- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యుద్ధ విరామం.. దేనికి సంకేతం!
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా ‘సీజ్ ఫైర్’ వ్యూహం వెనుక ఉన్న వాస్తవాలు, ఇరాన్‌లో వర్గపోరు, భారత్ నౌకలపై దాడుల ప్రభావం వంటి కీలక అంశాలపై విశ్లేషణ.

మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అమెరికా పదే పదే ‘సీజ్ ఫైర్’ (యుద్ధ విరామం) గడువును పొడిగిస్తుండటం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది. బాహ్య ప్రపంచానికి ఇది శాంతి ప్రయత్నంలా కనిపిస్తున్నప్పటికీ, దీని వెనుక ఒక వాస్తవిక సైనిక సన్నాహక లోపం దాగి ఉన్నది. అమెరికా అమ్ములపొదిలో వేగంగా కరిగిపోతున్న క్షిపణి నిల్వలు ఈ బండారాన్ని బయటపెట్టాయి..
మరోవైపు, ఇరాన్ పాటిస్తున్న నిశ్శబ్దం ఒక సాదాసీదా మౌనం కాదని అర్థం చేసుకోవాలి. శత్రువు వెనుకంజ వేస్తున్నా.. ఎలాంటి గోబెల్స్ ప్రచారం చేయకుండా వ్యూహాత్మక అడుగు వేస్తున్నది. అయితే, భారత్‌కు సహకరించే విషయంలో ఇరాన్ నాయకత్వం రెండుగా చీలింది. ముఖ్యంగా అరాగ్చీ, బాలిఘాఫ్ నాయకత్వంలోని పాలక వర్గం భారత్‌కు బహిరంగంగా మద్దతు ఇస్తుంటే.. ఐఆర్జీసీ నాయకత్వంలోని సైనిక నేతలు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్‌లో చర్చలు ముగిసిన కొన్ని రోజులకే భారత్ నౌకలపై ఐఆర్జీసీ దాడులు చేయడం గమనార్హం.
ఆయుధ నిల్వల సంక్షోభం!
గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ యుద్ధాలకు నిరంతరాయంగా ఆయుధాలను సరఫరా చేస్తున్న అమెరికా.. ఇప్పుడు తన సొంత రక్షణ వ్యవస్థలో లోటును ఎదుర్కొంటున్నది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్ఐఎస్) వంటి థింక్ ట్యాంక్ నివేదికల ప్రకారం.. అమెరికా వద్ద ఉన్న థాడ్, పేట్రియాట్ ఇంటర్ సెప్టర్ల నిల్వలు దాదాపు 50% తగ్గిపోయాయి. అమెరికా యుద్ధ తంత్రం ‘అత్యాధునిక నాణ్యత’ మీద ఆధారపడి ఉంటుంది, కానీ అటువంటి క్షిపణులను తిరిగి తయారు చేయడానికి కనీసం 4 నుంచి 5 ఏళ్లు పడుతుంది. ప్రస్తుత ‘యుద్ధ విరామం’ ఆయుధాలను రీ-స్టాక్ చేసుకోవడానికి అమెరికా తీసుకుంటున్న ఆక్సిజన్ వంటిది అనుకోవచ్చు.
ఇరాన్‌కు చైనా ఆయుధ సాయం..
ఇరాన్ తన ఆయుధ శక్తిని కేవలం 4 నెలల్లోనే సమీకరించుకోగలగడం వెనుక చైనా హస్తం ఉంది. చైనా నుండి అందుతున్న ‘అసెంబ్లీ కిట్స్’తో ఇరాన్ తన డ్రోన్, మిసైల్ సిటీలను నింపేస్తున్నది. అందుకే అమెరికా నౌకాదళం ఇరాన్ నుంచి నౌకలను బయటకే కాదు.. లోనికి కూడా అనుమతించడంలేదు.. ఇటీవల ఇరాన్‌కు వస్తున్న ఓ నౌకను అమెరికా సిబ్బంది తనిఖీ చేయడం, సిబ్బందిని ఆధీనంలోకి తీసుకోవడంపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. తమ దేశం జెండా ఉన్న నౌకపై దాడి చేయడంపై తీవ్రస్థాయిలో ఆక్షేపణ చేసింది. ఇరాన్‌కు చైనా ఆయుధ సాయం చేస్తున్నదని అమెరికా అనుమానించడమే కాదు.. స్వయంగా ఆరోపణలు చేస్తున్నది. చైనా నుంచి పెద్ద ఎత్తున ఆయుధ తయారీకి కావాల్సిన సామగ్రి చైనా నుంచి ఇరాన్‌కు వస్తున్నదని.. అదే నౌకలో తిరిగి ఆయిల్ చైనాకు వెళ్తున్నదని విమర్శలు చేసింది. అన్నింటికంటే ముఖ్యంగా ఇరాన్‌పై ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నా.. ఇరాన్ మాత్రం సమయానుకూలంగా వ్యవ హరిస్తున్నది. మాటలకంటే ఎక్కువగా చేతలపైనే దృష్టి పెట్టింది. అయితే, ఇరాన్‌లో జరుగుతున్న నాయకత్వ పోరులో ఎవరు గెలుస్తారనేదే.. ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేపుతున్నది. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఇరాన్‌లో అరాగ్చీ నేతృత్వంలోని పాలకవర్గానికి, ఐఆర్జీసీ నాయకత్వానికి మధ్య తీవ్ర విభేదాలు జరుగుతున్నాయి. సుప్రీం లీడర్ తనయుడు భావి సుప్రీం లీడర్‌గా ప్రకటించే అవకాశం ఉన్న మొజ్తబాను కలిసేందుకు కూడా అరాగ్చీ వర్గానికి అనుమతి ఇవ్వడంలేదన్న వార్తలు వస్తున్నాయి. ఇది భారత్ ఇబ్బందికర పరిస్థితి.
