- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదో తరగతి ఫలితాల హంగామా వెనుక విద్యా సంక్షోభం!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పదో తరగతి ఫలితాల పెరుగుదల వెనుక ఉన్న అసలు విద్యా పరిస్థితులు, విద్యార్థుల అభ్యాస లోపాలు, కాపీయింగ్ సంస్కృతి, ఉపాధ్యాయులపై పెరుగుతున్న భారం, విద్యా వ్యవస్థలోని సంక్షోభాన్ని విశ్లేషించే వ్యాసం.

పదో తరగతి పరీక్షా ఫలితాలు చూసి అందరూ మురిసిపోతున్నారు. మా స్కూల్ గొప్ప అంటే మా స్కూల్ గొప్ప అంటూ జబ్బలు చరుచు కుంటున్నారు. పత్రికలో పూర్తి పుటల ప్రకటనలు గుప్పిస్తున్నారు. అందులో చిరునవ్వులు చిందించే బాలబాలికల ఛాయాచిత్రాలు అలరిస్తున్నాయి. అయితే ఇందుకు బలమైన కారణమే ఉంది.
ప్రభుత్వాల లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 2025 సంవత్సరం పదవ తరగతి పరీక్షలలో 81.14% ఉత్తీర్ణత సాధించారు. 2026 ఫలితాలు అంతకు మించి పోయాయి. ఉత్తీర్ణతా శాతం 85.25కి పెరిగింది. ఇక తెలంగాణ ఒక మెట్టు పైనే ఉంది. 2025 విద్యా సంవత్సరంలో 92.78గా ఉన్న ఉత్తీర్ణతా శాతం, ఈ ఏడాదికి 95.5కి ఎదిగింది. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో 1,680, తెలంగాణలో 4,620 పాఠశాలలు 100% ఉత్తీర్ణతా పతాకం ఎగరవేయగా, ఈ సంవత్సరం ఆ సంఖ్యలు వరుసగా 2,161, 5,731కి పెరిగాయి.
తప్పులు లేకుండా చదివేవారెందరు?
దేశవ్యాప్తంగా 720 జిల్లాలలోని 1.18 లక్షల పాఠశాలలోని 34 లక్షల పైగా విద్యార్థులను పరీక్షించిన భారత ప్రభుత్వ విద్యాశాఖ వారి ‘విద్యా పరిస్థితుల వార్షిక నివేదిక (ASAR)2024 ప్రకారం ప్రభుత్వ బడులలో రెండవ తరగతి తెలుగు పాఠాన్ని 3వ తరగతి విద్యార్థులలో 15.5% మాత్రం తప్పులు లేకుండా చదువ గలుగుతున్నారు. 5వ తరగతి వారిలో ఈ శాతం 37.7 కాగా 8వ తరగతి వారిలో 56. మూడో తరగతి విద్యా ర్థులలో 45 శాతం మందికి 99 వరకు అంకెలలో ఆరోహణ అవరోహణలు క్రమాలు గుర్తించే శక్తి లేదు. ఆరో తరగతికి చెందిన విద్యార్థులలో 47% మంది 10 వరకు ఎక్కాలను చెప్పలేకపోతున్నారు. తొమ్మిదవ తరగతి విద్యార్థులలో 47% గణిత ప్రక్రియల పరస్పర సంబంధాలు, వాటిని అనువదించడం తెలియదు.
పై తరగతుల మెట్లన్నీ ఎలా ఎక్కారంటే..!
పదవ తరగతి వరకు పరీక్షలంటూ ఉండవు. సరిపడా హాజరు ఉంటే చాలు పై తరగతుల తలుపులు తెరు చుకుంటాయి. రెండు, మూడు తరగతుల్లో బడికి రాక పోయిన పిల్లలను కూడా వాళ్ల వయసును బట్టి నేరుగా నాలుగవ తరగతిలోనూ, ఐదవ తరగతిలోనూ చేర్చు కోవచ్చు. పదేళ్లు దాటితే ఏకంగా ఆరవ తరగతిలోనే. దీంతో, పిల్లలు ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం, సరిగా నేర్చుకోవడం లేదు. పై తరగతులకి వెళ్లే కొద్దీ గణితం మొదలైన పాఠ్యాంశాలు వీడని చిక్కు ముళ్ల వుతున్నాయి. గతంలో ఏడో తరగతిలో బోర్డు పరీక్ష ఉండేది. ఆ ఆటంకాన్ని దాటలేకపోయిన వాళ్లు చాలామంది అక్కడే ఆగిపోయేవారు.
ఉపాధ్యాయుల నెత్తిన మరో బరువు..
