- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవ్వయే‘అర్రాసు’ కథలు... మాండలికమే ‘రాజీ’ నగలు
రాజీ కన్నా పరేషాన్ సిన్మాలో డబ్బింగ్ చెప్పింది. అప్పటి నుంచి నా కెరుక. గాంధారి ఖిల్లలో "మా సక్కటి సిన్మా ముచ్చట"తో తొలి పరిచయం. ఆ తర్వాత కథలు పంపితే సద్విన. తెలంగాణలో పూర్వ అదిలాబాదుల

రాజీ కన్నా పరేషాన్ సిన్మాలో డబ్బింగ్ చెప్పినప్పటి నుంచి నా కెరుక. గాంధారి ఖిల్లలో మా సక్కటి సిన్మా ముచ్చటతో తొలిపరిచయం. తెలంగాణలో పూర్వ అదిలాబాదుల (మంచిర్యాల)దండేపల్లిలో అటు గంగకు, ఇటు అడవంచున తాళ్ళపేటలో పుట్టిన రాజీ కన్నా, జనుము తయారు చేసే ఉత్పత్తి కులాల పెరుక సామాజిక కుటుంబం తనది. ఎంతో కష్టభరితంగా డబ్బు దస్కం లేకున్నా ఉస్మానియా యూనివర్సిటీ జువాలజీలో ఎమ్మెస్సీ చదివి, కొన్ని రోజులు టీచింగ్ చేసి, ప్రస్తుతం ప్రింట్, డిజిటల్ దిశలో పనిచేస్తోంది.
లచ్చవ్వ చెబితే విని అవపోసన పట్టి ఉదెంల చపాయించింది. మీకెందుకు ఇట్ల జరిగిందని అన్న ప్రశ్న బహుశా లోలోపల గడ్డకట్టికుని లుంగీలు చుట్టిన ఏమో ఏమో అవ్వ తరం పడ్డ అవమానం స్థలం కాలాలు 1960లో దొరలు తమ గ్రామాల్లోని ప్రజల మీద దాడులకు దిగారు. హుజురాబాద్ మంధని, లక్షేటిపేట, పెద్దపల్లిలో ఆగడాలు ఎక్కువైనాయి. రైతులు తిరగబడి పోరాటం చేశారు. దర్ధ్ అణివేత, పెత్తనం, పీడనను అనుభవించిన రోజుల్లోనీ మనుషుల జీవితాలే కలానికి పదును.
జీవితం కోల్పోయిన కింది కులాల కథలు
భారతదేశంలోని జన్నారంలో భూముల లొల్లిలు, పంచాయతీలు ఒక వర్గం ఇంకోదాన్ని చంపడం చావడం.. అందులో కింది కులాల్లో జీవితాలు కోల్పోవడం. ఇదంతా 1970 నాటి అదిలాబాద్ చరిత్ర. కొన్ని జరిగినవి నిక్షిప్తం కానివీ ఈ కథల్లో ఆ పాత్రలను సజీవంగా ఉండేలా రాజీ సాహిత్యంలో నిలబెట్టింది. రాజీ ఊరుకు కల్శినట్టె గూడ అంజయ్యది లింగాపూర్ ఊరు. ఇనాం శెలుక, బీరుపూర్, అమ్మక్క, గౌరడు, జప్తి మానని గాయం మలిన ముద్దలు నా తెలంగాణ అని దండేపల్లిలో ప్రజల దళితులు బహుజనులు సాహిత్యమే రాసిండు. రాజయ్య కరీంనగర్ మాండలికంలో ఎదురు తిరిగితే ఒక సంచలనం.
