- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీల్లో అంతా నాయకులే.. నాయకత్వమే లేదు!
బీసీలలో నాయకులెక్కువే, కానీ నాయకత్వమే తక్కువ అన్న డా. జయశంకర్ మాటలను ఆషామాషీగా తీసుకోవద్దు.

బీసీలలో నాయకులెక్కువే, కానీ నాయకత్వమే తక్కువ అన్న డా. జయశంకర్ మాటలను ఆషామాషీగా తీసుకోవద్దు. ఇప్పటివరకు బీసీలకు జరిగిన అన్యాయానికి బాధ్యత ఒకరి మీదే వేయడం సరైనది కాదు. నాయకులు, ప్రజలు ఇద్దరూ సమాన బాధ్యత వహించాలి. నాయకులు తన ప్రయోజనాల కోసం పని చేస్తే, ప్రజలు ప్రశ్నించాలి. ప్రజలు మౌనంగా ఉంటే, నాయకులు అధికారం కోసం బీసీలను వాడుకుంటూనే ఉంటారు.. బీసీలు చేసేది రాజకీయ యుద్ధం కాదు – సామాజిక యుద్ధం". ఇది ఐక్యతతో, అవగాహనతో మాత్రమే గెలవాలి..
భారతదేశంలో అతిపెద్ద సామాజిక వర్గం అయిన బీసీలు సుదీర్ఘకాలంగా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వంచించబడ్డారు. వారి కోసం అనేక పోరాటాలు జరిగాయి. రిజర్వేషన్లు సాధించబడ్డాయి.. అయినా న్యాయం మాత్రం మట్టిలో కలిసినట్టే కనబడుతోంది. ఈ దురవస్థకు బాధ్యులెవ రు? ప్రభుత్వమా? నాయకులా? లేక స్వయంగా బీసీ ప్రజలేనా?
వందలాది కులాలున్నా.. ఒక్కటి కాలేక
స్వాతంత్ర్యానికి పూర్వ కాలంలో బీసీలను "శూద్రులు"గా తక్కువగా చూసేవారు.. వీరిని విద్య, పదవులు, సామాజిక హక్కుల నుంచి పూర్తిగా తొలగించారు.. ఫూలే, పెరియార్, నారాయణగురు వంటి మహానుభావులు ఈ వర్గానికి గొంతుగా నిలిచారు.. శతాబ్దాలుగా పేదరికం, విద్యాహీనత బీసీలను అణచివేసింది. ఈ సమూహం అత్యంత శ్రమ జీవులున్న, నైతికతలున్న సమూహం. కానీ అదే అమాయకత్వం కారణంగా ఇతర వర్గాల వారు వీరిని రాజకీయంగా వాడుకుంటున్నారు.. వీరు ఓటు వేయడంలో అత్యంత శ్రద్ధ చూపే వర్గం. కానీ తాము ఓటు వేసిన నాయకుడిని తిరిగి ప్రశ్నించరు.. దీంతో వారే చివరి వరకూ మోసపోతున్నారు.. సామాజికంగా బీసీలలో వందలాది కులాలున్నా "ఒక్కటిగా నిలబడలేని పరిస్థితి". శక్తి ఉన్నా విలువ లేదన్న తప్పుడు భావన వల్ల ఈ కులాల్లో నాయకత్వం తక్కువైంది. ఇక ఒక పార్టీ అధికారంలోకి రావడానికి బీసీల ఓటు అవసరం. కానీ వారికే పదవులు ఇవ్వరు.. ఇది నీతి లేని వ్యవస్థకు నిదర్శనం.
బీసీ సంఘాల ఆవిర్భావం ..
1970ల తర్వాత దేశమంతటా వివిధ బీసీ సంఘాలు మొదలయ్యాయి.. ఇవి మొదట "బీసీల హక్కుల కోసం" పనిచేశాయి. కానీ క్రమంగా ఈ సంఘాలు రాజకీయ ఆశలకోసం పని చేయడం మొదలుపెట్టాయి.. సంఘాలను నడిపే నాయకులు తాము రాజకీయంగా లబ్ధి పొందడమే కాకుండా, బీసీ సమాజాన్ని చీల్చి వాడుకోవడం మొదలు పెట్టారు. ఒకే బీసీ వర్గానికి చెందిన వారే ఒకరినొకరు దెబ్బతీయడం ప్రారంభించారు.. రాజకీయ పార్టీలలో పదవుల కోసం పోటీలు, పరస్పర ఆరోపణలు పెరిగాయి. అశ్రద్ధ, అవగాహన లోపం, సామాన్య బీసీ ప్రజలకు తాము అన్యాయానికి గురవుతున్నామన్న అవగాహన లేదు.. నాయకులను ప్రశ్నించని ధోరణి, "మనవాడు కదా" అనే భ్రమతో, నాయకత్వంలో ఉన్న వారిని ప్రశ్నించకుండా గుడ్డిగా అనుసరించారు. దీంతో ఓటు రాజకీయాల్లో బలిగావడం, నాయకులు పార్టీ మారినా, అధికారం కోసం బీసీలను ఉపయోగించుకున్నా, బీసీ ప్రజలు ఒక్క ప్రశ్న కూడా వేయలేదు.. నిజానికి బీసీలు అమాయకులు కాదు.. వారిని సమర్థవంతులుగా మలిచే అవకాశాన్ని ఇవ్వని వ్యవస్థే అసలు దోషి.
