిగిస్తే..

ప్రధాన న్యాయమూర్తి దళితుడైనందున ఈ సంఘటన చోటు చేసుకున్నదని కులవాద రాజకీయాలను ప్రోత్స హించే వారి వాదన ఒక వైపు కొనసాగుతుంది. ఆ స్థానంలో ఒక అగ్రకుల న్యాయమూర్తి ఉండి ఉంటే వీరి వాదన ఇంకొక విధంగా ఉండేది. 'అగ్రకుల దురహంకారానికి సామాన్య ప్రజల నిరసనకు ఇది చిహ్నం అంటూ మనదేశంలోని స్వయం ప్రకటిత మేధావులు పల్లవిని అందుకునే వారే. ఇదే మేధావులు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. రాజ్యాంగ వ్యవస్థకు అవమానకరం అంటూ గొంతులు చించుకుంటున్నారు. బూటు విసిరిన లాయర్ తాను నిమ్న వర్గానికి చెందిన వ్యక్తిగా చెప్పుకోవడం ఈ మేధావులకు మింగుడు పడడం లేదు. ఇక చివరగా రాజకీయ పార్టీలు గానీ, ప్రజలు గాని న్యాయవ్యవస్థ గౌరవానికి భంగకరంగా వ్యవహరిస్తే కఠినంగా శిక్షించే వ్యవస్థను నిర్మాణం చేయవలసిందే.

-ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

94417 37877

Next Story