ఆధునిక పోతన అందెశ్రీ

by Ravi |   (  Updated:2025-11-12 00:45:52  IST  )

యాడాది కింద పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ జెండా వందనం తర్వాత తొలిసారి జయజయహే తెలంగాణ గీతం పిక్కటిల్లేలా వినబడుతోంది. ఆ వేదిక మీద వెనక వరుసలో కూకున్న అందెశ్రీ ఆనందంతో, యాతనతో కన్నీళ్లు

ఆధునిక పోతన అందెశ్రీ
X

యాడాది కింద పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ జెండా వందనం తర్వాత తొలిసారి జయజయహే తెలంగాణ గీతం పిక్కటిల్లేలా వినబడుతోంది. ఆ వేదిక మీద వెనక వరుసలో కూకున్న అందెశ్రీ ఆనందంతో, యాతనతో కన్నీళ్లు పెట్టడం దగ్గర ఉండి చూసా. ఆయన మొహంలో ఏదో సాధించిన ఆనందం. ఆ ఆనందాన్ని పదేళ్ల కర్కశ పాలన తొక్కిపెట్టి అవమాన పరచిన వైనం అందరికీ తెలుసు.

యాభై గజాలు లేని ఇంట్లో.. జీవితం

బూర్జువా పాలన మీద, పాలకుల మీద ఎవరికీ భ్రమలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ కవులు అర్భకులు కుడుం ఇస్తే పండగ వాళ్లకు. తన తోటి గాయకులు ఫాం‌హౌస్‌లలో ఖరీదైన కార్లలో MLCలుగా, కార్పొరేషన్ పదవులు అనుభవిస్తూ తిరుగుతుంటే అందెశ్రీ చనిపోవడానికి ముందు‌ రోజు కొత్తగా కట్టుకుంటున్న ఇంటి దగ్గర నుండి ఎవరో పిల్లవాడు చిన్న బైక్ మీద దించి వెళ్లా‌డు. అందెశ్రీ ఉండే ఇల్లు కనీసం యాభై గజాలు కూడా ఉండదు. పదేళ్ల కింద ఆ ఇల్లు చూసా. ఇప్పటికీ అదే ఇంట్లో ఉంటున్నాడు. అక్కడే చనిపోతా అనేవాడు. తన తోటి వాళ్లు శ్రీనాధుడిలా రాజ స్థానాలలో వెలిగిపోతుంటే, అందెశ్రీ ఆచరణలో, అలవాట్లలో పోతన లాంటి వాడు (చిన్న చిన్న తప్పులు అతనూ చేశాడు).

అహం దెబ్బతిని అశాంతికి గురై...

అందెశ్రీ, మూడు నాలుగేళ్లు మా రూమ్‌కి రెగ్యులర్‌గా వచ్చేవాడు. కాఫీ, టీ, సిగరెట్, మందు అలవాటు లేదు. నిత్యం ఆసనాలు, నడక అలవాటైన వాడు హఠాత్తుగా ఎందుకు పోయాడు? గత పదేళ్లలో ఆయన అహం దెబ్బతిన్నది. కోట్లాది మంది పాడుకుంటున్న పాట. కేసీఆర్ పక్కన ఉన్న విప్రగణం మూలంగానో మరే కారణమో తెలియదు కానీ ఆ పాట మీద ఆయన పెట్టుకున్న ఆశలు ఆయనను అశాంతికి గురి చేశాయి అని పక్కన వాళ్లు చెప్పారు.

కొత్త ఇంట్లో ఒక్కరోజూ నిద్రపోలే..

నేను ఆయనతో పదేళ్లుగా మాట్లాడటం లేదు. అంత ఆరోగ్యంగా ఉన్న మనిషి హైపర్ టెన్షన్ పేషెంట్ అయ్యాడు. అది గుండె జబ్బుకు దారి తీసింది. కొంత కాలంగా మందులు వేసుకోవడం లేదని తెలిసింది. ప్రెషర్ కారణంగా మూడు నాలుగు సార్లు కింద పడిపోయాడు అని కూడా తెలిసింది. ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు బాల్యం నుండి తిండి దొరకని ఆయన పేగులు ఎప్పుడో ఎండిపోయి ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం కాసిన్ని డబ్బులు ఇచ్చింది. పెద్ద ఇల్లే కట్టుకుంటున్నాడు. నోటికి కాస్త బువ్వ, నిలబడడానికి కాసింత నీడ దొరికే కాలంలోనే తాను కట్టుకుంటున్న ఇల్లు కాకుండా కొత్త సమాధి చూసుకున్నాడు. ఆయన ఒక్కొక్క అక్షరం కూడ బలుక్కుని పేర్చుకున్న పొదరిల్లు తనకు ఒక రోజు కూడా నిద్ర‌బోయే అవకాశం ఇవ్వలేదు. మిస్ యు అన్నా.. వందలాది గంటలు నీతో గడిపిన క్షణాలు చాలు.. గమనిక: గద్దర్, అందెశ్రీ ఇద్దరూ మలి దశ ఉద్యమం త్యాగాల సాల్లు పోశారు. ఇద్దరికీ ఒకరికి ఎకరం, మరొ కరికి అరెకరం స్మృతి వనాలు కడుతున్నారు. ఒకరు కవి నెత్తిన నిప్పులు జల్లారు. మరొకరు నెత్తిన కర్పూరం జల్లుతున్నారు. అదే తేడా మరి.

- గుర్రం సీతారాములు

77805 87586

Next Story