- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నదాతకు భరోసా.. కృషి విజ్ఞాన కేంద్రాలు
భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. దాదాపు 60 శాతం మంది జీవనోపాధి వ్యవసాయంపై ఆధారపడింది. అయితే గత కొన్నేళ్లుగా వాతావరణ మార్పులు

భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. దాదాపు 60 శాతం మంది జీవనోపాధి వ్యవసాయంపై ఆధారపడింది. అయితే గత కొన్నేళ్లుగా వాతావరణ మార్పులు, నీటి కొరత, నేల సారవంతం తగ్గిపోవడం, ఇన్‌పుట్ వ్యయం పెరగడం, మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితులు రైతు జీవితాన్ని కష్టతరం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు శాస్త్రీయ దిశా నిర్దేశం, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై అవగాహన అవసరమైంది. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని భారత వ్యవసాయ పరిశోధనా మండలి 1974లో ప్రారంభించిన కృషి విజ్ఞాన్ కేంద్రాలు ఇప్పుడు రైతు జీవితానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నాయి. ఇవి కేవలం శిక్షణా కేంద్రాలు కావు. ఇవి రైతు కోసం ఒక శాస్త్రీయ పాఠశాలలా పని చేస్తాయి. రైతులకు వివిధ రకాల శిక్షణా కార్యక్రమాలు, ప్రయోగ పద్ధతులు, సమస్య పరిష్కార పర్యటనలు నిర్వహిస్తాయి. విత్తన ఎంపిక, పంటల విభజన, నీటి నిర్వహణ, ఎరువుల వినియోగం, కీటక నిరోధక పద్ధతులు వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా రైతుకు సులభంగా అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పిస్తాయి. అలాగే వాతావరణ మార్పులపై రైతులకు ‘క్లైమేట్ రెసిలియంట్ ఫార్మింగ్ సిస్టమ్స్’ అనే పద్ధతులను పరిచయం చేస్తున్నాయి. వర్షపు నీటి సేకరణ, నేల తేమ సంరక్షణ, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ సిస్టమ్స్ వంటి నీటి సమర్థ వినియోగ పద్ధతులపై శిక్షణ ఇస్తున్నాయి. అదే విధంగా మట్టి ఆరోగ్య పరీక్షలు, సాయిల్ హెల్త్ కార్డుల ద్వారా ఎరువుల సమతుల్యతపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి. అలాగే రైతు ఆదాయం పెరగడానికి కేవలం పంటలకే పరిమితం కాకుండా అనుబంధ రంగాలపై దృష్టి పెట్టేందుకు.. పశు సంవర్ధక, మత్స్య, తేనెపట్టీ, పూల పంటలు, కూరగాయల ఉత్పత్తి, ప్రాసెసింగ్ వంటి రంగాల్లో రైతులను శిక్షణ ఇస్తున్నాయి. ఈ కేంద్రాల ప్రధాన ప్రత్యేకత ఫ్రంట్‌లైన్ డెమోన్‌స్ట్రేషన్లు. ఇవి రైతు పొలంలోనే కొత్త విత్తన శ్రేణులు, శాస్త్రీయ పద్ధతులు, ఆధునిక యంత్రాలు ఉపయోగించి ప్రత్యక్ష ప్రదర్శనలు చేస్తాయి. రైతులు స్వయంగా వీటిని చూసి, నేర్చుకొని తమ పొలాల్లో అమలు చేయడం వల్ల విజయశాతం ఎక్కువగా ఉంటుంది. ఇలా kvkలు శాస్త్రం, సాంకేతికత, అనుభవం ఈ మూడు దిశల్లో రైతును ముందుకు నడిపిస్తున్నాయి. రైతు బలమే దేశ బలం అన్న మాటను ఆచరణలో చూపిస్తున్నాయి. ఇవి బలోపేతం అవడం అంటే భారత వ్యవసాయం బలపడడం, గ్రామీణ సమాజం సుస్థిరం కావడం.
-గుమ్మడి దారి సాయికృష్ణ
90142 52482






