సినిమాకు శాశ్వత రాజకీయ కవిత అమ్మా అరియన్

by Ravi |   (  Updated:2026-05-23 01:15:39  IST  )

జాన్ అబ్రహాం రూపొందించిన ‘అమ్మా అరియన్’ సినిమా భారతీయ సమాంతర సినీ చరిత్రలో ఒక మైలురాయి. రాజకీయ ఆశయాలు, విఫలమైన విప్లవాలు, యువత ఆవేదనను కవితాత్మక దృశ్యభాషలో ఆవిష్కరించిన ఈ చిత్రంపై విశ్లేషణ.

సినిమాకు శాశ్వత రాజకీయ కవిత అమ్మా అరియన్
X

జాన్ అబ్రహం రూపొందించిన 'అమ్మా అరియన్' (అమ్మకు నివేదన) సినిమా 1986లో వచ్చింది. భారతీయ సమాంతర సినీ చరిత్రలో అదొక విప్లవాత్మక చిత్రం. ఇది కేవలం సినిమా కాదు ఒక తరం కలలు చెదిరిపోయిన దుఃఖగాథ. రాజకీయ ఆశయాలు, విఫలమైన విప్లవాలు, యువతలోని అయోమయం, మరణం, మాతృత్వం.. ఇవన్నింటినీ ఒక కవిత్వాత్మక దృశ్యభాషలో ఆవిష్కరించిన అరుదైన సినిమా అమ్మా అరియన్.

సినిమా ఒక మృతదేహంతో ప్రారంభమవుతుంది. వయ నాడ్ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతున్న ఒక యువకుడి శవాన్ని చూసిన పురుషన్ అనే యువకుడు, అతను హరి అనే తబలా కళాకారుడై ఉండవచ్చని అనుమానిస్తాడు. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి హరి తల్లికి ఈ మరణవార్త చెప్పడానికి బయలుదేరతాడు. కానీ అది కేవలం ఒక వార్తను చేరవేయడానికి చేసిన ప్రయాణం కాదు. అది మొ త్తంగా ఒక కాలాన్ని, ఒక విప్లవ తరాన్ని, వారి కలల పత నాన్ని అర్థం చేసుకునే అంతర్ముఖ యాత్రగా మారుతుంది.

ఉద్యమాల అనంతర యువత నిరాశలు..

ఈ చిత్రంలో కథ కంటే ప్రయాణమే ముఖ్యమవుతుంది. మార్గ మధ్యంలో కలిసే విద్యార్థులు, కార్మికులు, రాజకీయ కార్యకర్తలు, కళాకారులు వాళ్లందరి సంభాషణల్లో ఒక కాలపు చరిత్ర ప్రతిధ్వనిస్తుంది. 1970ల్లో భారతదేశంలో ఉధృతంగా సాగిన వామపక్ష ఉద్యమాల అనంతరం యువత ఎదుర్కొన్న నిరాశ, విసుగు, దిశాహీనత ఈ చిత్రంలో లోతుగా ప్రతిఫలిస్తుంది. జాన్ అబ్రహాం సినిమా భాషను అమ్మా అరియన్‌లో పూర్తిగా కొత్త దిశలో నడిపించాడు. అమ్మా అరియన్‌లో ఒకవైపు డాక్యుమెంటరీ వాస్త వికత, కవితాత్మక దృశ్యరూపాలు, రాజకీయ వ్యాఖ్యానం అన్నీ కలిసిపోతాయి. ప్రేక్షకుడు సినిమా చూస్తున్నాననే భావన కంటే ఒక సామూహిక యాత్రలో జ్ఞాపకాల నీడలో నడుస్తున్నాననే అనుభూతిని పొందుతాడు. ఈ సినిమాని ప్రత్యేకంగా నిలబెట్టింది దాని నిర్మాణ విధానం.

ప్రతి చిత్రం ఒక విప్లవాత్మక ప్రయోగం..

1937లో కేరళలో జన్మించిన జాన్ అబ్రహాం, పూణే ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్‌లో చదివారు. అక్కడ ఆయనకపై రిత్విక్ ఘటక్ లాంటి గొప్ప దర్శకుల ప్రభావం గాఢంగా పడింది. ఘటక్‌లానే జాన్ కూడా సినిమాను ఒక సామాజిక-రాజకీయ ప్రకటనగా చూశాడు. జాన్ దర్శకత్వం వహించిన చిత్రాలు సంఖ్యలో చాలా తక్కువ. కానీ ప్రతి చిత్రం ఒక విప్లవాత్మక ప్రయోగం. విద్యార్తికలే ఇతిలే ఇతిలే, అగ్రహారిత్తిల్ కజుదై. చరిచంటి దరూర క్రుత్యంగల్, అమ్మా అరియన్ వంటి చిత్రాలు భారతీయ సమాంతర సినిమాకు కొత్త భాషను అందించాయి. ప్రత్యేకంగా అమ్మకు నివేదన ఆయన కళాత్మక శిఖరం.

తొలి ‘ప్రజా నిర్మిత’ చిత్రాలలో ఒకటి..

