అమ్మాయిల అభివృద్ధిని అడ్డుకునే పథకాలు.. అవసరమా?

by Ravi |   (  Updated:2025-11-30 01:00:23  IST  )

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైనా లబ్దిదారుల కుటుంబాలనే గాక సమాజ స్థితిగతులను కూడా మార్చేవై ఉండాలి. సమాజ హితంను కోరకుండా వ్యక్తిగత అవసరాలను తీర్చే ఏ పథకమైనా ప్రభుత్వం ఆశించిన ఫలితాలను ఇవ్వదు. పైగా ఇలాంటి పథకాలు ప్రభుత్వ ఖజానాకు గుదిబండగా మారుతాయి.

అమ్మాయిల అభివృద్ధిని అడ్డుకునే పథకాలు.. అవసరమా?
X

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైనా లబ్దిదారుల కుటుంబాలనే గాక సమాజ స్థితిగతులను కూడా మార్చేవై ఉండాలి. సమాజ హితంను కోరకుండా వ్యక్తిగత అవసరాలను తీర్చే ఏ పథకమైనా ప్రభుత్వం ఆశించిన ఫలితాలను ఇవ్వదు. పైగా ఇలాంటి పథకాలు ప్రభుత్వ ఖజానాకు గుదిబండగా మారుతాయి. రాష్ట్రంలో సమాజహితం, సంక్షేమం గాకుండా వ్యక్తిగత ప్రయోజనాలను చేకూర్చే పథకం ఏదైనా ఉందంటే అది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్.

ఈ పథకాన్ని పేద, మధ్య తరగతి వారిని లక్ష్యంగా చేసుకొని 2014లో ప్రవేశపెట్టారు. ఆడపిల్లల పెళ్లిళ్ల ఖర్చుల కోసం పెళ్లి కుమార్తె తల్లిదండ్రులకు ఆర్థిక ఆసరాను అందించడానికి పథకం అమలు చేశారు. పథకం ప్రారంభంలో యాభై వేలుగా నిర్ణయించి కాల క్రమంలో దానిని లక్ష నూట పదహారులకు పెంచి ఇవ్వడం జరుగుతోంది. దీంతో ప్రభుత్వ ఖజానాపై ఏటా 3,683 కోట్ల ఆర్ధిక భారం మోపబడుతుంది.

ఎవరికి మేలు చేసింది?

నిజం చెప్పాలంటే ఈ పథకం అమ్మాయిల పాలిట శాపంగా పరిణమించింది. దీనిని పొందగోరే లబ్దిదారులకు ఆర్థిక సహాయం పెళ్లికి ముందు గాకుండా పెళ్లైన సంవత్సరం తరువాత అమ్మాయి తల్లిదండ్రులకు నగదు అందిస్తున్నారు. ఆ వచ్చిన నగదును అమ్మాయిల తల్లిదండ్రుల కంటే కొత్తగా పెళ్లైన అల్లుళ్లే తీసుకుంటున్న సందర్భాలు అనేకం.. కౌమార దశకు చేరుకున్న ఆడపిల్లలలో ఎక్కువ మంది పేదరికం వల్ల చదువును మధ్యలో ఆపేస్తున్నారు. దాదాపు రాష్ట్రంలో తొమ్మిదవ తరగతి నుండి ఇంటర్ వరకు బడి మధ్యలో మానేస్తున్న అమ్మాయిల డ్రాప్ అవుట్ శాతం 6.3గా నమోదు అయ్యింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల మంది పదవ తరగతి, సుమారు లక్షన్నర మంది అమ్మాయిలు ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్నారు. ఇక రాష్ట్రం మొత్తం జనాభాలో 15-19సం.ల మధ్య వయసు గల అమ్మాయిల్లో చాలమంది పౌష్టికాహార లోపంతో బక్కచిక్కి అనేక ఆరోగ్య, మానసిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు.. ఇక ఈ పథకాల వలన ఆడపిల్లకు పద్దెనిమిది సంవత్సరాలు నిండగానే పెళ్లిచేసి తల్లిదండ్రులు చేతులు దులుపుకోవాలనే సంస్కృతికి బీజం పడింది. ముఖ్యంగా గిరిజన తండాలలో, ముస్లిం కుటుంబ సభ్యుల్లో అమ్మాయిల పెళ్లిళ్లను తొందరగా చేయాలనే ఆతృత పెరిగిపోయింది.

