National voters day: ఈసీ లక్ష్యాలు నెరవేరుతున్నాయా?

by Ravi |   (  Updated:2025-01-25 01:15:19  IST  )

దేశంలో ఎన్నిక‌ల క‌మిష‌న్ ఏర్పాటు వారికి కావ‌ల‌సిన అధికారాలు, విధులు భార‌త రాజ్యాంగ అధికరణ 324 నిర్దేశిస్తుంది.

National voters day: ఈసీ లక్ష్యాలు నెరవేరుతున్నాయా?
X

దేశంలో ఎన్నిక‌ల క‌మిష‌న్ ఏర్పాటు వారికి కావ‌ల‌సిన అధికారాలు, విధులు భార‌త రాజ్యాంగ అధికరణ 324 నిర్దేశిస్తుంది. ముఖ్యంగా ఎన్నిక‌ల అధికారి, ఇత‌ర క‌మిష‌న్ స‌భ్యుల‌ను భార‌త రాష్ట్రప‌తి నియ‌మిస్తారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ ఒక స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి గ‌ల రాజ్యాంగ సంస్థ‌. అధికరణ 324 ప్ర‌కారం దేశంలో 1950 జ‌న‌వ‌రి 25న ఎన్నిక‌ల క‌మిష‌న్‌ని ఏర్పరిచారు. ఆ త‌రువాత 2011 నుంచి ఆ రోజును జాతీయ ఓట‌రు దినంగా ప‌రిగ‌ణిస్తూ ప్ర‌తి సంవ‌త్స‌ర‌ం ఓట‌ర్ డే ను నిర్వ‌హిస్తున్నాం.

భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న్ దేశ పార్ల‌మెంట్, రాష్ట్ర అసెంబ్లీ, మండ‌లి ఎన్నిక‌లను జ‌రుపుతుంది. అలాగే రాష్ట్రప‌తి, ఉప‌రాష్ట్రప‌తి ఎన్న‌ికలు కూడా నిర్వ‌ హిస్తుంది. ఈ కమిషన్ 18 సంవ‌త్స‌రాలు దాటిన ప్ర‌తి పౌరుడిని ఓట‌రుగా న‌మోదు చేసి ఎన్నిక‌లు నిర్వ‌హించాలి. అయితే పౌరులు కూడా తాము ఓట‌రు ప‌ట్టికలో పేరు ఉన్న‌ది లేనిది తెలుసుకోవాలి. కొన్ని సంద‌ ర్భా ల‌లో ఓట‌రు జాబితాలో నుంచి పేర్లు తొలగి పోవ‌డం కూడా జ‌రుగుతుంది. ఈ విష‌యం ఎన్నిక‌ల క‌మిష‌న్ వారు ఓట‌రు ప‌ట్టిక‌లు తాలూకా ఆఫీసు నోటీసు బోర్డుల‌లో పెడ‌తారు. అలాగే పోలింగ్ బూత్ కి ఒక బూత్ స్థాయి అధికారి కూడా ఉంటారు. వీరి వ‌ద్ద ఓట‌రుగా న‌మోదు చేసుకునే వీలుంది. అదీకాక క‌మిష‌న్ ఓట‌రు న‌మోదుకు సుల‌భ మార్గాలు సూచిం చింది.

దేశంలో 100 కోట్ల ఓటర్లు..

ఓట‌రుగా న‌మోదు చేసుకోవ‌డం ఒక ప్ర‌క్రియ అయితే పోలింగ్ బూత్ వ‌ర‌కు వెళ్లి ఓటు వేయ‌డం, ఇత‌రుల‌ను కూడా ఓటు వేయ‌డానికి ప్రేరేపించ‌డం ఇంకో ఎత్తు. భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న్ వారి లెక్క‌ల ప్ర‌కార‌ం, ప్ర‌స్తుతం దేశంలో 100 కోట్ల మంది ఓట‌ర్లు న‌మోదైనారు. ఇంత‌కు పూర్వ‌ం మ‌హిళా ఓట‌ర్ల సంఖ్య పురుషుల ఓట‌ర్ల కంటే త‌క్కువ‌గా ఉండేది. రాను రాను ఇది త‌గ్గుతూ ప్ర‌స్తుతం మ‌హిళా ఓట‌ర్లు కూడా ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా పురుష ఓట‌ర్ల‌తో స‌మానంగా ఉన్నారు. గ‌త కొన్ని ఎన్నిక‌ల ఫ‌లితాలు ప‌రీక్షిస్తే గ్రామ ప్రాంతంలో పోలింగ్ శాతం 90 వ‌ర‌కు ఉండ‌గా ప‌ట్ట‌ణాల‌లో 50 నుంచి 60% వ‌ర‌కు పోలింగ్ జ‌రుగుతుంది. ప‌ట్ట‌ణాల‌ లో చ‌దువుకున్న వారి సంఖ్య అధికంగా ఉన్నా విద్యావంతుల‌కు ఎన్నిక‌ల‌పై అనాస‌క్తి ఉంది. దీనికి ముఖ్య‌ కార‌ణం బ‌రిలో ఉన్న అభ్య‌ర్థులు వారికి న‌చ్చ‌క‌పోవ‌డం.

