అనంత శ్రీరామ్ డబుల్ టాక్ అనర్థదాయకమే!

by Ravi |   (  Updated:2025-01-16 01:15:27  IST  )

హిందూ మతంలోని సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. జనవరి 5న విజయవాడలో జరిగిన హిందూ శంఖారావం

అనంత శ్రీరామ్ డబుల్ టాక్ అనర్థదాయకమే!
X

హిందూ మతంలోని సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. జనవరి 5న విజయవాడలో జరిగిన హిందూ శంఖారావం సభకు జనం పెద్దయెత్తున తరలివచ్చారు. వక్తలుగా హాజరైన పెద్దలు వెలువరించిన ఉపన్యాసాల్లో తాము నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందేమో అంటూ.. కులభేదాలు సమసి, హిందూ ఐక్యత సిద్ధిస్తుందనే ఆశతో.. జనం ఓపికతో అందరి మాటలను విన్నారు. జనం చప్పట్ల మధ్య ప్రసంగించిన సినీగేయ రచయిత అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యానాలు మాత్రం సంచలనాలకు కేంద్రంగా నిలిచాయి. హిందూ ధర్మాన్ని కించపరిచేలా తెలుగు సినిమా రచయితలు పాటలు రాస్తున్నారని, అలాంటి వారిని హిందువులు క్షమించరని అనంత శ్రీరామ్ వ్యాఖ్యానించాడు. స్వయంగా బూతు పాటలు రాసిన అనంత శ్రీరామ్ ఇతరులకు హితబోధ చేయడం హాస్యాస్పదం!

యమదొంగ సినిమాలో.. దేవతలు కనిపించే సన్నివేశాలలోనూ వెకిలి పదాలతో పాటలు రాసిన చరిత్ర ఈ అనంతుడిది! దిగు దిగు దిగు నాగ అనేది భక్తి గీతమని తెలుగు నాట అందరికీ తెలుసు. మరి.. ఆ భక్తి గీతంలోని అవే పదాలను ఉపయోగిస్తూ సినిమాలో బూతు పాటలు రాసిన తమరినేమని అనాలండీ, అనంత శ్రీరామ్ గారు? ఆ సభ తర్వాత పత్రికలతో మాట్లాడిన అనంత శ్రీరామ్.. వృత్తి ధర్మంలో భాగంగా నేను సైతం అలాంటివి రాసానని ఒప్పుకున్నాడు. ఉల్లిగడ్డ కూడదన్న బాపనాయన.. ఇంట్లో దాన్నే వాడుతూ సుష్టుగా భోంచేసిన సామెత లాగున్నది ఈ అనంత యవ్వారం!

ఎన్డీఆర్ కుల వ్యతిరేక డైలాగులపై వ్యాఖ్యలా

భారతంలోని కర్ణుడు ధర్మానికి ప్రతినిధి కానే కాదని తేల్చేసిన అనంత శ్రీరామ్.. తెలుగు సినిమాలలో కర్ణుడిని ఎందుకు గొప్పగా చూపెడుతున్నారంటూ ప్రశ్నించాడు."కులం తక్కువ వాడయిన కర్ణుడు గొప్పవాడు ఎట్లవుతాడు?" అనే కుల దుహంకారమేనా ఇది? గతంలోని సినిమాలలోను కర్ణుడిని అనవసరంగా హీరోని చేశారు అంటూ ఆయన వ్యాఖ్యానించడం.. ఎన్టీఆర్ తీసిన చిత్ర రాజం "దాన వీర శూర కర్ణ" గురించేనని అందరికీ అర్థమైంది. ఆ సినిమా దర్శకుడు ఎన్టీఆర్, మాటల రచయిత కొండవీటి వెంకట కవితో కలిసి.. సమకాలీన సమాజంలోని కుల దురహంకారుల ద్వంద్వవైఖరిని ఆ సినిమాలో నిశితంగా ఎండగట్టడం అనంత శ్రీరామ్‌కి నచ్చినట్టుగా లేదు. “కులమా అర్హతను నిర్ణయించునది? కులము, కులము అను వ్యర్ధ వాదములెందుకు?” అన్న నాటి ఎన్టీరాముడి డైలాగులు నేటి అనంత శ్రీ రాముడికి ఇబ్బంది కలిగిస్తున్నట్టున్నాయి!

అనువంశిక ధర్మకర్తృత్వం మళ్లీ తేవాలా?

