యథా ప్రజా..తథా రాజా

by Ravi |   (  Updated:2025-08-15 00:30:57  IST  )

మనలో చాలా మంది ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా వ్యవహరించరు. అంతెందుకు మనలో చాలా శాతం మంది ఓటు హక్కును

యథా ప్రజా..తథా రాజా
X

మనలో చాలా మంది ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా వ్యవహరించరు. అంతెందుకు మనలో చాలా శాతం మంది ఓటు హక్కును కూడా వినియోగించుకోరు. మిగిలినవారు మద్యం, డబ్బు కోసం ఓటుని అమ్ముకుంటాం. కానీ దేశంలో ఏదైనా పరిణామం జరిగితే అగ్గి మీద గుగ్గిలం అవుతాం. ఫలనా రాజకీయ నాయకుడు అంతా దోచుకున్నాడు. ఫలానా ప్రజా ప్రతినిధి ఇంత సంపాదించాడు. ఆ ఫలానా అధికారి పైసలు ఇవ్వనిది పనిచేయడు అని బదనాం చేస్తాం. కానీ మనం చేస్తున్నదేమిటి? ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో పని కావాలంటే అధికారికి డబ్బు ఆశ చూపిస్తున్నాం పని కానిచ్చేసుకుంటున్నాం. మనం నిజాయితీపరులమేనా? మీ పనికోసం మీరు ఆశ పుట్టిస్తారు. మళ్లీ మీరే వారిని బదనాం చేస్తారు. అది పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం అవుతుంది కదా. ఓ సామెత ప్రకారం ‘యధా రాజా తథా ప్రజా’ అంటారు. కానీ ఈ కాలంలో "యధా ప్రజా తథా రాజా" అనాలి. ఇది ప్రజాస్వామ్యం ముసుగులో రాజరికం. ఊరికి మంచి సుగుణాలు ఉన్న వాడిని సర్పంచ్‌గా ఎన్నుకుందాం. పనిచేసే వాడికే పట్టం కడదాం. నిజాయితీగా ఉంటూ ఊరికి సేవ చేసే వాడికే ఓటు వేద్దాం అని రచ్చబండ దగ్గర బడాయి పలుకుతాం. తీరా ఇంటికి వచ్చి ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వాడికి మన ఓటు అమ్ముకుంటాం. మనమా ఊరిని బాగు చేసే వాళ్లం? ఇలాంటి సమాజంలో ఉన్నాం కాబట్టే దేశంలో అవినీతిని ఆపడానికి ఎన్ని కఠిన చట్టాలు చేసినా కూడా అవినీతిని ఏ చట్టాలు పారదోలలేకపోతున్నాయి. అది ఆగాలంటే ముందు సమాజంలో ఆ మార్పు రావాలి. మేం మా దేశాన్ని ప్రేమిస్తున్నాం అని చెప్పడం కాదు చేతల్లో చెయ్యాలనే కోరిక పట్టుదల ఉండాలి. అలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని అందరూ కలిగి ఉంటేనే ఈ అవినీతిని పారదోలగలం... ప్రజాస్వామ్యం వర్థిలాలన్నా, దేశం బాగుపడాలన్నా, అవినీతి అంతం అవ్వాలన్నా మారాల్సింది ప్రభుత్వాలు కాదు. ప్రజలు..

-అంకం నరేష్

63016 50324

Next Story