అక్షరాలపై అమావాస్య నీడ..!

by Ravi |   (  Updated:2026-06-16 00:31:04  IST  )

సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న సమాజంలోనూ అమావాస్య సెంటిమెంట్ ప్రభావంతో పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. అమావాస్య ఒక సహజ ఖగోళ ప్రక్రియ మాత్రమేనని, విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించేది వారి కృషి, క్రమశిక్షణ, శాస్త్రీయ దృక్పథమేనని వివరించే విశ్లేషణాత్మక కథనం.

అక్షరాలపై అమావాస్య నీడ..!
X

స్మార్ట్‌ఫోన్‌తో ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చుకున్న యుగమిది. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతూ, చంద్రయాన్‌తో చంద్రమండలిపై అడుగుజాడలు ముద్రిస్తూ, గగన్‌యాన్‌తో మానవ అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న దేశమిది. వైద్యం నుంచి వ్యవసాయం వరకు, విద్య నుంచి వ్యాపారం వరకు ప్రతి రంగంలో సాంకేతిక విప్లవం కొత్త మార్పులకు నాంది పలు కుతోంది. అయితే, ఈ కాలంలోనూ, మూఢ నమ్మకాలు మాత్రం సమాజాన్ని ఇంకా వెనక్కి లాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్నటి నుండి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభ మైనప్పటికీ, అమావాస్య సెంటిమెంట్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలపై స్పష్టమైన ప్రభావం చూపింది. ఉపాధ్యాయులు విధులకు హాజరైనా, విద్యార్థుల హాజరు నామమాత్రంగానే నమోదైంది. పాఠశాల బస్సులు ఖాళీగా తిరిగాయి. తరగతి గదులు వెలవెలబోయాయి. అమావాస్య ప్రభావం కేవలం తల్లిదండ్రుల నిర్ణయాలకే పరిమితం కాలేదు. కొన్ని ప్రైవేటు పాఠశాలలు జూన్‌ 12న ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించగా, మరికొన్ని పాఠశాలలు నిన్నటి రోజును సెలవుగా ప్రకటించాయి. ఇక నిన్న అమావాస్య, నేడు మంగళవారం సెంటిమెంట్‌ తోడవడంతో బుధవారం నుంచి పిల్లలను బడికి పంపాలని తల్లిదండ్రులు భావి స్తున్నారనే చర్చ సాగుతోంది. అమావాస్య గురించి విద్యార్థులకు పెద్దగా అవగాహన లేకపోయినా, పెద్దల నమ్మకాలు వారిని ప్రభావితం చేస్తున్నాయి. నిజానికి అమావాస్య అనేది చంద్రుడు, భూమి, సూర్యుడి మధ్యకు వచ్చే సహజ ఖగోళ ప్రక్రియ మాత్రమే. పిల్లల చదువులు, ప్రతిభ, భవిష్యత్తుతో దానికి ఎలాంటి సంబంధం లేదు. వారి విజయాన్ని నిర్ణయించేది వారి కృషి, క్రమశిక్షణ, నేర్చుకోవాలనే ఆసక్తి మాత్రమే. విజ్ఞానాన్ని వినియోగించు‌కుంటూనే, అశాస్త్రీయ నమ్మకాలకు లోనవడం సమాజంలోని విరుద్ధ ధోరణిని ప్రతిబింబిస్తోంది. విద్యకు అమావాస్య అడ్డంకి కాదు.. అవగాహన లోపమే అసలైన అడ్డంకి. పిల్లల్లో ప్రశ్నించే‌తత్వం, హేతుబద్ధమైన ఆలోచన, శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం కుటుంబం, పాఠశాల, సమాజం ఉమ్మడి బాధ్యత. మూఢనమ్మకాల ప్రభావం విద్యార్థుల భవిష్యత్తుపై పడకుండా చూడాల్సిన సమయం ఆసన్నమైంది. శాస్త్రీయ ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చినప్పుడే సమాజం నిజమైన అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది.

- గడగోజు రవీంద్రాచారి

98487 72232

Next Story