- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారతీయ భాషలన్నీ జాతీయ భాషలే!
భారతదేశం బహు భాషా సంస్కృతికి నిలయం. ఇక్కడి ప్రతీ భాష ప్రజల గుర్తింపు, సంస్కృతికి ప్రతిబింబం. సమాచార మార్పిడిలో

భారతదేశం బహు భాషా సంస్కృతికి నిలయం. ఇక్కడి ప్రతీ భాష ప్రజల గుర్తింపు, సంస్కృతికి ప్రతిబింబం. సమాచార మార్పిడిలో భాష కీలక పాత్ర పోషిస్తుంది. దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించాలంటే భాషా వైవిధ్యాన్ని గౌరవించడం, అన్ని భాషలకూ సమాన ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరం. రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షిస్తూ, అన్ని భాషలనూ ఆదరించడం ద్వారానే భారత్ బలమైన, ఐక్య దేశంగా ముందుకు సాగుతుంది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 343(1) ప్రకారం హిందీని రాజభాషగా గుర్తించడానికి ప్రధాన కారణాలు.. జాతీయ సమైక్యత, పాలనా సౌలభ్యం, సాంస్కృతిక వారసత్వం, ప్రపంచ వేదికపై ప్రాతినిధ్యం. అయితే, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, హిందీని జాతీయ భాషగా ప్రచారం చేసే ప్రయత్నాలు తీవ్ర వివాదాలకు దారి తీశాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు, హిందీని రుద్దే ప్రయత్నాలను సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఇతర భాషల మనోభావాలను దెబ్బతీస్తుందని విమర్శిస్తున్నాయి.
హిందీని కేంద్రం ప్రోత్సహించడంతో..
ఇటీవల కేంద్రం అధికారిక సమాచారానికి, విద్యా విధానాలలో హిందీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రయత్నాలు మళ్లీ వివాదానికి కారణ మయ్యాయి. 2025 జూన్‌లో మహారాష్ట్రలో హిందీని మూడో భాషగా తప్పనిసరి చేయాలనే సర్క్యులర్‌ను ప్రతి పక్షాల నిరసనల నేపథ్యంలో వెనక్కి తీసుకోవలసి వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ హిందీ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేయ డానికి ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకలోనూ కన్నడ ఫ్రైడ్ పేరుతో హిందీ వ్యతిరేక ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ రాష్ట్రాలన్నీ ద్విభాషా విధానాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కర్ణాటక అయితే వ్యాపార సైన్ బోర్డుల్లో 60% కన్నడ పదాలు వాడాలని రాష్ట్ర ప్రభుత్వం బిల్లును కూడా ఆమోదించింది. అజయ్ దేవగన్, కిచ్చా సుదీప్ మధ్య జరిగిన ట్విట్టర్ వాగ్వాదం కూడా ఈ భాషా వివాదానికి జాతీయ స్థాయిలో రాజకీయ రంగు పులిమింది.
ప్రాంతీయ భాషలు లేవు..
ఇలాంటి పరిస్థితుల్లో, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ముఖ్య అధికార ప్రతినిధి సునీల్ అంబేకర్ "దేశంలోని భాషలన్నీ జాతీయ భాషలే" అని ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భాషా వివాదాలలో తరచుగా ఆర్ఎస్ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎదురవుతున్న సమయంలో భారతదేశంలో హిందీకే కాకుండా, ప్రతీ భాషకూ సమాన ప్రాధాన్యత ఉందని, ప్రాంతీయ భాషలు అంటూ లేవని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. ఈ ప్రకటన భాషా ఐక్యతకు కొత్త ఆశాజనకమైన కోణాన్ని అందించింది. ఇది ఆర్ఎస్ఎస్ సాంస్కృతిక జాతీయ వాదం సిద్ధాంతానికి కూడా అనుగుణంగా ఉంది. మాతృభాషలో విద్య బోధిస్తే పిల్లలు ఆ విషయాలను సులభంగా అర్థం చేసు కోవడానికి, సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచన మెరుగుపడటానికి, నేర్చుకునే ప్రక్రియకు సమర్థవంతంగా ఉండటానికి సహాయపడుతుంది. చిన్నతనం నుంచే ఇతర భాషలను బలవంతంగా రుద్దడం వల్ల పిల్లలపై అనవసరమైన మానసిక భారం పడుతుందని భాషా శాస్త్రజ్ఞులు, విద్యావేత్తలు వాదిస్తున్నారు. మాతృ భాష విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. వారి సాంస్కృతిక మూలాలతో అనుసంధానాన్ని బలపరుస్తుంది.