వెంకట కిషన్ ఇట్యాల ధరణిలో కూడా ఆదిలాబాద్ జీవితాలను కథా వస్తువుగా గరంకోటు, అల్ప పీడన ద్రోణి, ధరణిలో రాసిండు. ఇయ్యాల మూడోతరం ప్రజలు జీవితంలోంచి చిత్రించిన నవలలు, కథలు రావాలే. దానికి రాజీ పూనుకొంది. ఈ కథల్లో కొత్త కొత్త జాతీయాలు, మాండలికంలో కడగొట్టు మాటలుంటయ్. ఉదాహరణకు ఇప్పటికిప్పుడు ఆ రెండు మూడు కిలోల కాయలు విప్పుకొని ఊరికి వోయ్యి ఏంజెత్త అటీతోని పదేళ్ళ పబ్బతి వెట్టి ఏడిశిండు( పేజీ 08)లో పదేళ్ళ పబ్బతి ఎంత గొప్పగా ఉంది.
జనం దుఖమే కథలుగా మారి...
ఇసోంటి అటి మీద నలిమల భాస్కర్, మడిపెల్లి భద్రయ్య 'మన భాష మన యాస' పేరుతో పదివేల పదాలతో తెలంగాణ మాండలికం డిక్షనరీ చపాయించిండు. మరొక డిక్షనరీ వేసేంత కొత్త మాండలికాలు పరిచయం చేసింది. ఎక్కడ దుఖముందో ఆడ కథలు ఉంటయ్ అది రష్యాల, తెలంగాణలో ఆ దర్ద్ ఉంది.
మరో దశకు తీసుకెళ్లిన సాహిత్యం 'అర్రాసు. పాతది పోయి కొత్తది పుడితే అది మార్పులకు సిద్ధపడి ఘర్షణకు లోనైతది. ఆ ఘర్షణే వాస్తవం వదిలి ట్రూత్ పట్టుకుంటుంది అవే ఈ కథలు ధోరణిలో రాటిబాయి, అగ్గి పూల దారి, పులుగు, వందలోటు అనుమానం, భీమి, జీతగాడు, అర్రాసు ఏడు కథలుగా రాసింది. ఇవి గతం, వర్తమానం, భవిష్యత్తులోకి విస్తరించేటివి. సాహిత్యానికి కళకూ మానవుడి సామాజిక జీవితమే మూలాధారం. చిన్నప్పుడు ఏ ప్రశ్నలతో బయలుదేరింది ఓ తను బయలు దేరిందో మళ్ళీ ఆ ప్రశ్నల దగ్గర చేరడం..
భీమి కథలో మైసన్ని మంత్రాలు పుకారుతో హత్యచేయించి పటేల్, మైసని పెండ్లానికి ఐదు వేలు పప్పులు, ఉప్పులుతో ఆదుకుని నీచుడైన గానీ, తన ఊరిలో అందరికి దేవుడిగా చిత్రించుకుంటాడు. వంద నోటు -అవమానం హాస్టల్ ఉండే పిల్లగాడు ఊరిలో అవ్వతో కలిసి వంద సంపాదిస్తే తిరిగొచ్చాక టీచర్ అనుమానిస్తాడు. ఇది కథ ఇరాన్ సినిమాలో చిల్డ్రన్ ఆఫ్ హెవెన్దృశ్యమే. ఒక తొమ్మిదేళ్ళ బాలుడు పేదరికాన్ని జయించడానికి డబ్బులు సంపాదించేందుకు పనులు చేస్తాడు. అది ఇరాన్ బీదతనం, ఇక్కడ పిల్లవాడిలో కనిపిస్తుంది. ఇయ్యాల భారతదేశంలో ఏ టీచర్ గానీ కొట్టకుండా తిట్టకుండా స్టూడెంట్‌ని అర్థం చేసుకోని సిస్టం లేదు.
నీ పెండ్లాన్ని తోలు...
రాటుబాయిలో ఉత్పత్తి కులాల మనుషులు నీతిగలోల్లు ఎవరున్నా బట్టకాల్సి మీదేస్తే ఎట్ట కుమిలిపోయి సత్తరో అదే కథ. జీతగాడులో సుంగు జీతగాడుగా రికం లేని వెట్టి చాకిరి బతుకు. ఓసారి జెరమత్తే నీ పని ఎవడు జెత్తెడు ఇడిసివెట్టి పోతే, నీ పెండ్లాన్ని తోలు, అరిగిపోతద కరిగిపోతదా(పేజీ29)అన్నడు దొర మాటలకు కలుక్కుమంది సుంగుకి.
