- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీపీ బ్రౌన్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నామా?
నూరార్లు లెక్కచేయక/ పేర్లెక్కిన విబుధవరుల బిలిపించుచువే/ మార్లర్థమిచ్చు వితరిణి /చార్లెసు ఫిలిప్ బ్రౌన్ సాహెబు కరుణన్" అని సమకాలిక పండితులచే కీర్తించబడిన బ్రౌన్ తనది కాని దేశం, తనది కాని జాతి, తనది కాని తెలుగు భాష, సాహిత్యాల కొరకు జీవితాన్ని అంకితం చేసి తెలుగు పునరుజ్జీవన పితామహుడిగా పేరుపొందాడు.

"నూరార్లు లెక్కచేయక/ పేర్లెక్కిన విబుధవరుల బిలిపించుచువే/ మార్లర్థమిచ్చు వితరిణి /చార్లెసు ఫిలిప్ బ్రౌన్ సాహెబు కరుణన్" అని సమకాలిక పండితులచే కీర్తించబడిన బ్రౌన్ తనది కాని దేశం, తనది కాని జాతి, తనది కాని తెలుగు భాష, సాహిత్యాల కొరకు జీవితాన్ని అంకితం చేసి తెలుగు పునరుజ్జీవన పితామహుడిగా పేరుపొందాడు.
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ 1798 నవంబర్ 10వ తేదీన కలకత్తాలో రెవరెండ్ డేవిడ్ బ్రౌన్, కౌలే దంపతులకు రెండో సంతానంగా జన్మించాడు. 1817 లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగ శిక్షణా కాలంలో తెలుగు నేర్చుకున్నాడు. తన తండ్రి లాగానే గ్రీక్, లాటిన్, హిబ్రూ, ఫ్రెంచి, ఇటాలియన్, పర్షియన్, తెలుగు, సంస్కృత భాషలలో సిపి బ్రౌన్ పండితుడయ్యాడు.
కలెక్టర్‌కు సహాయకుడిగా వచ్చి..
బ్రౌన్ కడప కలెక్టర్ హన్బరికి రెండవ సహాయకుడిగా 1820 ఆగస్టులో తెలుగు నేలపై అడుగు పెట్టాడు. కడప కేంద్రంగా తెలుగు సాహిత్యంలో బ్రౌన్ కృషి రెండు రకాలుగా జరిగింది. మొదటిది ఇంగ్లీష్ వారి కోసం తెలుగు వ్యాకరణం, వాచకాలు రూపొందించడం, రెండవది అగ్గి పురుగులకు ఆహారమవుతున్న తాళపత్రాలను సేకరించి, పరిష్కరించి ముద్రించటం. కడపలో 2000 వరహాలతో ఒక బంగ్లా, 15 ఎకరాల తోటను కొని, 15 మంది పండితుల్ని పోషించి, సేకరించిన తాళపత్ర గ్రంథాలను ఎత్తిరాయించి, పరిష్కరింపజేసి, వాటికి ముద్రణ రూపం ఇచ్చాడు. ఈ బంగ్లాలో జరిగిన సాహిత్య క్రతువు వలననే తెలుగు సాహిత్య పంట పండింది.
ఇతిహాసాల పరిష్కర్త
భారతీయులకు ముఖ్యమైన ఇతిహాసాలుగా కొలువబడుతున్న భారతం, భాగవతం, రామాయణం, విష్ణు పురాణం, పద్మ పురాణాలతో పాటు మొత్తం 36 పురాణ, ఇతిహాసాలను సేకరించాడు. 2714 రూపాయలు ఖర్చు చేసి మహాభారత శుద్ధప్రతిని తయారు చేశాడు. పంచవింశతి, హంసవింశతిలకు పద సూచికలు, రాయించాడు. హరిశ్చంద్రోపాఖ్యానం, వైజయంతి విలాసం, బసవ పురాణం, సారంగధర కావ్యం, నవనాథ చరిత్రలను పరిష్కరించి ముద్రణ భాగ్యం కల్పించాడు. తెలుగువారి సాంఘిక జీవితాలను తెలియజేసే పల్నాటి వీర చరిత్ర వివిధ ప్రతులను సేకరించి పరిష్కరింపజేశాడు. మంత్ర తంత్రాలకు సంబంధించిన సౌందర్యలహరి, ఆనంద తంత్రం, కులర్ణవం గ్రంథాలను సేకరించాడు. ఋగ్వేదానికి భాష్యం రాయించాడు. మొత్తం 84 శతకాలను సేకరించి కొన్నింటికి వ్యాఖ్యానం రాయించడంతో పాటు అచ్చు వేయించాడు.
