ఆ రెండు బొగ్గు గనుల వలన సింగరేణికి నష్టమేనా?

by Disha edit |
ఆ రెండు బొగ్గు గనుల వలన సింగరేణికి నష్టమేనా?
X

రెండు దశాబ్దాలుగా లాభాలలో ఉన్న సింగరేణికి, కోల్ ఇండియాకు వేలం ద్వారా బ్లాకులను కేటాయించే విధానమే తప్పు, రాష్ట్రం బయట వరకు ఓకే. కానీ, 'మా బొగ్గు-మా హక్కు' వేలం దారుణం, అన్యాయం. కేంద్రం పునరాలోచించాలి. కోయగూడెం గనికి రాష్ట్రం కొన్ని క్లియరెన్స్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు కొర్రీలు తప్పవు. స్థానిక సంస్థల ప్రతినిధులు, యూనియన్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ప్రతిఘటనా ఉంటుంది. సింగరేణి కార్మికులు దశాబ్దాలుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారన్న సంగతి మరువద్దు.

తెలంగాణకు గుండెకాయ, కొంగు బంగారం అయిన సింగరేణి యాజమాన్యం ఇప్పుడు భారీ నష్టాలను భరించడానికి సిద్ధంగా లేదు. 2016 నవంబర్‌లో సింగరేణికి కేటాయించిన కొత్తగూడెం సమీపంలోని 'పెనుగడప' ఒడిశా అంగుల్ జిల్లాలోని 'పార్థపద' బ్లాకులను వాపస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28, 29 తేదీలలో జరుగబోయే బోర్డు సమావేశాలలో ఇందుకు సంబంధించిన ఆమోదం పొంది సరెండర్ ప్రక్రియ మొదలు పెడుతారు. ఈ బొగ్గు బ్లాకుల వలన సంస్థకు లాభం కన్నా నష్టమే ఉంటుందని యాజమాన్యం భావిస్తున్నది.

'పార్థపద'కు బదులుగా దీనికి తొమ్మిది కిలోమీటర్‌ల దూరంలో, ఇప్పటికే ప్రారంభానికి సింగరేణి సిద్ధం చేసుకుని ఉంచిన 'నైని' బ్లాక్‌కు పక్కనే ఉన్న 'బైసరని వెస్ట్' బ్లాక్‌ను కోరాలని అనుకుంటున్నది. ఒడిశాలో ' స్ట్రిప్పింగ్ రేషియో మూడు మీటర్ల కన్నా ఎక్కువ ఉండదు. అదే సింగరేణిలో 10 నుంచి 13 మీటర్ల దాకా ఉంటుంది. స్ట్రిప్పింగ్ అంటే మట్టిని తీయడం అన్న మాట. అందుకే లాభాల కోసం సింగరేణి బయట బొగ్గు బ్లాకుల మీద శ్రద్ధ చూపుతున్నది. సింగరేణిలో భూగర్భ గనులకు వెళ్లే అవకాశం ఉంది. వాటిని తవ్వితే నాణ్యత కలిగిన బొగ్గు వస్తుంది. తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. ఆ దిశన వెళితే మంచిది. పెనుగడప బ్లాక్ మీద సింగరేణి బ్యాంక్ గ్యారంటీ 37 కోట్ల రూపాయలు (బీజీ), పార్థపద మీద బీజీ రూ. 642 కోట్లు. బ్లాకులు వాపస్ చేస్తే బీజీ తిరిగి ఇస్తారు. ఇందుకు సంబంధించిన చట్టం రావడం ఇప్పుడు సింగరేణికి మంచి అవకాశం.