జాన్ అబ్రహాం జీవితంలో అత్యంత గొప్ప ఆలోచన “ఒడెస్సా కలెక్టివ్.” ఆయన స్థాపించిన “ఒడెస్సా కలెక్టివ్” అనే ప్రజా సినీ ఉద్యమం ద్వారా ఈ సినిమా నిర్మించ బడింది. గ్రామాలు తిరుగుతూ, సాధారణ ప్రజల నుంచి చిన్నచిన్న విరాళాలు సేకరించి అమ్మా అరియన్ సినిమా తీశారు. అందువల్ల అది భారతదేశంలో తొలి “ప్రజా నిర్మిత” చిత్రాలలో ఒకటిగా నిలిచింది. సినిమా ప్రజలది కావాలని జాన్ అబ్రహాం నమ్మాడు. ఆ నమ్మకమే ఈ చిత్ర నిర్మాణంలో ప్రతిఫలించింది.

యువత ఎన్‌కౌంటరైతే తల్లులకేం చెప్పాలి?

నలుపు-తెలుపు ఛాయాగ్రహణం చిత్రానికి ఒక గాఢమైన రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తుంది. కెమెరా కేరళ ప్రకృతిని కేవలం అందంగా చూపించదు. అక్కడి నేలలో దాగి ఉన్న చరిత్రను, పోరాటాలను, నిశ్శబ్దాలను కూడా చూపిస్తుంది. సంభాషణల కంటే ముఖాలు, నడకలు, నిశ్శబ్దాలు ఎక్కువ మాట్లాడతాయి. అమ్మా అరియన్ చివరికి ఒక ప్రశ్నగా మిగులుతుంది. విప్లవం కోసం జీవించిన యువత మరణించినప్పుడు, వారి తల్లులకు మనం ఏం చెప్పాలి? ఆ కలల విఫలతకు ఎవరు బాధ్యులు? సమాజం తమ పిల్లలను ఎలా కోల్పోతుంది? భారతీయ రాజకీయ సినిమాల చరిత్రలో అమ్మా అరియన్ ఒక అపూర్వ మైలురాయి. అది కేవలం ఒక సినిమా కాదు. ఓ తరం ఆత్మవేదనకు దృశ్యరూపం. నేటికీ ఈ చిత్రం చూస్తే అది గతాన్ని మాత్రమే కాదు మన సమకాలీన సమాజాన్ని కూడా ప్రశ్నిస్తుంది.

డిజిటల్ సాంకేతికతతో పునర్జన్మ!

అయితే కాలంతో పాటు ఫిల్మ్ రీల్స్ దెబ్బతింటాయి. రంగులు మసకబారతాయి. శబ్దం క్షీణిస్తుంది. కొన్ని సిని మాలు పూర్తిగా కనుమరుగైపోతాయి. అప్పుడు ఫిల్మ్ రిస్టోరేషన్ ఆ కళాఖండాలకు డిజిటల్ సాంకేతికతతో పునర్జన్మ ఇస్తుంది. అందువల్లే నేటి తరాలు పతేర్ పాంచాలి, మా యా బజార్ లాంటి క్లాసిక్ చిత్రాలను మళ్లీ ఆస్వాదించగలు గుతున్నాయి. ఇలా పాత సినిమాల పునరుద్దరణ ను ఫిలిం రేస్టోరేషన్ అంటారు. ఈ ఫిల్మ్ రిస్టోరేషన్ కొత్త తరాలను తమ కళా వారసత్వంతో మళ్లీ అనుసంధానిస్తుంది. పాత సినిమాల దృశ్యభాష, సంగీతం, నటన, కథనశైలి ఇవన్నీ వారి సినీచైతన్యాన్ని మరింత చైతన్య పరుస్తాయి.

భారతీయ సమాంతర సినిమాకు గౌరవం!

కాలగమనంలో అనేక గొప్ప చిత్రాల మాదిరిగానే అమ్మా అరియన్ కూడా క్షీణించింది. ఫిలిం ప్రింట్లు దెబ్బతిన్నాయి, నెగటివ్‌లు పాడయ్యాయి, దృశ్య నాణ్యత మసకబారింది. ఒక తరం రాజకీయ ఆవేదనను మోసుకొచ్చిన ఈ చిత్రం మరుగునపడే ప్రమాదంలో పడింది. ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ అన్న సంస్థ అమ్మ అరియన్‌కు 4K పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పునరుద్ధరణకు ప్రముఖ ఫిలిం సంరక్షకుడు శివేంద్ర సింగ్ దుంగార్పూర్ నాయకత్వం వహించారు. జాన్ అబ్రహాం దృశ్యభాష, నలుపు-తెలుపు ఛాయాగ్రహణ గాఢత, రాజకీయ వాతావరణం ఏ మాత్రం దెబ్బతినకుండా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ పునరుద్ధరించిన వెర్షన్ 2026లో Cannes Film Festival లోని “Cannes Classics” విభాగానికి ఎంపిక కావడం భారతీయ సమాంతర సినిమాకు ఒక గౌరవంగా భావించబడింది. జాన్ అబ్రహాం గొప్ప సినిమా మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. యూట్యూబ్‌లో ఈ సినిమాను చూడవచ్చు.

- వారాల ఆనంద్

94405 01281

Next Story