అర్రాసు.. గుండెలనిండా విషాదం
అర్రాసు పెట్టుబడి, మధ్యతరగతి కుటుంబాల్లోకి మార్కెట్ విస్తరిస్తున్న కాలంలో పైసలు రోకు పెరిగిన అత్త, కోడలు సావుకి కారణం. అది విషాద భరితం. కన్నతండ్రి కచ్చులంలో సొంతూరికి పీనుగుపట్టికచ్చి దహనం చేత్తడు పేజీ నెం 56లో. ఒక వైపు ప్రజలు సంఘటితంగా, సామూహిక ఒక్కటైంది ఉంటే ఇంకోన్ని రాజవ్వ ముచ్చట్లతో ఆదివాసీలు కార్మికులు, వ్యవసాయం జేసేటోళ్ళు మూడు ముఖాలు చూడోచ్చు . రీతి రివాజుల చదవొచ్చు మిమ్మల్ని ఆదిలాబాద్ అంతటా తింపుకత్తది .గుడిరేవు నెమలీకలు సూత్తవా రాజమ్మ పాటలో అన్నట్టు గుడి రేవు నుంచి మార్లవాయీ గుస్సాడి కనకరాజు ఊరు దాకా పోయి ఉట్నూర్ ఇప్పపూల తీపి లడ్డు తినిపిత్తది.. అది శెప్పవశంగాదు.. అవి జూడాలే గంతే.
చిన్నప్పటి ఖయాల్ గుజ్రే జమాన యాద్ అతీ హై అన్నట్లు ఉంటుంది. రచయిత్రి ఎంత ప్రకృతి ఆరాధకురాలో అర్థమౌతుంది. భిభూథి భూషణ్ వనవాసీ నవలలో మహలిఖారూప పర్వతాల్లో, మోహన్ పురా అరణ్యాలలో ఇక్కడి అడవిలో తిరిగినట్లు సౌందర్య ఆరాధకులుగా మారుతాం మనం. అవి తను ఊహించి రాసినవి కాదు. ప్రాక్టీస్, అధ్యయనం పరిశీలన కథలు. ఇప్పుడు అచ్చేటియన్నీ కర్రె ఇరుగది పాము సావది రకం కావు. మధ్యతరగతి జీవితాల మీద గోర్కి ప్రజలు వద్దకు పోయీ, చైనాలో లూషన్ లాగా రాజీ కథలు మాలవ్ దండిగుంటయ్.
పుస్తకం రిలీజ్ రోజున ఊళ్ళోనే లచ్చవ్వని కలిస్తే బిడ్డా.... కథలు సద్విన తన్నుకచ్చిన దుఖాన్ని కండ్లల్లా సూపింది ఇగ ఎట్లుంటయో నేను చెప్పేదేముంది. అక్టోబర్ 14వ తేదీ రవీంద్రభారతిలో బోధి ఫౌండేషన్ అర్రాసు చపాయించింది. అల్లం నారాయణ, ఖాదర్, పల్లవి, గోరటి వెంకన్న దీన్ని విడుదల చేశారు. రిలీజ్ రోజే అర్రాసు 25,516 రుపాయలు పలికింది. తప్పక చదవగలిగిన కథల పుస్తకం.
పుస్తకం: అర్రాసు
రచయిత: రాజీ కన్నా
పేజీలు: 130
ధర: 180
ప్రచురణ: బోధి ఫౌండేషన్
ప్రతులకు: అమెజాన్ వెబ్‌సైట్, నవోదయ, న్యూ విశాలాంధ్ర, లోగిలి
సమీక్షకులు
అక్కల చంద్రమౌళి
సినీ గేయ రచయిత
91775 41446






