- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈహెచ్‌ఎస్ అమలులో వెనుకబడ్డామా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వారి జీవన ఆరోగ్య

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వారి జీవన ఆరోగ్య భద్రతకై పలు ప్రయోజనకర ఉత్తర్వులను వెలువరించింది. అందులో భాగంగానే ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కీమ్ ఉద్యోగులకు, పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు.. కొన్ని షరతులకు లోబడి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ, ఆమోదించబడిన ప్రైవేటు ఆసుపత్రులలోనూ ఒక సంవత్సరమునకు రెండు లక్షల రూపాయలు మించకుండా వైద్యం అందించడం జరుగుతుంది. అయితే, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఈ విషయంలో కాస్త వెనుకబడి ఉండడం వాస్తవం.
మొదటగా ఈ స్కీమ్‌లో నగదు రహిత చికిత్స ఉండేది. తర్వాత కాలంలో వారు ఖర్చు చేసిన మొత్తాన్ని రీయింబర్స్మెంట్ చేసుకోవడానికి రెండు లక్షలకు లోబడి అనుమతించడం జరిగింది. మన రాష్ట్రంలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు కొన్ని రకాలైన క్లిష్టమైన వ్యాధులకు ఎల్ఓసి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత క్లెయిమ్ చేయబడిన బిల్లు మొత్తాన్ని ప్రభుత్వం వారు చెల్లిస్తారు. కానీ మిగతా ప్రైవేటు ఆసుపత్రుల్లో తీసుకున్న చికిత్సలకు గాను ముందుగా ఉద్యోగి గాని, పెన్షనర్ గాని ఖర్చు చేసి సంబంధిత బిల్లులను ప్రాపర్ ఛానల్ ద్వారా సమర్పించి నగదును షరతులకు లోబడి పొందవచ్చును. కానీ చాలా రాష్ట్రాల్లోని ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌లను పరిశీలించినప్పుడు మన రాష్ట్రం కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి.
కేంద్ర స్కీమ్‌లో అన్‌లిమిటెడ్ చికిత్స!
ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం వారు (సీజీహెచ్ఎస్) సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్‌ను చాలా సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కీములో ఎన్‌రోల్ అయిన దాదాపు 60 లక్షల మంది పైగా నగదు రహిత వైద్య చికిత్సను లిమిట్ లేకుండా పొందుతున్నారు. ఈ స్కీమ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ (రైల్వే ఉద్యోగులు, ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ తప్పించి) అందరికీ వర్తిస్తుంది. ఈ స్కీమ్‌లో దేశవ్యాప్తంగా 80 ప్రదేశాల్లోని వివిధ రకాల హాస్పిటల్‌లను ఎంపానెల్ చేయడం జరిగింది. సదరు ఆసుపత్రులలో నగదు రహిత చికిత్సను ఉద్యోగి కానీ పెన్షనర్ కానీ వారిపై ఆధారపడిన వారందరు పొందవచ్చును. దీనికోసం ఆయా ఉద్యోగుల క్యాడర్‌ను అనుసరించి అంటే 1 నుండి 5 లెవెల్ వరకు నెలకు 250 రూపాయలు, 6 లెవల్ వారికి 450 రూపాయలు, ఏడు నుండి 11 లెవెల్ వారికి 650 రూపాయలు, 12 లెవెల్ దాని పైన ఉన్న వారికి 1000 రూపాయలు చొప్పున సబ్‌స్క్రిప్షన్ రూపంలో వసూలు చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్‌లో ఎంత మొత్తానికైనా నగదురహిత చికిత్సను అందిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల్లో..
అలాగే కొన్ని ఇతర రాష్ట్రాల్లోని ఎంప్లాయిస్ హెల్త్ స్కీములను పరిశీలించినప్పుడు అవి చాలా చక్కగా పనిచేస్తున్నాయి. తక్కువ సబ్‌స్క్రిప్షన్‌తో పెద్ద మొత్తాన్ని నగదు రహిత చికిత్సకు, అట్లే రియంబర్స్మెంట్‌కు అనుమతిస్తున్నాయి. వీరికి సాధారణ వ్యాధులకు గాను ఐదు లక్షలకు మించకుండా, క్లిష్టతరమైన వ్యాధులకు గాను 10 లక్షలకు పైబడి నగదు రహిత అట్లే రియంబర్స్మెంట్‌గా కూడా అందిస్తున్నారు. ఉద్యోగి నుండి నెలకు 300 రూపాయలు, పెన్షనర్స్ నుంచి నెలకు 495 రూపాయలు సబ్‌స్క్రిప్షన్‌గా వసూలు చేస్తున్నారు.
క్యాష్‌లెస్ వైద్య సేవలు లేవు!
ఈ సందర్భంగా మొట్టమొదటి తెలంగాణ పే రివిజన్ కమిషన్ వారి సిఫార్సులను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. వారు స్పష్టంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం, కార్పస్ ఫండ్, ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్ల నుండి ప్రతి నెలా కొంత మొత్తం తీసుకోవడం గురించి, అట్లే ట్రస్ట్ పనిచేసే విధి విధానాల గురించి స్పష్టంగా చర్చించడం జరిగింది. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కూడా ప్రతి నెల వాళ్ల బేసిక్ శాలరీ నుండి అట్లే పెన్షన్ నుండి ఒక శాతం ఇవ్వడానికి ఇదివరకే అంగీకరించి ఉన్నారు. సీపీఎస్ ఎంప్లాయిస్‌ను కూడా ఈ హెచ్ఎస్ పరిధిలోకి తీసుకురావడానికి అట్లే వారి బేసిక్ పే నుండి ప్రతి నెల ఒక శాతం చెల్లించడానికి సిఫార్సు చేసి ఉన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత పెన్షన్ చెల్లించబడదు కనుక రిటైర్మెంట్ సమయంలో కొద్ది మొత్తంలో ఒకేసారి ప్రీమియం వసూలు చేసి వారికి కూడా ఈ హెచ్‌ఎస్ సేవలు కొనసాగింపునకు సూచించడం జరిగింది. తెలంగాణలో క్యాష్ లెస్ మెడికల్ సేవలు నిలిచిపోయి చాలా సంవత్సరాలు అయింది. ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ, ఆయా రాష్ట్రాల్లోని ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌లను పరిశీలించి మన రాష్ట్రంలో కూడా ఉత్తమమైన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను సత్వరమే ఏర్పరిచి ఇక్కడి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను అట్లే సీపీఎస్ ఉద్యోగులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-సి మనోహర్ రావు,
విశ్రాంత ప్రభుత్వ అధికారి,
85198 62204






