- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా సర్పంచులారా - మీ రాజ్యం మీ చేతుల్లోనే...!
దేశాభివృద్ధిలో గ్రామాల పాత్ర ఎంతో ముఖ్యమైనది. అలాంటి గ్రామాల అభివృద్ధికి నాయకత్వం వహిస్తున్న మహిళా సర్పంచులు నేడు ఒక శక్తివంతమైన మార్పుకు ప్రతీకలుగా నిలుస్తున్నారు.

దేశాభివృద్ధిలో గ్రామాల పాత్ర ఎంతో ముఖ్యమైనది. అలాంటి గ్రామాల అభివృద్ధికి నాయకత్వం వహిస్తున్న మహిళా సర్పంచులు నేడు ఒక శక్తివంతమైన మార్పుకు ప్రతీకలుగా నిలుస్తున్నారు. ఒకప్పుడు ఇంటి నాలుగు గోడలకే పరిమితమైన మహిళ, నేడు గ్రామ పరిపాలనను సమర్థంగా నిర్వహిస్తూ తన సామర్థ్యాన్ని నిరూపిస్తోంది. మహిళా సర్పంచులు గ్రామ సమస్యలను లోతుగా అర్థం చేసుకునే సున్నితత్వం కలిగి ఉంటారు. తాగునీరు, పారిశుధ్యం, ఆరోగ్యం, విద్య, మహిళా-శిశు సంక్షేమం వంటి అంశాలపై వారు ప్రత్యేక శ్రద్ధ చూపుతారు.
అనేక మంది మహిళలు విద్యావంతులు, సామర్థ్యవంతులు అయినా... భర్తలు వారిని వంటింటికి పరిమితం చేసి, సంతకాలు మాత్రమే చేయిస్తున్నారు. సమావేశాల్లో భర్తలే మాట్లాడతారు, నిర్ణయాలు తీసుకుంటారు. పార్టీలు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా భర్తలతోనే డీల్ చేస్తున్నారు. ఇది రాజ్యాంగ సవరణ ఆశయాన్ని దెబ్బతీస్తోంది. స్వచ్ఛమైన గ్రామాలు, పచ్చని పరిసరాలు, పాఠశాలల అభివృద్ధి వంటి కార్యక్రమాలలో మహిళా సర్పంచుల పాత్ర ప్రశంసనీయం. మహిళా సర్పంచ్‌లారా... మీ రాజ్యం మీ చేతుల్లోనే ఉండాలి. ఇది మీ హక్కు, మీ బాధ్యత. ఈ అవకాశాన్ని వృథా చేయకండి. మీరు స్వతంత్రంగా నడిస్తేనే గ్రామాలు నిజంగా మారతాయి!
భర్త చేతుల్లోనే అధికారం
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిపోయాయి. డిసెంబర్ 22న సర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 12,728 సర్పంచ్ స్థానాల్లో సగం కంటే ఎక్కువ మహిళలు గెలిచారు. ఇది 73వ రాజ్యాంగ సవరణ (ఆర్టికల్ 243డి) ప్రకారం 33% రిజర్వేషన్లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 50%కి పెంచిన ఫలితం. తెలంగాణలో మహిళా సర్పంచ్లు 6,500కు పైగా ఉన్నారు, వార్డు సభ్యుల్లో కూడా సగం మహిళలే. ఇది జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు అధికారం అందించిన విప్లవాత్మక అడుగు. కానీ సమస్య ఇక్కడే మొదలవుతోంది అనేక చోట్ల మహిళా సర్పంచ్లు కేవలం 'పేరు మీద' మాత్రమే ఉంటున్నారు. వారి భర్తలు, కుటుంబ సభ్యులు అధికారం చేపట్టేస్తున్నారు. ఫలానా ఊరు సర్పంచ్ ఎవరు అంటే ఆమె పేరు కాకుండా భర్త పేరే చెబుతారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, మండల పరిషత్ సమావేశాలు అంతా భర్తలే నడుపుతున్నారు.