నష్టం తప్పదని భావించి

'పెనుగడప' సర్వే , అనుమతులు, డ్రిల్లింగ్ కోసం సంస్థ రూ.15 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టుకున్నది. అనుమతులు కూడా వచ్చాయి. ఇప్పుడది వర్క్ఔట్ కాదని అక్కడి జి-17 బొగ్గు నాణ్యత లేనిదని తేల్చారు. 'పార్థపద'కు రూ.100 కోట్ల దాకా కేటాయించి 60 కోట్లు ఖర్చు చేసారు. ఇక్కడ అన్నీ భారీ భవనాలు ఉన్నాయి. వాటికి భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే దీనిని వాపస్ చేస్తున్నారు. దీంతో కంపెనీకి రూ.75 కోట్ల రూపాయలు నేరుగా లాస్ అనేది నిజం. 'పెనుగడప' బ్లాకులో 105 మిలియన్ టన్నుల బొగ్గు ఉంది. ఇల్లందు ఏరియా మరో ఏడెనిమిది యేండ్లలో మూత పడుతుంది. మణుగూరుకు తొమ్మిది యేండ్ల తర్వాత ఏమీ ఉండదు. ఫ్యూచర్ ఇబ్బందికరమే. 'పెనుగడప' బొగ్గు పవర్ ప్లాంట్‌లకు ఉపయోగపడుతుంది. దీనిని సరెండర్ చేయాలనుకుంటే ఇల్లందు, మణుగూరు ఏరియాలకు ప్రత్యామ్నాయ బ్లాకుల కోసం ప్లాన్ చేయాలి. 'పెనుగడప' బ్లాక్ నుంచి వాస్తవానికి 2021 ఫిబ్రవరి నుంచే బొగ్గు ఉత్పత్తి రావాలి. కేంద్ర బొగ్గు గనుల శాఖ కొంత సమయం ఇవ్వడంతో 'పెనుగడప'ను వాపస్ ఇవ్వాలని భావించినట్లు కనిపిస్తున్నది.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా

నిజానికి కేంద్రం 2015 నుంచి బొగ్గు బ్లాకులను వేలం ద్వారా కేటాయించడం ప్రారంభించింది. సుప్రీంకోర్టు చెప్పిన 204 బ్లాకులతో పాటు ఎంఎండీఆర్ పాత, కొత్త 250 బ్లాకులను ప్రభుత్వం వేలం వేస్తున్నది. ఇప్పటికే 14 దశల వేలంలో 172 బ్లాకులను అలాట్ చేసారు. ఇందులో 75 గనులు ఉత్పత్తి ప్రారంభించాయి. మిగిలిన బ్లాకులను ఇంకా ప్రారంభించలేదు. తవ్వకం మొదలు పెట్టనివాటిని సెప్టెంబర్ లోపు వాపస్ చేయాలని కేంద్రం సూచించింది. రెవెన్యూ బేస్ మీద పర్ టన్నుకు ఇంత అని నిర్ణయించి కేంద్రం మూడు, నాలుగు రకాల ఫీజులను వసూలు చేస్తుంది. వేలం ద్వారా 1,65,000 కోట్ల రూపాయల ఆదాయం గడించాలని కేంద్రం భావిస్తున్నది. ఇప్పటికీ 30,000 కోట్ల ఆదాయం వచ్చింది. వాపస్ చేసిన బ్లాకులను తిరిగి వేలం వేస్తారు. కోయగూడెం-3 బ్లాక్‌కు సింగిల్ బిడ్ వచ్చినందున దానిని 'అరబిందో'కు కేటాయించే అవకాశం ఉంది. ఇదంతా కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్యన జరుగుతున్న యుద్ధానికి పరాకాష్ట అనిపిస్తున్నది.

వారు తవ్వడం అనుమానమే

నాలుగు బ్లాకులను వేలం నుంచి మినహాయించి నేరుగా ఇవ్వాలని సింగరేణి కోరుతున్నది. ఇందుకోసమే సింగరేణి కార్మికులు సమ్మె కూడా చేసారు. కోయగూడెంను ఎవరికి కేటాయించినా కార్మికులు, యూనియన్ నేతలు తవ్వనిచ్చే పరిస్థితి ఉండదు. ఈ విషయంలో స్టేట్, కార్మికులు, యూనియన్లు ఒక్కటిగానే ఉన్నారు. అందరూ సింగరేణి భవిష్యత్తు కోసమే చూడాలి. విషయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్ట, రాజకీయాలకు సంబంధించింది కాదని, సంస్థ అభివృద్ధి, భవిష్యత్ తరాల ఉపాధికి సంబంధించిందని గుర్తించాలి. రెండు దశాబ్దాలుగా లాభాలలో ఉన్న సింగరేణికి, కోల్ ఇండియాకు వేలం ద్వారా బ్లాకులను కేటాయించే విధానమే తప్పు, రాష్ట్రం బయట వరకు ఓకే. కానీ, 'మా బొగ్గు-మా హక్కు' వేలం దారుణం, అన్యాయం. కేంద్రం పునరాలోచించాలి. కోయగూడెం గనికి రాష్ట్రం కొన్ని క్లియరెన్స్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు కొర్రీలు తప్పవు. స్థానిక సంస్థల ప్రతినిధులు, యూనియన్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ప్రతిఘటనా ఉంటుంది. సింగరేణి కార్మికులు దశాబ్దాలుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారన్న సంగతి మరువద్దు.

ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223


Next Story

Most Viewed