సీలింగ్‌కు మించి వంద రెట్ల ఖర్చు!

ఇక‌పోతే దక్షిణ భార‌త‌దేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల ఎన్ని క‌లు చాలా ఖ‌ర్చుతో కూడుకుని ఉన్నాయి. ఎన్నిక‌ల క‌మిష‌న్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థికి 40 ల‌క్ష‌లు మించ‌కుండా అలాగే పార్ల‌మెంటుకు 95 ల‌క్ష‌ల‌కు మించ‌కుండా ఖ‌ర్చు చేయాల‌ని ఆదేశాలు ఇచ్చినా వాస్త‌వానికి చాలామంది అభ్య‌ర్థులు క‌మిష‌న్ విధించిన సీలింగ్ ఖర్చు కంటే 100 రెట్లు ఎక్కువ‌గా ఖ‌ర్చు చేస్తున్నారు. దుర‌దృష్టం ఏంటంటే ప్ర‌జ‌లు ఓటును అంగట్లో అమ్ముకునే స‌రుకు కింద ప‌రిగ‌ణించి ఓటు అమ్ముకుంటున్నారు. ఇది ఈ నాలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జ‌రుగుతుంది. ఇటువంటి ప‌రిస్థితుల‌లో అంగ‌బ‌ల‌ం, అర్థ‌బ‌ల‌ం ఉన్న‌వారే ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌డం, గెలువడం జ‌రుగుతుంది. దీనికి తోడు రాజ‌కీయ‌ పార్టీలు కూడా ప్ర‌జాధ‌నాన్ని వాడుకుంటూ అంతులేని ఉచితాలు (హామీలు) ఇవ్వ‌డంతో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జారి, రాష్ట్రం అప్పుల పాల‌వుతుంది. అలాగే ప్ర‌జ‌లు కూడా ఎన్నిక‌లంటే ఉచితాలు అలాగే ఓటు అమ్ముకోవ‌డం, మ‌ద్యంలో మునిగితేల‌డం, కులం పేరున‌, మ‌తం పేరున ఓట్లు వేయ‌డం జ‌రుగుతుంది. మంచివారు, విద్యా వంతులు, సామాజిక కార్య‌క‌ర్త‌లు ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటున్నారు. దానితో నేర‌చ‌రిత్రులు, భూక‌బ్జాదారులు మ‌న చ‌ట్ట స‌భ‌ల‌లో కూర్చుంటున్నారు.

ఒక్క సీటు ఎన్నిక ఖర్చు 36 కోట్లా?

ఇక‌పోతే ఎన్నిక‌ల క‌మిష‌న్ కూడా ఎన్నిక‌ల నిర్వ‌ హ‌ణ‌కు పెద్ద ఎత్తున ప్ర‌జాధ‌నాన్ని ఖ‌ర్చుచేస్తుంది. ఇట్టి ఖ‌ర్చుకు ఎటువంటి ఆడిట్ జ‌రగ‌డం లేదు. ఉదాహ‌ ర‌ణ‌కు మొన్న తెలంగాణ‌లో జ‌రిగిన పార్ల‌‌మెంట్ ఎన్నిక‌ల‌లో పోటీదారు రూ.95 ల‌క్ష‌ల‌కు మించి ఖ‌ర్చు చేయ‌రాదు. కానీ ఒక పార్ల‌మెంటు సీటు ఎన్నిక నిర్వ‌ హించడానికి తెలంగాణలో క‌మిష‌న్ వారు అక్ష‌రాల రూ.36 కోట్లు ఖ‌ర్చు చేసారు. ఇంత ఖ‌ర్చు ఏ విధంగా చూసినా స‌మ‌ర్థ‌నీయం కాదు.

ఉచితాలు పక్కన పెట్టకుంటే...

రాజ‌కీయ‌పార్టీలు గెలుపు గుర్రాల‌ను మాని, మంచివారిని ఎన్నికల‌లో నిల‌బెట్టాలి. అలాగే ప్ర‌జాధ‌నంతో ప‌నికిమాలిన ఉచితాలు, గ్యారంటీలు, హామీలు మాని పేద‌ల‌కు మంచి విద్య‌, నాణ్య‌మైన వైద్యం, ఉపాధి వంటి వాటిని అంద‌జేయాలి. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల స‌ర‌ళిని గమ‌నించిన‌ప్పుడు మ‌నం ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్ర‌జాస్వామ్యం అని చెప్పుకున్నా మ‌న ప్ర‌జాస్వామ్యం ఏ విధంగా న‌డుస్తుంది? అభివృద్ధి ఫ‌లాలు అంద‌రికీ అందుతున్నాయా? ముఖ్యంగా అణ‌గారిన‌ వ‌ర్గాల అభివృద్ధి ఎంత మేర‌కు జ‌రుగుతుంది అన్న‌ది ఒక జ‌వాబులేని ప్ర‌శ్న‌.

(నేడు జాతీయ ఓటర్ దినోత్సవం)

యం. ప‌ద్మ‌నాభ‌రెడ్డి

అధ్య‌క్షులు

ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్

Next Story