స్త్రీల అధికారం కోసమే ఈ సవరణ
ఈ 'ప్రాక్సీ' సమస్య నామినేషన్ నుంచే మొదలవుతుంది. అభ్యర్థి పేరు పక్కన భర్త పేరు, ఫోటోలు, వాట్సాప్ నెంబర్–అంతా ఆయనదే. ఫ్లెక్సీలు, ప్రచారం కూడా ఇద్దరిదే. మహిళా రిజర్వేషన్ అంటే భర్తకు అధికారం ఇచ్చే మార్గమా? ఇది రాజ్యాంగ సవరణ ఆశయాన్ని ఎగతాళి చేస్తున్న దుర్మార్గం. మహిళా రిజర్వేషన్ అంటే భర్తకు అధికారం ఇచ్చే టికెట్ కాదు. అది మహిళల అధికారం కోసం ఉన్నది. ప్రాక్సీ నిషేధం లేదు కాబట్టి నేరుగా జైలు లేదా ఫైన్ లేదు. మహిళా సర్పంచ్ స్వతంత్రంగా పనిచేయకపోతే లేదా డ్యూటీ చేయకపోతే, సెక్షన్ 37 (లాంటి సెక్షన్లు) ప్రకారం జిల్లా కలెక్టర్ లేదా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) డిస్ క్వాలిపై (పదవి తొలగింపు) చేయవచ్చు.
పదవి ఒకరికి.. చక్రం తిప్పేది మరొకరా?
కొన్ని సందర్భాలలో మహిళా సర్పంచులు కేవలం పేరుకే పరిమితమై, పురుషుల చేతుల్లో అధికారాలు ఉండటం మనం చూస్తున్నాం. ఇది మారాలి. మహిళా సర్పంచులు తమ హక్కులు, బాధ్యతలను పూర్తిగా తెలుసుకుని ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకుని, వాటిని గ్రామ ప్రజలకు సమర్థంగా అందించాలి. గ్రామాల్లో మహిళలు సర్పంచ్లుగా ఎన్నికైనా.. అధికారాలు మాత్రం వారి భర్తలే అనుభవిస్తూ ఉంటారు. ఏదో రిజర్వేషన్ల ప్రకారం.. మహిళలను సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయించి.. గెలిచిన తర్వాత వారి భర్తలు.. పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. ఇక కొందరు తమ కుమార్తెలను, తల్లులను సర్పంచ్లుగా గెలిపించినా.. పదవులు మాత్రం వారే అనుభవిస్తూ ఉంటారు. ఇది చట్ట ప్రకారం తప్పే అయినా.. అందుకు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. ఎక్కడా అలాంటి దాఖలాలు కనిపించవు. గ్రామాల్లో మహిళలు సర్పంచ్లుగా ఉంటే వారు కేవలం సంతకాలు, సభలకు హాజరు కావడమే తప్పితే.. చక్రం తిప్పేది మొత్తం వాళ్ల భర్తలే అయి ఉంటారు.
గ్రామాన్ని నడపాల్సింది మీరే..
అనేక మహిళలు విద్యావంతులు, సామర్థ్యవంతులు అయినా... భర్తలు వారిని వంటింటికి పరిమితం చేసి, సంతకాలు మాత్రమే చేయిస్తున్నారు. సమావేశాల్లో భర్తలే మాట్లాడతారు, నిర్ణయాలు తీసుకుంటారు. పార్టీలు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా భర్తలతోనే డీల్ చేస్తున్నారు. ఇది రాజ్యాంగ సవరణ ఆశయాన్ని దెబ్బతీస్తోంది. మహిళలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకపోతే ఈ రిజర్వేషన్కు అర్థం లేదు. నూతనంగా ఎన్నికైన మహిళా సర్పంచ్లు ఇప్పుడే మార్పు తీసుకురాగలరు. పంచాయతీ రాజ్ చట్టం, నిధులు, విధులు బాగా అధ్యయనం చేయండి. సలహాలు తీసుకోవచ్చు, చర్చించవచ్చు కానీ నిర్ణయాలు మీరే తీసుకోండి. అధికారులకు, పార్టీలకు మీరే నేరుగా ఫోన్ చేయండి, మాట్లాడండి. గ్రామాన్ని మీరే నడపండి. పురుషుల కంటే మీరు శక్తివంతంగా చేయగలరు. భర్తలు, కుటుంబ సభ్యులు సలహా ఇవ్వవచ్చు కానీ అధికారం మీ చేతుల్లోనే ఉండాలి. మహిళా సర్పంచ్‌లారా... మీ రాజ్యం మీ చేతుల్లోనే ఉండాలి. ఇది మీ హక్కు, మీ బాధ్యత. ఈ అవకాశాన్ని వృథా చేయకండి. మీరు స్వతంత్రంగా నడిస్తేనే గ్రామాలు నిజంగా మారతాయి!
బసడ సంపత్ యాదవ్
70321 32593