కళాకారుడిగా ఎన్టీఆర్ చూపిన సామాజిక సమరసతపై అనంత శ్రీరామ్ గుస్సా వ్యక్తం చేయగా.. అదే సభలో మరో వక్తగా ప్రసంగించిన మాజీ ఐఏఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మరొక అడుగు ముందుకేసి.. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ తీసుకొచ్చిన 1987 నాటి దేవాదాయ ధర్మాదాయ చట్టాన్నే రద్దు చేయాలని డిమాండ్ చేశాడు. మన ఆలయాలలో ఒకప్పుడు మిరాశీదారులు, అనువంశిక పూజారుల అరాచకం రాజ్యమేలేది. అర్చకత్వం, ప్రసాదాల తయారీలో కొన్ని కుటుంబాలు వంశపారంపర్య హక్కును చలాయిస్తూ, హుండీ ఆదాయం, కానుకల్లో వాటాలు దండుకునేవి. ఇటు భక్తులను. అటు దేవుడినీ ఏక కాలంలో మోసగించిన అక్రమ వ్యవస్థ అది. నాటి ఎన్టీఆర్ ప్రభుత్వం 1987లో కొత్తగా దేవాలయాల చట్టాన్ని తీసుకొచ్చి.. తితిదే సహా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో అనువంశిక ధర్మకర్తృత్వం, అర్చకుల విధానాన్ని రద్దు చేసింది. ఎన్టీఆర్ తీసుకొచ్చిన పురోగామి చట్టాలను రద్దు చేయడం అంటే.. మళ్లీ పాతకాలపు చీకటి రోజుల వైపు పయనించడమే అవుతుంది. హిందువుల పేరు వాడుతూ.. కొద్దిమంది స్వార్ధపరుల ప్రయోజనాల గురించి వీరు మాట్లాడుతున్నట్టు ఉన్నది.

ఉత్తర ప్రదేశ్ నుంచే నరుక్కురండి మరి..!

ఈ పెద్దలు కోరినట్టుగా హిందూ దేవాలయ ధర్మాదాయ చట్టాలని రద్దు చేయడమే పరిష్కారమయితే.. ఆ పని మొదలు పెట్టాల్సింది, దేశంలోనే పెద్ద రాష్ట్రమయిన ఉత్తర ప్రదేశ్ నుండే కదా!? ఉత్తరప్రదేశ్‌లో నేడు దేవాదాయ ధర్మాదాయ చట్టం అమలులో ఉందా లేదా తేల్చి చెప్పాలి వీళ్లు! ఆ రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న మఠాధిపతి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో.. అప్పటివరకు ఉన్న దేవాదాయ ధర్మాదాయ చట్టానికి కొత్త సవరణలు చేసి మరీ.. హిందూ దేవాలయాలపై ప్రభుత్వ ఆజమాయిషీని మరింత పకడ్బందీగా కొనసాగిస్తున్నారు. అక్కడో నీతి.. ఇక్కడో నీతి.. ఎలా సమంజసం?

కుల దురహంకారులపై నోరు పెగలదేం?

నేడు హిందూమతంలోని సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యల గురించి అనంత శ్రీరామ్‌లు సుబ్రహ్మణ్యాలు తమ ఉపన్యాసాల్లో ప్రస్తావించి ఉంటే బాగుండేది. పోయిన నెలలోనే.. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో.. తన శిష్యుడి కాళ్లు మొక్కాల్సిన దౌర్జన్యకర పరిస్థితులను ఎదుర్కొన్న స్కూలు హెడ్మాస్టరు రాములు సార్ గురించి కూడా వాళ్లు ఆవేదన చెందితే బాగుండేది. ఉన్నది ఉన్నట్టు చెప్పలేకపోతే హైందవ ద్రోహులమే అవుతామని గర్జించిన అనంత శ్రీరామ్.. ఆ హిందూ బిడ్డ రాములు సార్‌కు జరిగిన అవమానం గురించి సైతం ఎందుకు ప్రశ్నించలేదు? గురుదేవుడిని విద్యాలయంలోనే అవమానించిన ఆ కుల దుహంకారులకు వ్యతిరేకంగా హిందూ మత పెద్దలు నిలబడాలంటూ ఎందుకు పిలుపునివ్వలేదు? హిందువులలో మెజార్టీ వర్గమైన బీసీల న్యాయమైన హక్కుల గురించి.. వారు కోరుతున్న కులగణన గురించి, వాళ్లకు దక్కాల్సిన న్యాయమైన సామాజిక వాటా గురించి సైతం హిందూ సభలలో ప్రస్తావన రావాలి కదా? ప్రజా బాహుళ్య సమస్యలపై.. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలిగితేనే.. నిజమైన హైందవ హితం వర్ధిల్లుతుందన్న వాస్తవాన్ని ఈ శ్రీరాములు, సుబ్రహ్మణ్యాలు గుర్తించాల్సిన అవసరమున్నది!

-ఆర్. రాజేశమ్,

కన్వీనర్, సామాజిక న్యాయ వేదిక

94404 43183

Next Story