- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్వాడీలు అక్రమ వలసదారులా? వారిపై కుట్రలు చేస్తున్న శక్తులేవి?
వైశ్యులు దోపిడీదారులు, సమాజ ద్రోహులు, స్మగ్లర్లు అని దుమ్మెత్తి పోసిన కులోన్మాద బ్యాచ్ నేడు 'మార్వాడీలు గో బ్యాక్' నినాదాన్ని తెలంగాణలో నెత్తికెత్తుకున్నది.

వైశ్యులు దోపిడీదారులు, సమాజ ద్రోహులు, స్మగ్లర్లు అని దుమ్మెత్తి పోసిన కులోన్మాద బ్యాచ్ నేడు 'మార్వాడీలు గో బ్యాక్' నినాదాన్ని తెలంగాణలో నెత్తికెత్తుకున్నది. హిందూ సమాజాన్ని కులాల వారీగా విభజించి, వారిలో విబేధాలు సృష్టించి తమ మనుగడను కాపాడుకోవాలని తలపోసిన కొందరి దుష్ట పన్నాగాన్ని ఈ దేశ హితాన్ని కోరే ప్రతీ వ్యక్తి తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. కుల ఉన్మాద సంఘాలను పెట్టుకుని, కొన్ని వర్గాల వారిని బ్లాక్ మెయిల్ చేసి, మనుగడ సాగించే కొన్ని శక్తులు ఈ దేశంలో గట్టి పునాదితో నడుస్తున్నాయి. అందుకు విదేశీ ఏజెన్సీలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. భారత దేశంలో కుల రాజకీయాలతో అంటగాగే రాజకీయ పార్టీలు ఈ శక్తుల వెనుక ఉన్నాయనేది వాస్తవం.
ఒక ఘటనను సాకుగా తీసుకుని..
'తెలంగాణ మేధావులు' అనే సంఘం వారు మార్వాడీల వ్యాపార దక్షత వల్ల తెలంగాణలోని వైశ్యుల వ్యాపారాలు దెబ్బ తిన్నాయని, అందుకే మేము మార్వాడీలూ గో బ్యాక్ అనే వాదనను సమర్థిస్తున్నామని అంటున్నారు. ఇదే నిజమైతే -కంచ ఐలయ్య బ్యాచ్ వైశ్యులపై అవాకులు, చవాకులు పేలిన విషయంలో గోడమీది పిల్లి ప్రవర్తనను ఎందుకు ప్రదర్శించినట్లు? ఎక్కడో మార్వాడి షాప్ యజమానికి, పనివాడికి మధ్య జరిగిన ఉదంతాన్ని మొత్తం సమాజానికి అన్వయించి దుర్మార్గపు ఆలోచనలు చేయడం మేధావులమని చెప్పుకునే వారికి తగునా? ఇక మార్వాడీలు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు కాబట్టి వారు ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేయకూడదనే ఆలోచన చేసిన వారికి అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఉన్నత పదవులలో ఉన్న భారతీయులు కనిపించలేదా? ఆయా దేశాల ప్రజలు ఇలాంటి ఆలోచన చేస్తే అక్కడి భారతీయుల పరిస్థితి ఏమిటి?
మార్వాడీలపై ఇంత దుష్ప్రచారమా?
ఇక మార్వాడీలపై దుష్ప్రచారాలు చేసే వారి నేపథ్యాన్ని పరి శీలిస్తే, వారంతా హిందూ సంస్కృతిని, హిందుత్వ విలువలను గుడ్డిగా వ్యతిరేకించే వారే. మార్వాడీలు హిందూ సంస్కృతిని, హిందూ ధార్మిక విషయాలను నిక్కచ్చిగా అనుసరిస్తూ, హిందూ ధర్మ పరిరక్షణకు తాము సంపాదించుకున్న ధనంలో కొంత ఖర్చు చేస్తారు. వారు దేశ చట్టాలను గౌరవిస్తారు. పన్నులు సక్రమంగా కడతారు. నిజమైన భారతీయతకు వారు వారసులు. హిందుత్వ వ్యతిరేకులకు మార్వాడీల పట్ల ద్వేషం, వ్యతిరేకత ఏర్పడడానికి ఇది ఒక కారణం.
వ్యాపారం.. కులమతాల బట్టీ నడవదు
ఒక కులం వారు వ్యాపారంలో రాణిస్తున్నారని, వారి వలన వ్యాపారాన్ని వృత్తిగా పెట్టుకున్న వారికి జీవనోపాదులు కరువు అవుతున్నాయనే వాదన సమర్థనీయం కాదు. దేశంలో పండ్లు, కూరగాయలు, పూలు, మాంసం వంటి వ్యాపారాలన్నీ ముస్లింల చేతిలో ఉన్నాయి. ఈ విషయంలో హిందువులు వారి పట్ల అసూయను ప్రదర్శిస్తే, ఆర్థిక వ్యవస్థ నడుస్తుందా? వ్యాపారమంతా దక్షత, పొదుపు, నిజాయితీ, సమయపాలన, కష్టపడే మనస్తత్వం ఇత్యాది విషయాలపై ఆధారపడి ఉంటుందనేది విజ్ఞుల అభిప్రాయం. ఐరన్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసి, ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలను ఆర్జించిన లక్ష్మీ మిట్టల్(భారత్) పర్షియా (ఇరాన్) దేశ వారసులైన టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారిని ఈ విషయంలో ఉదాహరణలుగా పరిగణించవచ్చు. అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలలో రాజ్యాధికారం కోసం భారతీయులు పోటీపడుతున్నారనే విషయం వాస్తవమే కదా?
ఉన్మాదం పెరగడం ఖాయం..
మహారాష్ట్ర మహారాష్ట్రీయులకే అనే నినాదంతో శివసేన నాయకులు, దేశంలో అనేక సమస్యలకు కారకులయ్యారు. హిందీ ఉత్తరాది భారతీయుల భాష అని, తమిళనాడులో ఆ భాష ఉనికిని అడ్డుకోవాలని, డీఎంకే నాయకులు చేస్తున్న ఉన్మాద చేష్టలు, హింసాత్మక కార్యక్రమాలు, తెలంగాణ ప్రాంతీయ వాదం ఈ జాతి చవిచూసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, పక్క వీధిలో ఉండేవాడు మా వీధిలో ఎందుకు ఇల్లు కొనుక్కోవాలి అనే ఉన్మాద స్థాయికి ప్రజలు చేరుతారు. భారత్ విశ్వ గురువు కావాలనే కల కల్లగానే మిగులుతుంది.
-ఉల్లి బాల రంగయ్య,
సామాజిక, రాజకీయ విశ్లేషకులు.
94417 37877