ఇరాన్ ‘వర్గపోరు’.. భారత్‌కు శాపమా?
ఈ మొత్తం ఎపిసోడ్‌లో భారత్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం ఇరాన్ వైఖరి. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ భారత్ నౌకలకు భద్రతా హామీలు ఇస్తుంటే, క్షేత్రస్థాయిలో ఇరాన్ రెవల్యూషనీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఆ నౌకలను టార్గెట్ చేయడం ఒక వింత సమీకరణం. నిజానికి యుద్ధ విరమణ సమయంలో హార్ముజ్ జలసంధి వాణిజ్య నౌకలకు పూర్తిగా తెరిచే ఉంటుందని ఈ నెల (ఏప్రిల్) 17న అరాగ్చి ప్రకటించారు. అదే రోజున ఐఆర్జీసీ మాత్రం.. జలసంధి ‘సాయుధ దళాల కఠిన నియంత్రణ’లోకి తిరిగి వెళ్లిందని, భారత్ నౌకలతో సహా ఏ నౌకను అనుమతించబోమని ప్రకటించింది. అరాగ్చీ ‘జలసంధి తెరిచే ఉంది’ అన్న ప్రకటన చేసిన కేవలం 24 గంటల లోపే.. ఐఆర్జీసీ నేవీ భారత్ నౌకలపై కాల్పులు జరిపింది. ఇది ఒక స్పష్టమైన తిరస్కారంతోపాటు అధికార ప్రదర్శనగా విశ్లేషకులు భావిస్తున్నారు.. భారత్ నౌకలను ఐఆర్జీసీ టార్గెట్ చేయడానికి ప్రధానంగా కనిపిస్తున్న కారణం.. ఇరాన్‌లో ప్రస్తుతమున్న రాజకీయ శూన్యతను తమకు అనుకూలంగా మల్చుకోవడం. భారత నౌకలను టార్గెట్ చేయడానికి ఉన్న మరో కారణం.. ఇరాన్ పాలక వర్గం భావిస్తున్నట్టుగా భారత్ ఇరాన్‌కు మిత్రదేశమని ఐఆర్జీసీ నాయకత్వం అనుకోవడం లేదు. ఆ సైనిక నాయకత్వం మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ మిత్రకూటమి దేశంగానే భావిస్తున్నది. ఈ అంశమే ఇప్పుడు భారత్‌ను క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేస్తున్నది.
భారత్ ముందున్న మార్గం
ఈ క్లిష్ట సమయంలో భారత్ కేవలం దౌత్యపరమైన హామీలపై ఆధారపడటం ప్రమాదకరం. ఇరాన్ అంతర్గత వర్గపోరులో భారత్ నలిగిపోకుండా, తన నౌకల రక్షణ కోసం ‘ఆపరేషన్ సంకల్ప్’ వంటి మిలిటరీ ఎస్కార్ట్‌లను బలోపేతం చేసేందుకు సిద్ధం అవుతున్నది. అంతే కాకుండా రష్యా మధ్యవర్తిత్వంతో ఇరాన్‌లోని హార్డ్ లైనర్లపై (ఐఆర్జీసీ) ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ప్రస్తుతానికి కనిపిస్తున్న ఈ యుద్ధ విరామం శాంతికి సంకేతం కాదు, అది తదుపరి పెద్ద యుద్ధానికి జరుగుతున్న సన్నాహంగానే భావించాలి. అగ్రరాజ్యాల ఆయుధ సమీకరణలు, ఇరాన్‌లోని అధికార పోరు మధ్య భారత్ తన సొంత ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది.
-హరీశ్ ఎస్పీ