కష్టపడి చదివి, సంవత్సర పర్యంతం నిర్వహించిన పరీక్షల్లో మంచి ఫలితం సాధిస్తేనే పై తరగతికి వెళ్లే అగత్యం లేని పిల్లలకు చదువు నేర్పే బాధ్యతతో పాటు, ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం సరైన సమయానికి అందుతున్నదో, లేదో చూడడం, వండే ఆహారం నాణ్యతను, పరిశుభ్రతను పర్యవేక్షించడం, భోజనం చేసిన విద్యార్థుల హాజరు వివరాలను, వంటకు వాడే బియ్యం, కూరగాయలు వగైరా సరుకుల వినియోగాన్ని నమోదు చేయడం, వంటశాల పరిశుభ్రంగా ఉండేటట్టు, భోజనం సక్రమంగా ఉండేటట్లు చూడడం, ప్రభుత్వానికి అవసరమైన నివేదికలను సిద్ధం చేయడం ఉపాధ్యాయుల బాధ్యతే. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు శుభ్రమైన దుస్తులు ధరించడం, గోర్లు కత్తిరించుకోవడం, భోజనం ముందు, మరుగుదొడ్ల వినియోగం తర్వాత చేతులు సబ్బుతో కడుక్కునేలా ప్రోత్సహించడం, వారి ఆరోగ్య సమస్యలను గుర్తించడం ఉపాధ్యాయుల బాధ్యతలే. సానిటరీ నాప్‌కిన్ల పంపిణీ బాధ్యత కూడా ఉపాధ్యాయులదే. ఇవికాక ప్రభుత్వం అప్పుడప్పుడు అప్పగించే సర్వేలు, ఎన్నికల విధులు ఉండనే ఉన్నాయి..
ఉత్తీర్ణత పెంపును ప్రతిష్టగా తీసుకుంటే...!
మన దౌర్భాగ్యం ఏమంటే దాదాపు అందరు జిల్లా కలెక్టర్లు, మంత్రులు, పదవ తరగతి ఫలితాల విషయంలో తమ జిల్లా ఉన్నత స్థానంలో ఉండటాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం. దీంతో పరీక్ష ఫలితాల ఆధారంగా పిల్లల అధ్యయన స్థాయిని అంచనా వేయడం, తగు పరిష్కార మార్గాలు అన్వేషించడం, అమలు పరచడం వంటివి అటకెక్కేసాయి. జిల్లా స్థాయి మొదలు, మండలి స్థాయి వరకు జరిగే సమీక్షా సమావేశాలలో ఒకటే హుకుం. ఎట్టి పరిస్థితుల్లోనూ మన జిల్లా పదో తరగతి ఫలితాల్లో ఉన్నత స్థానంలో ఉండాలి. అదే ఉపాధ్యాయులలో అత్యధి కులకు తారకమంత్రమయింది.
కాపీ కొట్టని, కొట్టించని స్కూల్ ఎక్కడ?
విద్యా సంవత్సరమంతా శ్రద్ధగా పాఠ్యాంశాలు బోధించకుండా గడిపిన ఉపాధ్యాయులు పరీక్షల సమయంలో ఈ చూచిరాతలను ప్రోత్సహిస్తున్నారు. ఆబ్జెక్టివ్ ప్రశ్నాపత్రాలకు తామే సమాధానాలు చెప్తున్నారు. లేదా పరీక్షా తరగతిలో ఉన్న విద్యార్థులలో మెరుగ్గా చదివే విద్యార్థి రాసిన సమాధానాలను మిగిలిన పిల్లలకు అందచేస్తున్నారు. ఇదంతా సక్రమంగా అమలవుతోందా లేదా పర్యవేక్షించడానికి ఉపాధ్యాయులు వంతుల వారిగా పరీక్షా కేంద్రాలకు వెళ్లి సర్దుబాటు చర్యలు చేపడతారు.. చాలనట్టు, మూల్యాంకన కేంద్రాలలో ఎలాగైనా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేటట్టు చూడమని అక్కడి పై అధికారులు మౌఖికంగా ఆదేశాలు జారీ చేస్తారు. ఇలా దొడ్డిదారిన విద్యార్థులు పదో తరగతి దాటేటట్టు చూడడం తమ బాధ్యతగా పలువురు ఉపాధ్యాయులు భావించడం విద్యా వ్యవస్థకు పట్టిన అరిష్టం. స్వీయవంచన చేసు కోలేని ఏ కొద్దిమంది ఉపాధ్యాయులో దశాబ్దాల తరబడి ఇన్విజిలేషన్ బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు.
ఉపాధ్యాయ సంఘాలు తలుచుకుంటే..
రెండు తెలుగు రాష్ట్రాలలోనూ గత ప్రభుత్వాల హయాంలో కూడా ధిక్కార స్వరగళాలెత్తడానికి వెరవని పటిష్టమైన ఉపాధ్యాయ సంఘాలు ఉండేవి. పరీక్షా ఫలితాలు మాత్రమే ఉపాధ్యాయుల పనితీరుకు ప్రమాణంగా చూడడం సరికాదని, విద్యార్థుల సామాజిక, ఆర్థిక పరిస్థితులు కూడా ఫలితాలపై ప్రభావం చూపు తాయని, బోధనతో పాటు ఉన్న పరిపాలనా పనులను తగ్గించాలనీ, తద్వారా ఉపాధ్యాయులకు విద్యాబోధనపై ఎక్కువ సమయం దొరికేలా చర్యలు తీసుకోవాలనీ మొర పెట్టుకుంటున్నా, పెద్దగా ఫలితం ఉండడం లేదు. ప్రస్తుతం పరీక్షల నిర్వహణలో అతికొద్ది మంది ఉపాధ్యాయులు మాత్రమే పాటిస్తున్న నైతిక ప్రమాణాలకు ఆయా సంఘాల సభ్యులందరూ నిబద్ధులై ఉండేలా పరివర్తన తీసుకురాగలిగితే విద్యా వ్యవస్థకు పట్టిన ఈ గ్రహణం వీడుతుంది.
-మల్లాప్రగడ రామారావు
99898 73398






