అరకు కాఫీతో గిరిజనుల జీవితాల్లో.. కొత్త వెలుగులు

by Ravi |   (  Updated:2025-04-04 00:46:10  IST  )

ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాజం నుంచి పుట్టిన అరకు కాఫీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. ఈ విభిన్న

అరకు కాఫీతో గిరిజనుల జీవితాల్లో.. కొత్త వెలుగులు
X

ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాజం నుంచి పుట్టిన అరకు కాఫీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. ఈ విభిన్న రుచిని ప్రపంచానికి పరిచయం చేసిన గిరిజన రైతులు, వారి కృషికి గుర్తింపుగా అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తూర్పు కనుమల్లో గిరిజనులు సహజ పద్ధతుల్లో సాగు చేసే అరకు కాఫీ ఖ్యాతి ఇప్పటికే ఖండాంత రాలను దాటేసింది. ఇటీవలే అరకు కాఫీ ఆర్గానిక్ సర్టిఫికేషన్‌ను సాధించగా, తాజాగా పార్లమెంటు ప్రాంగణంలో స్టాళ్లు ఏర్పాటైన ఘనతనూ సొంతం చేసుకుంది. దీంతో మన్యం గిరిజనానికి మరోసారి గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టింది.

అరకు కాఫీ అదుర్స్

విశేషమైన సువాసన, అనుపమానమైన రుచి, తక్కువ ఆమ్లత, సహజమైన తియ్యదనంతో ప్రత్యేకమైన ఈ అరకు కాఫీ ఆరోగ్యానికి మేలు చేసే లక్షణాలతో ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రియులను ఆకర్షిస్తోంది. దేశీయంగా మాత్రమే కాకుండా, విదేశాల్లోనూ మంచి డిమాండ్ సంపాదించుకుంది. అరకు కాఫీని ప్రత్యే కంగా నిలిపే ప్రధాన అంశం.. దాని సేంద్రియ సాగు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతులు రసాయన ఎరు వులు లేకుండా సంప్రదాయ, సహజ విధానాలను అనుసరించి ఈ కాఫీని పెంచుతున్నారు. ఈ ప్రకృతి సిద్ధ కాఫీ గింజలు ఆరోగ్యానికి హితంగా ఉండటమే కాకుండా, మృదువైన రుచితో కాఫీ ప్రియులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి.

మన్యంలో మొదలై విస్తరించి...

కేంద్ర కాఫీ బోర్డు గణాంకాల ప్రకారం 2.54 లక్షల టన్నుల ఉత్పత్తితో కర్ణాటక మొదటి స్థానంలో నిలుస్తోంది. తర్వాతి స్థానాల్లో కేరళ, తమిళనాడు , ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ పాడేరు పరిధిలో గల ఏజెన్సీ ప్రాంతం నుంచే మొత్తం ఉత్పత్తి జరుగుతోంది. విశాఖ మన్యంలో 80వ దశ కంలో వందల ఎకరాల్లో మొదలైన కాపీ సాగు అంచెలంచెలుగా విస్తరించింది. నేడు 2.41 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు పండిస్తున్నారు. రెండు లక్షల మంది గిరిజనులకు ఈ తోటలే జీవనాధారంగా నిలుస్తున్నాయి.

పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్

ఇటీవల అరకు కాఫీ ప్రాముఖ్యతను మరింతగా చాటే విధంగా భారత పార్లమెంట్ ప్రాంగణంలో ప్రత్యేక అరకు కాఫీ స్టాల్ ప్రారంభించబడింది. అంతర్జాతీయ మార్కెట్‌ని లక్ష్యంగా చేసుకుని “అరకు గ్లోబల్ బ్రాండ్‌గా మారేందుకు ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా అరకు కాఫీ' అనే కాన్సెప్ట్‌ని ప్రోత్సహిస్తూ, దేశీయంగా, అంతర్జాతీయంగా అరకు కాఫీ ప్రాధాన్యతను మరింత పెంచేందుకు ప్రభుత్వ చొరవ అభినందనీయమైనది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ బ్రాండ్లతో పోటీపడే స్థాయికి అరకు కాఫీ ఎదిగింది. ఇది కేవలం ఒక కాఫీ మాత్రమే కాదు, భారతీయ కృషి, సంప్రదాయ వ్యవసాయ నైపుణ్యానికి సజీవ నిదర్శనం. ఏడేళ్ల క్రితం కిలో పార్చిమెంట్ కాఫీకి రూ.130 ధర పలికితే, ఈ ఏడాది గరిష్టంగా రూ.450 కి ఆర్గానిక్ కాఫీని గిరిజన సహకార సంస్థ కొనుగోలు చేస్తుంది. దీంతో రైతులకు మూడు రెట్లు అధిక ఆదాయం సమకూరింది. పదేళ్ల క్రితం తీసుకొచ్చిన సమగ్ర కాపీ అభివృద్ధి ప్రాజెక్టు సాగు విస్తీర్ణాన్ని పెంచడమే కాకుండా గిరిజనుల కుటుంబాల్లో ఆనం దాలు పూయిస్తోంది. కాఫీ సాగు మన్యం గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది.

ఎన్.సీతారామయ్య

94409 72048

Next Story