అభివృద్ధి..సంక్షేమం మిక్స్!

by Ravi |   (  Updated:2025-03-01 00:30:24  IST  )

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించింది. ఈ ఆర్థిక

అభివృద్ధి..సంక్షేమం మిక్స్!
X

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3.24 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారు.. రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రధానంగా సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కేటాయింపులు చేసి అభివృద్ధి సంక్షేమ చక్రాలపై విజన్ 2027 లక్ష్యంతో స్వర్ణాంధ్ర రధం ప్రగతి పధంలో పరుగులిడే దిశగా చేపట్టే చర్యలకు ప్రతిబింబం ఈ బడ్జెట్.

రాష్ట్రంలో 62 శాతం జనాభాకు ఆసరాగా ఉంటూ రాష్ట్ర ఆర్దిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న వ్యవసాయ రంగం గత ప్రభుత్వ పాలనలో నిరాదరణకు గురైయింది. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కృషి వికాస్ యోజన ద్వారా బిందు సేద్యాన్ని ప్రోత్సహించడానికి నిధుల కేటాయింపు జరిపింది. ఇది నీటి ఎద్దడి ప్రాంతాలలోని రైతులకు లాభదాయకం. దీనికి ఏటా 20 వేల రూపాయలు అందించేలా కేటాయింపులు జరిపారు. 21.87 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 9 గంటల ఉచిత విద్యుత్ అందించడం, వ్యవసాయ అనుబంధ రంగాలు పాడి పరిశ్రమకు, మత్స్య పరిశ్రమ, పౌల్ట్రీ కూరగాయల సాగు, ఉద్యానవన పంటలకు ప్రోత్సాహకాలు లాంటి చర్యలకు కేటాయింపులు చేయడం వ్యవసాయ రంగానికి చేయూత నిస్తుంది.

సంక్షేమానికి పెద్దపీట

బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వృద్దులను ఓటు బ్యాంకుగా పరిగణించకుండా వారికి అసరా కల్పించటం సామాజిక బాధ్యతగా భావించి భరోసా పింఛన్ 4000 రూపాయలను ఆందిస్తోంది. షెడ్యూల్డ్ కులాల, తెగల విద్యార్థుల విద్య సామాజిక భద్రతపై, ఆర్థిక సాధికారత పై ప్రభుత్వం దృష్టి సారించింది. జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలో నిరంతరం నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడం చాలా కీలకం. నైపుణ్య గణన చేసి నైపుణ్యాభివృద్ధికి ఉపాధి కల్పనకు చేయూతనిస్తూ కేటాయింపులు చేయడం యువతకు లాభించే అంశం. చేతి వృత్తులు, హస్త కళాకారులు ఇతర సంప్రదాయ వృత్తుల వారికి ఆదరణ పథకం పునః ప్రారంభించింది. దీపం పథకం కోసం 2,601 కోట్ల రూపాయలను కేటాయించి 3 ఎల్.పి.జి సిలిండర్ ఉచితంగా ఇవ్వాలన్నది గృహిణులకు వరం.

తల్లికి వందనం

సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం రూ. 15000 అందించటం వల్ల విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది చదువుకోవడానికి చదువు చెప్పించడానికి ఆసక్తి పెరుగుతుంది. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం, ద్వారా ఉచిత పుస్తకాలు ఏకరూప దుస్తులు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టిక అహారం అందించడం వల్ల మధ్యలో చదువు మానేసే విద్యార్దులను అరికట్టి తిరిగి వారిని పాఠశాలకు రప్పించేందుకు దోహదకారిగా మారుతుంది.

ఆరోగ్య బీమా పెంపు

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల వైద్య బీమాను కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వైద్య అరోగ్య కుటుంబ సంక్షేమానికి 19,264 కోట్ల రూపాయల కేటాయింపు ఆరోగ్యశాఖకు జవసత్వాలను ఇస్తుంది. గ్రామాలు శక్తి సంపన్నమై స్వయం సమృద్ధి, సాధికారతతో తులతూగకపోతే దేశాభివృద్ధి అసంపూర్తిగానే ఉండిపోతుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్ఫూర్తితో సమగ్ర గ్రామ పంచాయతీ అభివృద్ధి గ్రామీణ మౌలిక సదుపాయాల రూపకల్పన అభివృద్ధి, జల జీవన్ మిషన్, స్వచ్చభారత్ మిషన్, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వంటి కార్యక్రమాలు కేంద్ర నిధుల సహాయంతో చేపట్టడం. రాష్ట ప్రభుత్వ నిధులను జోడించి ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ వాటి నుంచి విద్యుత్ ఉత్పత్తి గ్రామాల ఆర్థిక సామాజిక ముఖచిత్రాన్ని మారుస్తుంది.

పోలవరానికి నిధుల వరాలు..

ఈ భూమిపై ఏదైనా అద్భుతం ఉందంతే అది నీరే... అన్న లోరెన్ ఐస్లీ ఆంత్రోపాలజిస్ట్ వ్యాక్యాలు స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరానికి నిధుల వరాలను కేంద్రం ఇతర ఆర్థిక సంస్దలు ప్రకటించాయి. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్న సంకల్పతో రాష్ట బద్జెట్‌లో కేటాయింపులు, బనకచర్ల నదుల అనుసంధానానికి, చిన్న మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల మరమ్మత్తులకు, నిర్వహణకు కాలువల పటిష్టతకు ఆయకట్టు పెంపుకై నిధులను కేటాయించడంతో సాగునీరు, తాగు నీరు సమృద్ధిగా ఆందించాలన్న కృత నిశ్చయానికి తార్కాణం.

స్వీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నిర్మాణానికి అదనపు నిధులు, స్వీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్‌కు అనుమతులు, పెట్టుబడులను ఆకర్షించే విధంగా పారిశ్రామిక పర్యాటక విధానాల రూపకల్పన, ప్రోత్సాహకాలు, ఆర్థిక రంగ స్వావలంబనకు ఉత్ప్రేరకాలు. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ తెలుగు భాషా భివృద్దికి 10 కోట్ల రూపాయల కేటాయింపు, నవోదయం 2.0 పథకం ద్వారా మాదకద్రవ్యాల గంజాయి నిర్మూలన నూతన అంకుర సంస్థలకు చేయూత, టాటా ఇన్నోవేషన్ హబ్, కాలుష్య రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి హరిత శక్తిని ప్రోత్సహించటం వాటికి అంచెల వారీగా నిధుల కేటాయింపు నూతన శకానికి నాంది పలుకుతుంది. వికసిత్ భారత్ స్ఫూర్తితో విజన్ 2047 దిశగా స్వచ్చమైన ఆరోగ్యవంతమైన వివేకమైన ఆర్థిక స్వావలంబన దిశగా నూతన ప్రభుత్వం కృతనిశ్చయంతో కార్యాచరణ చేపట్టడం ముదావహం. బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు అంకెలలో మాత్రమే కాకుండా ఆచరణలో పెట్టాలి. పారదర్శకమైన పాలన అందిస్తూ ఆధికారులను సైతం పరిపాలనలో భాగస్వాములను చేస్తూ వారి జవాబుదారీతనాన్ని పెంచాలి. సంక్షేమం అభివృద్ధి సమతుల్యంగా అందిస్తే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా అవకాశాలకు పెట్టుబడులకు గమ్యస్థానం కాగలదు. ఆ దిశగా పాలకులు ఆలోచించి ఆచరణ చేపట్టాలి.

వాడవల్లి శ్రీధర్

99898 55445

Next Story