బహుభాషావాదం భారతదేశానికి బలం!
భాషా వైవిధ్యం భారతదేశానికి నిజమైన బలం. ఇది దేశంలోని గొప్ప వారసత్వంలో ఒకటి. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ 22 భాషలకు అధికారిక గుర్తింపు ఇచ్చింది. 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా అనేక రాష్ట్రాలు భాషల ప్రాతిపదికన తిరిగి ఏర్పాటు చేయ బడ్డాయి. ఇది ప్రజలకు స్వభాషలో పరిపాలనను అందించి, వారి సాంస్కృతిక గుర్తింపును పరిరక్షించడానికి దోహద పడింది. ఈ రాష్ట్రాల ఏర్పాటు జాతీయ ఐక్యతను బలోపేతం చేసి, ప్రజాస్వామ్యాన్ని శక్తివంతం చేసింది. 1971లో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ భాషా ప్రాతిపదికన విడిపోవడం వంటి చారిత్రక సంఘటనలు భాషా గుర్తింపునకు ప్రజలు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో స్పష్టం చేస్తాయి. అందుకే అన్ని భారతీయ భాషలకు సమాన ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా, దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించవచ్చు. ఇది భాషా సామరస్యానికి, దేశ నిర్మాణానికి తోడ్పడుతుంది. వివిధ భాషల ప్రజలు తమ భాషకు గుర్తింపు, గౌరవం లభించి నప్పుడు, వారు దేశంలో తమకు చోటు ఉందని, సమాన భాగస్వామ్యం ఉందని భావిస్తారు. ఇది జాతీయ భావనను బలపరుస్తుంది.
హిందీ రాజభాషగా ఉంటే తప్పేంటి?
మన మాతృభాషలను ప్రోత్సహిస్తూనే, దేశ ప్రజ లందరినీ కలిపే హిందీ రాజభాషగా ఉంటే తప్పేమిటనే వాదనకు బలం చేకూరుతోంది. మన జాతీయ గీతం 'జనగణమన', జాతీయ గేయం 'వందేమాతరం' బెంగాలీ భాషలో రచింపబడ్డాయి. జాతీయ పతాకాన్ని రూపొందించింది తెలుగు వాడైన పింగళి వెంకయ్య. అబ్దుల్ కలాం రాష్ట్ర పతిగా, పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా దక్షిణాది నుంచి ఉన్నత పదవులను అధిరోహించారు. ఈ ఉదాహరణలన్నీ భారతదేశం వైవిధ్యాన్ని, సమైక్యతను చాటి చెబుతాయి. వివిధ భాషలకు చెందిన ప్రముఖులు దేశ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. మాతృభాషలను గౌరవిస్తూనే, ఒక ఉమ్మడి రాజభాషగా హిందీ ఉండటం దేశ ప్రజల మధ్య అవగాహనను, అనుసంధానాన్ని పెంచుతుందని కొందరి భావన.
రాజకీయ ప్రయోజనం కోసమే..
పాశ్చాత్య, విదేశీ భాషలైన ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ లేదా భారతీయ భాషలైన ఉర్దూ, అరబిక్ వంటి భాషలపై లేని ద్వేషం కేవలం హిందీపైనే ఎందుకు వ్యక్తమవుతుందనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. అయితే ఇవన్నీ రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న భాషా రాజకీయాలు.. కొన్ని వర్గాలు తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్లో భాషా విభేదాలను రెచ్చగొట్టి భాష పట్ల అనవసరమైన వ్యతిరేకతను సృష్టి స్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.. ఏ రాష్ట్రానికైనా మాతృ భాషాభిమానం సహజం. కానీ అది ఇతర భాషల పట్ల ద్వేషంగా మారకూడదు.
డా. రావుల కృష్ణ
సహ ఆచార్యులు, హెచ్‌సీయూ
94929 09371






