వేగంగా, అద్భుతంగా.. అమరావతి నిర్మాణం!

by Ravi |   (  Updated:2025-06-28 00:45:17  IST  )

అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా అద్భుతంగా జరుగుతున్నది. అధికారుల గృహ సముదాయాలు, జ్యుడీషియల్ కాంప్లెక్సులు

వేగంగా, అద్భుతంగా.. అమరావతి నిర్మాణం!
X

అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా అద్భుతంగా జరుగుతున్నది. అధికారుల గృహ సముదాయాలు, జ్యుడీషియల్ కాంప్లెక్సులు, ప్రాధాన్య రహదారులు, గవర్నమెంటు కాంప్లెక్సులు, సచివాలయ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు వంటి నిర్మాణ పనులు వేగంగా ప్రారంభం కాబోతున్నాయి. రాజధాని అమరావతిని నిర్మించేందుకు పదేళ్లుగా చంద్రబాబు పడుతున్న శ్రమ, తపన అమరావతిలో జరుగుతున్న భవనాల నిర్మాణాల రూపంలో కనిపిస్తుంది.

సువిశాల ప్రదేశంలో పూర్తి గ్రీన్ ఫీల్డ్ సిటీగా, అత్యంత భారీ ఎత్తున అత్యుత్తమంగా నిర్మాణం అవుతున్న నగరం ప్రస్తుతం ప్రపంచంలోనే లేదు. రాజధానిలో నిర్మించే ఐకానిక్ నిర్మాణాలు, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్లు, 8 నుంచి 6 వరుసల సువిశాల రహదారులు వందలాది ఎకరాల్లో పచ్చదనం, ల్యాండ్ స్కేపింగ్, భారీ ఉద్యానవనాలు మన రాజధానిని చూసి యావత్ ప్రపంచం కీర్తించనున్నది. సమున్నతంగా నిర్మితమయ్యే అసెంబ్లీ, హైకోర్టు సెక్రటేరియట్ టవర్లు 320 కిలోమీటర్ల పొడవైన వంకరలేని రోడ్డు నీరు, డ్రైనేజీ-గ్యాస్, విద్యుత్, ఐటీ వంటి సకల మౌలిక వసతులు భూగర్భం గుండానే రోడ్ల ప్రక్కన ఏర్పాటు చేస్తున్న డక్ట్‌లు మరే నగరానికి లేవు. ఆధునిక సాంకేతికతకు చిరునామాగా అమరావతిని నిర్మిస్తున్నారు.

మరో మూడేళ్లలో అమరావతి నిర్మాణాలు..

కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణం పనులు పరుగులు పెట్టిస్తోంది. అమరావతి అనుపానులు కళ్ల ముందు కనిపించడానికి మరో మూడేళ్లు పట్టవచ్చు. అమరావతి నిర్మాణంలో వేలాదిమంది కార్మికులతో కిటకిట లాడుతూ రేయింబవళ్లు పనులు చేస్తున్నారు. నిర్మాణానికి వివిధ వ్యవస్థల నుండి నిధులు కూడా సర్దుబాటు కావడంతో నిర్మాణ పనులు నిరాటంకంగా సాగుతున్నాయి. ఇప్పటికే అరవై వేల కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. కాంట్రాక్ట్ సంస్థలు రంగంలోకి దిగాయి. ఐకానిక్ భవనాల నిర్మాణ పనుల ప్రారంభానికి భారీ యంత్రాలను సిద్ధం చేస్తున్నారు. ఇతర భవనాలకు సంబంధించి 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో పనులు జరుగుతున్నాయి. అమరావతి ఉపాధి కేంద్రంగా మారింది. వేల మంది వర్కర్స్ ఇతర ప్రాంతాల నుంచి అమరావతికి వస్తున్నారు.

వేలకోట్లతో భవనాలు, టవర్లు..

ప్రభుత్వ కాంప్లెక్స్‌లో ఇంటిగ్రేటెడ్‌ రాష్ట్ర సచివాలయం, హెచ్‌వోడీ టవర్ల నిర్మాణానికి రూ.3,673.43 కోట్లతో ఎల్‌-1 బిడ్డర్లకు లెటర్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్సీ[ఎల్‌వోఏ]ని ఆమోదిస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనుల అప్పగింతకు సంబంధించి సీఆర్‌డీఏ ఆమోదం తెలిపింది. రూ.882.47 కోట్లతో జీఏడీ టవర్‌ [జీ+49] నిర్మాణ పనులను ఎన్‌సీసీ లిమిటెడ్‌కు, రూ.1,487.11 కోట్లతో టవర్స్‌-1, 2 [జీ+39] పనులు షాపూర్జీ అండ్‌ పల్లోంజీ సంస్థకు, రూ.1,303.85 కోట్లతో టవర్స్‌- 3, 4 [జీ+39] పనులను ఎల్‌ అండ్‌ టీ సంస్థకు అప్పగించింది. రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణాలు, డ్రైన్లు, తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, పునర్వినియోగ నీటి లైన్‌, అవెన్యూ ప్లాంటేషన్‌ తదితర మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,052.67 కోట్లతో పనులు చేపట్టేందుకు మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఐ ఏ ఎస్‌, ఏపీఎన్‌జీవో, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు, ప్రిన్సిపాల్‌ సెక్రటరీ బంగ్లాలు, జడ్జీల క్వార్టర్లు, గవర్నమెంట్‌ టైప్‌–1, 2 భవనాలు, ప్రధాన రోడ్ల పునర్నిర్మాణం, హ్యాపీనెస్ట్, సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయాల పునర్నిర్మాణాలు, ఎల్‌పీఎస్‌ జోన్లలో మౌలిక సదుపాయాల కల్పన వంటి అనేక ముఖ్యమైన పనులకు టెండర్లు పిలిచారు..

నగరాభివృద్ధికి పూర్తి ప్రాజెక్ట్ రిపోర్టు

రాజధానిలో నూతన శోభ సంతరించుకున్నది. రాజధాని నగరం 217,23 చదరపు కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధికి తాజా అంచనాల ప్రకారం టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది. మూడు మండలాల్లో 25 గ్రామాల పరిధిలో రాజధాని నగర సమగ్ర అభివృద్ధికి పూర్తి ప్రాజెక్టు రిపోర్టును సీఆర్డీఏ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా గ్రామాల వారీ ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల్సిన పనులు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై సమగ్ర నివేదికకు కసరత్తు జరుపుతోంది.

భారతదేశ ముఖద్వారం

గవర్నమెంట్ కాంప్లెక్స్‌లు, శాసనసభ, సచివాలయం, హెచ్ ఓడీ భవనాలకు ప్రతిపాదించిన గ్రామాల అభివృద్ధి, రివర్ ఫ్రంట్ నదీ ముఖద్వారంలోని గ్రామాల్లో ఏర్పాటు కానున్న ప్రాజెక్టులు విద్యా, వ్యాపార సముదాయాలు, వైద్యం, ఆరోగ్యం, చారిత్రక, సాంస్కృతిక వారసత్వ భవనాల నిర్మాణాలను మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనల మేరకు డీపీఆర్ సిద్ధం చేస్తుంది సీఆర్డీఏ. కొత్త రాజధానిని నిర్మించుకునే అవకాశం లభించటం ఒక అదృష్టంగాభావించాలి. అధునాతనమైన నగర నిర్మాణ ప్రణాళికతో చేపట్టిన అమరావతి భారతదేశ ముఖద్వారం కానుంది.

నీరుకొండ ప్రసాద్

98496 25610

Next Story