దీర్ఘకాలిక దృష్టి ఏది?

ఆడపిల్లల కొరకు ఉద్దేశించిన పథకాలు ఖచ్చితంగా వారి అభివృద్ధి, సంక్షేమానికి ఉపయోగపడాలి. కానీ సమా జంలో ఇప్పటికి అనేక కుటుంబాలలో అమ్మాయిల పట్ల వివక్ష కనబడుతూనే ఉంది. అబ్బాయిలను ప్రయివేటు పాఠశాలలకు, అమ్మాయిలను ప్రభుత్వ పాఠశాలలకు పం పడం నేటికిని సాధారణ విషయంగా పరిగణించబడుతుంది. ఇలాంటి వివక్షలు, అసమానతలను తగ్గించడానికి కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌లతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ పథకం పేరుతో ప్రభుత్వమే పిల్లలలో లింగ భేదాన్ని మరింత పెంచి పోషించేందుకు కారణమౌతుంది. కాబట్టి దీని స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం గురించి ఆలోచించాలి. పథకం ఏదైనా సామాజిక రుగ్మతలను పెంచేదిగా కాకుండా, రూపుమాపేదిగా ఉండాలి. దీనికి బదులు ఆడపిల్లల చదువు, వారి సానిటేషన్, పౌష్టికాహార విషయాలను మెరుగు పరిచే వాటి గురించి ప్రభుత్వం పునరాలోచించాలి. కోట్లాది రూపాయలు కుమ్మరించి సమాజాన్ని అస్థిరపరిచే సంక్షేమ పథకాలతో లాభం ఏమిటి?

ఈ పథకాలు ఓట్లు కురిపిస్తాయా?

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఓట్లు కురిపించేదే అయితే గత ప్రభుత్వమే మళ్లీ గెలవాలి. సంక్షేమ పథకాలు ఓట్లు కురిపించే మాట వాస్తవమే. కానీ తిరిగి అధికారంలోకి రావాలంటే అవే పరమావధి కాదు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లో సమాజహితానికి, మార్పుకు కారణమయ్యే అంశాలు ఎంత మాత్రం లేవు. ప్రభుత్వమే అమ్మాయిల తరపున పెళ్లి పెద్దలా వ్యవహరించి వారి బంగారు భవిష్యత్ ఆశలపై నీళ్లు చల్లుతుంది. పైగా ఈ పథకాలలో లబ్దిదారుల ఎంపిక ఓ ప్రహసనమే. ఒక దిక్కు ప్రభుత్వ పాఠశాలలలో, కళాశాలల్లో కనీస వసతులు కల్పించలేక ప్రభుత్వం ఇబ్బంది పడుతుంటే మరో దిక్కు అమ్మాయిల భవిష్యత్తుకు ఎలాంటి ఉపయోగకరంగా లేని ఈ పథకానికి వేల కోట్ల రూపాయలను కేటాయించడం దురదృష్టకరం. ప్రజల మనసులను ఇలాంటి పథకాలు తాత్కాలికంగా గెలుచుకోగలవు. ప్రజాకర్షణ కలిగిన పథకాలే ఎన్నికలప్పుడు ఉపయోగ పడతాయనుకోవడం భ్రమే. సమాజ మార్పుకు ప్రధాన కారణం విద్య, వైద్యం. ఈ రంగాలపైన చేసే ఖర్చులే ప్రభుత్వ పనితీరును నిర్ణయిం‌చగలుగుతాయి. అందువల్ల సమాజంలో సగ భాగమైన అమ్మాయిల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. అమ్మాయిలను తిరోగమనంలోకి నెట్టే ఈ పథకాల కంటే వారి భవిష్యత్ ఎదుగుదలకు ఉపయోగపడే పథకాలపై ప్రభుత్వం దృష్టి సారించడం మంచిది.

-డాక్టర్ సందెవేని తిరుపతి

చరిత్ర పరిరక్షణ సమితి

98496 18116

Next Story