- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికార మదమే ఓటమికి కారణం.. మూడు రాష్ట్రాల ఓటర్లు ఇచ్చిన సందేశం
2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళలో అధికార పార్టీల పరాజయాలకు కారణాలేమిటి? యువత ఆకాంక్షలు, మహిళా ఓటర్ల ఆగ్రహం, ఆర్థిక సంక్షోభం, అవినీతి ఆరోపణలు ఎలా ప్రభావం చూపాయో చదవండి.

ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలు కేవలం పాలనను మార్చే ప్రక్రియ మాత్రమే కాదు. అవి ప్రజల ఆకాంక్షలకు, పాలనా లోపాలకు అద్దం పట్టే సూచికలు.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో పాలక ప్రభుత్వాలు ఓటమి చెందడం అనేది యాదృచ్ఛికం కాదు. ఇది నాయకత్వ అంచనా తప్పిదాల వల్ల, క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించడం వల్ల సంభవించింది.
యువతలో మార్పు- డీఎంకే పరాజయం
తమిళనాడులో దశాబ్దాలుగా ద్రవిడ రాజకీయాలను శాసించిన భాష, సాంస్కృతిక ఆధిపత్యం, సామాజిక న్యాయం వంటి భావోద్వేగ అంశాలు నేటి ఆధునిక యువతను ఆకట్టుకోలేక పోయాయి. కొత్త తరం ఓటర్లు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, పారదర్శక పాలనను కోరుకున్నారు. రాష్ట్ర జీడీపీ, పారిశ్రామిక పెట్టుబడులు కేవలం చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు ప్రాంతాలకే పరిమితం కావడం వల్ల దక్షిణ, మధ్య తమిళనాడు ప్రాంతాలు తీవ్ర పారిశ్రామిక వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల ఏర్పడిన ప్రాంతీయ అసమానతలు, సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం చేస్తున్న భారీ అప్పుల భారం భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళన మధ్య తరగతి వర్గాల్లో బలంగా నాటుకుంది. మరోవైపు, సీట్ల పంపకాల విషయంలో మిత్రపక్షాలతో ఏర్పడిన అపశృతులు, అవినీతి ఆరోపణ లను పాలకులు తేలికగా తీసుకోవడం డీఎంకే కొంపముంచాయి. ప్రత్యేకించి మైనారిటీ ఓట్లు, కొత్త తరం నాయకత్వాలను ద్రవిడ పార్టీలు గుర్తించకపోవడం వల్ల ఓటు బ్యాంకులో చీలికలు వచ్చాయి. ఈ శూన్యాన్ని విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కులాలకు అతీతంగా, యువత, మహిళలను ఆకర్షించడం ద్వారా భర్తీ చేసింది.
పశ్చిమ బెంగాల్ మహిళా ఓటర్లలో తీవ్ర ఆగ్రహం
ఈ ఎన్నికల ఫలితాల్లో మమతా బెనర్జీ ఓటమి పాలవడానికి గల కారణాలను పరిశీలిస్తే ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీ ఘటన, సందేశ్‌ఖాలీ ప్రాంతంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలను ప్రభుత్వం సమర్థవంతంగా పరిష్కరించలేకపోవడం వంటి అంశాలు మహిళా ఓటర్లలో తీవ్ర ఆగ్రహాన్ని, అభద్రతా భావాన్ని నింపాయి. ఈ సామాజిక అశాంతిని సువేందు అధికారి ఒక బలమైన ఉద్యమంగా మార్చి, మమతా బెనర్జీ పాలనను అరాచక పాలనగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారు. మరోవైపు, ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి నాయకులపై వస్తున్న అవినీతి ఆరోపణలు, నియామకాల్లో కుంభకోణాలు, ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలనే రాజకీయ కక్షసాధింపు చర్యలు మధ్యతరగతి విద్యావంతులైన ఓటర్లను టీఎంసీకి దూరం చేశాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తుండటం అధికార పార్టీకి నష్టం చేకూర్చింది.
పారిశ్రామిక అభివృద్ధి లేదు..
కేరళ ఆర్థిక వ్యవస్థ నిర్మాణాత్మకంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి, అప్పుల నిష్పత్తి ప్రమాద కర స్థాయికి చేరడంతో, ప్రభుత్వం రోజువారీ నిర్వహణ, సంక్షేమ పథకాల కోసం భారీగా అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ అప్పుల భారం భవిష్యత్తులో తమపై పన్నుల రూపంలో పడుతుందనే ఆందోళన మధ్యతరగతి, విద్యావంతుల్లో బలంగా నాటుకుంది. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన యువతకు తగిన ఉపాధి అవకాశాలు లభించడం లేదు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు, కేరళలోని యువతను విదేశాలకు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లేలా చేశాయి. పినరయి విజయన్ నాయకత్వ శైలి, నిర్ణయాలు ఒకే చోట కేంద్రీ కరించడం, మంత్రుల అహంకార వైఖరి పార్టీకి ప్రజలకు మధ్య అగాధాన్ని సృష్టించాయి.
తెలియక చేసిన తప్పులు కావు..!
ఈ వైఫల్యాలు తెలియక చేసిన తప్పులు కావు. అవి పాలక పార్టీల అతి విశ్వాసం, అధికార మదం వల్ల జరిగినవి. తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రజలు తమ వెంటే ఉంటారనే నమ్మకం వారిని వాస్తవానికి దూరం చేసింది. పాలకులు తమ విధానాలను మార్చుకోకపోతే, ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పు తథ్యం అని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి.
-డి జె మోహన రావు
94404 85824






