ఏపీ బడ్జెట్... ఓ సంకల్ప పత్రం!

by Ravi |   (  Updated:2026-02-17 12:38:26  IST  )

ఆంధ్రప్రదేశ్ 2026–27 బడ్జెట్ మరియు అభివృద్ధి వ్యూహాలు ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి దిశగా ప్రభుత్వం రూపొందించిన భారీ ప్రణాళిక రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేసిన చర్యగా భావించవచ్చు..

ఏపీ బడ్జెట్... ఓ సంకల్ప పత్రం!
X

ఆంధ్రప్రదేశ్ 2026–27 బడ్జెట్ మరియు అభివృద్ధి వ్యూహాలు ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి దిశగా ప్రభుత్వం రూపొందించిన భారీ ప్రణాళిక రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేసిన చర్యగా భావించవచ్చు.. 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో మూడు ప్రధాన నగరాలను ఆర్థిక చోదక శక్తులుగా గుర్తించారు.. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఈ వ్యూహం రూపకల్పనలో నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించింది.

రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆర్థిక అసమానతలను తొలగించి, ప్రతి జిల్లాలో సమాన వృద్ధి సాధించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. నగరాల అభివృద్ధి మాత్రమే కాకుండా గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలకు కూడా అభివృద్ధి ఫలాలు చేరేలా ప్రణాళికలు రూపొందించబడ్డాయి. పారిశ్రామిక, సేవారంగ, వ్యవసాయ రంగాల్లో సమతుల్య వృద్ధి సాధించడం ద్వారా రాష్ట్రాన్ని 2047 నాటికి అగ్రస్థానంలో నిలపాలనే దీర్ఘకాల దృష్టితో విధానాలు రూపొందించారు. ఆభివృద్ది సంక్షేమం ఆనే సూత్రాల ప్రాతిపదికపై ఆంధ్ర ప్రదేశ్ సమూల ఆర్దిక ఆభివృద్దికి 2026 - 27 బడ్జెట్ ఓ సంకల్ప పత్రం.

ప్రాంతీయ సమాన వృద్ధి!

ప్రాంతీయ సమాన వృద్ధి విశాఖపట్నం ఆర్థిక ప్రాంతాన్ని పారిశ్రామిక శక్తికేంద్రంగా తీర్చిదిద్దే దిశగా శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలను కలుపుతూ ప్రత్యేక ప్రణాళిక సిద్ధమైంది. తయారీ, ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు వంటి ఏడు కీలక రంగాలను అభివృద్ధి అక్షాలుగా గుర్తించారు.. సుమారు 41 భారీ ప్రాజెక్టులతో రూ.28,000 కోట్ల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నారు.. మెట్రో రైలు, పోర్టు విస్తరణ, పరిశ్రమల పార్కుల ఏర్పాటు ద్వారా రవాణా సదుపాయాలు మెరుగుపడి, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. అమరావతి ఆర్థిక ప్రాంతం రాజధాని చుట్టూ సమగ్ర వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలను ఈ పరిధిలో చేర్చారు. రాజధాని నిర్మాణానికి రూ.6,000 కోట్లు కేటాయించడంతో పాటు మౌలిక సదుపాయాల విస్తరణ, సహజ వనరుల సమర్థ వినియోగం, ప్రత్యేక పరిశ్ర‌మల కారిడార్ల ఏర్పాటు వంటి చర్యలు చేపడు తున్నారు. రాజధాని చుట్టూ ఉన్న జిల్లాలన్నింటినీ ఒకే ఆర్థిక వలయంలోకి తీసుకురావడం ద్వారా ప్రాంతీయ అసమానతలు తగ్గే అవకాశముంది.

హార్టికల్చర్ హబ్‌గా సీమ..

రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు రూ.30,000 కోట్ల భారీ ప్రణాళిక సిద్ధమైంది. 2030 నాటికి 14.41 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. 200కు పైగా వ్యవసాయ క్లస్టర్లు, 303 మండలాల్లో ఆధునిక సాగు విధానాలు, సూక్ష్మ సేద్యం, సాగునీటి విస్తరణ వంటి చర్యలు చేపడుతున్నారు. అనంతపురం నుంచి చిత్తూరు వరకు ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు ఏర్పాటు చేసి ఎగుమతులను పెంచే దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు.

ఆధ్యాత్మిక కేంద్రం నుంచి ఆర్థిక కేంద్రంగా..

తిరుపతిని ఆధ్యాత్మిక కేంద్రం నుంచి ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా విద్య, ఆరోగ్యం, బయోటెక్నాలజీ, పర్యాటక రంగాల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సేవారంగ విస్తరణకు తిరుపతి–చిత్తూరు ప్రాంతాన్ని ప్రత్యేక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఉంది. బడ్జెట్లో విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, నీటి వనరులు, విద్యుత్, వ్యవసాయ రంగాలకు భారీ కేటాయింపులు చేశారు. జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, ఎన్టీఆర్ వైద్య సేవ, నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ వంటి పథకాలకు ప్రత్యేక నిధులు కేటాయించారు.

లాభదాయకంగా వ్యవసాయం..

రైతులు – రాజులుగా మారాలి. వ్యవసాయం లాభ దాయకంగా ఉండాలి, ఇది గ్రామీణ ఆర్థిక బలోపేతానికి కీలకం. రైతన్న మీ కోసం కార్యక్రమం ద్వారా రైతులను “రాజులుగా” భావించడం లక్ష్యం. ప్రధానంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రి టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై దృష్టి పెట్టారు.. యువత మళ్లీ వ్యవసాయం వైపు రావాలంటే రంగం లాభదాయకంగా మార్చడం అవసరం. అధిక పోషక విలువల పంటల సాగుతో రైతులకు మెరుగైన ఆదాయం కల్పించడం, 11 ముఖ్య పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించడం, ఆంధ్ర ప్రదేశ్ దేశ వ్యవసాయంలో 10% వాటాను కలిగి ఉండటం వంటి చర్యలపై దృష్టి సారించారు. వ్యవసాయ వృద్ధి రేటు 7.83% సాధించబడింది.

‘సంపద సృష్టి’ లక్ష్యానికి కార్యరూపం..

సంపద సృష్టి’ లక్ష్యాన్ని కార్యరూపంలోకి తీసుకువస్తూ ‘ఏపీ వెల్త్ ఫండ్’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.. రూ.100 కోట్ల కార్పస్‌తో ఏర్పాటు కానున్న ఈ ఫండ్ ద్వారా దేశవ్యాప్తంగా లాభదాయక ప్రాజెక్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టనుంది. ప్రైవేట్ పెట్టుబడిదారులను భాగస్వాములుగా ఆహ్వానిస్తూ ఈ నిధిని రూపొందిస్తున్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాష్ట్ర ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చి, అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక బలం చేకూర్చాలనే ప్రభుత్వ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. మూడు ప్రాంతీయ ఆర్థిక వ్యూహాలు, సామాజిక రంగాలకు భారీ కేటాయింపులు, సంపద సృష్టికి వెల్త్ ఫండ్ వంటి చర్యలు కలిపి రాష్ట్ర అభివృ‌ద్ధికి బలమైన పునాదులు వేస్తున్నాయి. పల్లె–పట్టణ తేడా లేకుండా సమాన వృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సక్రమ అమలు జరిగితే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో వేగంగా దూసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

- శ్రీధర్ వాడవల్లి

99898 55445

సభలో చంద్రబాబు సీక్రెట్ రివీల్ చేసిన ఎమ్మెల్సీ

Next Story