నిఘంటు నిర్మాణంలో ఆద్యుడు
నిఘంటువుల నిర్మాణంలో కూడా తెలుగువారికి ఆద్యుడు బ్రౌన్. ఇంగ్లీష్- తెలుగు నిఘంటువు, తెలుగు- ఇంగ్లీష్ నిఘంటువు, జిల్లా నిఘంటువులను తయారు చేశాడు. ముస్లింల పాలన వలన తెలుగు భాషలో చేరిన అరబిక్, ఫారసీ, ఉర్దూ భాషా పదాలే కాక మలయాళ, తమిళ, కన్నడ పదాల అర్థ వివరణలతో మిశ్ర భాషా నిఘంటువును తయారు చేసి 1854లో ముద్రించాడు. 1852లో లిటిల్ లెక్సికన్ ను ప్రచురించాడు.
జానపద సాహిత్య సేకర్త
జానపద సాహిత్యానికి కూడా బ్రౌన్ ప్రాముఖ్యతను ఇచ్చాడు. 1843 ఆగస్టులో ఒక సంచార గాయకుడి చేత బాల విక్రమార్కుడి పెండ్లి కథ, రామదాసు అనే గాయకుడి చేత బొబ్బిలి కథ, కుమార రాముడి కథ, కామమ్మ కథ చెప్పించి రాయించాడు. తెలుగులో లేఖా సాహిత్యానికి మూలపురుషుడు బ్రౌన్. చారిత్రక ప్రాధాన్యత,సాహిత్య రూపం కలిగిన లేఖలను తను సేకరించినవి ఇతరులు తనకు రాసినవి మొత్తం 20 సంపుటాలు, తను సేకరించిన చాటువులు , మెకంజి సేకరించిన కైఫీయత్తులను దళసరి కాగితాలపై రాయించినవి ఇవన్నీ ప్రస్తుతం మద్రాస్ ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలో ఉన్నాయి.
ఆంధ్రాంగ్ల అనువాదకుడు
తెలుగు నుండి ఆంగ్లంలోకి కూడా అనువాదాలు చేశారు. రాయలసీమలో సంచరించి వేమన పద్యాలతో ఉన్న 30 తాళపత్ర గ్రంథాలను సేకరించి, 1152 పద్యాలను పరిష్కారం చేయించి, మత, నీతి ,అధిక్షేప ,మర్మ మరియు కలగూరగంప అనే పేర్లతో ఐదు భాగాలుగా విభజించాడు.' ది వర్సెస్ ఆఫ్ వేమన' అనే పేరుతో 693 పద్యాలను ఆంగ్లంలోకి అనువాదం చేశాడు. బసవ పురాణం, రాజుల యుద్ధాలు అనే అనంతపురం చరిత్రను ఆంగ్లంలోకి తర్జుమా చేసి 1853లో ప్రచురించాడు. ప్రభులింగలీల, శ్రీకాళహస్తి మహాత్మాలకు ఇంగ్లీషులో కథా సంగ్రహం రాశాడు. బ్రౌన్ తన జీవిత కాలంలో కడప, మచిలీపట్నం, రాజమండ్రి, తిరుచునాపల్లి, గుంటూరు, మద్రాస్ లలో రిజిస్టర్ గా, జడ్జిగా, కలెక్టర్ గా ఏ స్థాయిలలో పనిచేసినా తెలుగు సాహిత్య సేకరణ, పరిష్కరణ మాత్రం మరువలేదు. అవివాహితుడై అహోరాత్రాలు శ్రమించడం వలన పక్షవాతానికి గురై 1854 మే 1న స్వచ్ఛందంగా పదవి విరమణ చేశాడు .1855లో లండన్ వెళ్లి తిరిగి భారతదేశానికి రాలేదు. లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ గా చేరి తన చివరి శ్వాస వరకు అక్కడ కూడా తెలుగు భాషను బోధిస్తూ 1884లో ఈ లోకాన్ని వదిలిపెట్టాడు.
బ్రౌన్ చేసిన విశేష సేవకు గుర్తుగా కడపలో వారి పేరు మీద 1992లో గ్రంథాలయాన్ని స్థాపించి, 2006 లో సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేసి గౌరవిస్తే, తెలంగాణ ప్రాంతంలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ' సీపీ బ్రౌన్ సాహిత్య సేవ' పేరుతో పాఠ్యాంశంగా చేర్చారు. 29 అక్టోబర్ 2025 రోజు బ్రౌన్ జన్మించిన నవంబర్ 10వ తేదీని రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం బ్రౌన్‌కు తెలుగు ప్రజలు ప్రకటించే నిజమైన నివాళి.
(నేడు సీపీ బ్రౌన్ జయంతి)
-డా. మల్లికార్జున్ పెబ్బేటి
94918 81916