గణాంకాలు చెబుతున్న సత్యం !
జనాభాలో బీసీ శాతం 52% ఉన్నప్పటికీ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 5% మాత్రమే ఉన్నారు.. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో కేవలం 12 మంది బీసీలు పనిచేశారు. పార్లమెంట్ ఎంపీలు (2024 వరకు) 30 మంది. ప్రొఫెసర్లు 4%, ఈ గణాంకాల నుంచి చూస్తే బీసీలు అధిక సంఖ్యలో ఉన్నా, ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందనే విషయం అర్థమవుతుంది. బీసీల విభజనలో రాజకీయ పార్టీలు తమ అవసరాలకు అనుగు ణంగా నాయకులను మార్చుకుంటున్నాయి. ఒక బీసీ వర్గాన్ని ఇంకొకదాని మీద పోటీ పెట్టి తమ ఓటు బ్యాంకును విస్తరించుకుంటున్నాయి..
బీసీ నాయకుల తప్పిదాలు..
బీసీ నాయకులు తమ వర్గాన్ని చిన్న చిన్న ఉపవర్గాలుగా విడదీసి బలహీనపరచడం, అలాగే రాజకీయ పార్టీలు కోరినట్టుగా ఆడటం, ప్రజా ప్రయోజనాల కన్నా పదవుల పట్ల ఆసక్తి. బీసీ అభ్యున్నతి కోసం లాంగ్‌టెర్మ్ వ్యూహాలు రూపొందించకపోవడం. తాము ఏ పార్టీకి చెందిన వారైనా, బీసీ ప్రజలకు ప్రయోజనం కలిగించాలనే భావన లోపించిపోవడం. అహం, స్వార్థం వల్ల బీసీల ఐక్యతను తుంచివేయడం ఒకే అంశంపై వేర్వేరు అభిప్రాయాలు ఉండటం, బీసీలపై ఒక “అక్టివ్ ఇంటిలిజెన్స్ లాబీ” లేకపోవడం, వ్యవస్థితమైన ప్రచారం జరగకపోవడం. ఫలితంగా బీసీల సమస్యలు ‘మరుగు నిట్టూర్పు’లుగా మారుతున్నాయి. ఇక బీసీ ప్రజలు, చదువుపై శ్రద్ధ లేకపోవడం, తమ పిల్లల చదువుపై ఎక్కువగా పెట్టుబడి పెట్టకపోవడం. పని చేయని నాయకులను గెలిపించుకోవడం, సామాజిక న్యాయం కోసం వీధుల్లోకి రావడంలో వెనుకంజ వేయడం, బీసీ అనే ఐక్యతా భావాన్ని కోల్పోయి, కులపరమైన చిన్న చిన్న విభజనలలో చిక్కుకుపోవడం. బీసీ నాయకులు చేసిన తప్పులు..
ఏం చేయాలి?
అందుకే ఇప్పటికైనా బీసీ నాయకులు ఒకే వేదికపై కలిసికట్టుగా పని చేయాలి. పదవుల కోసం పార్టీ మారకుండా, బీసీల కోసం శాశ్వతంగా నిలబడాలి. బీసీల కోసం విద్య, ఉద్యోగ, పార్లమెంట్, అసెంబ్లీలలో కోటా పెంపు కోసం ఒత్తిడి తీసుకురావాలి. ఎవరికి వారు సొంత కులాల పేర్లతో పిలుచుకోవడం చేయడం మానాలి. ఓటు వెయ్యక ముందే.. ఇచ్చిన హామీలు, తమ వర్గానికే నాయకత్వం కోరే ధైర్యం ఉన్న నాయకులను ఎన్నుకోవాలి. బీసీ కులాల మధ్య వివాహ సంబంధాలు ఎక్కువగా ప్రోత్సహించాలి.. భవిష్యత్ ఉన్నత స్థితి కోసం చదువుపై దృష్టి పెంచాలి. స్వీయ విమర్శన వ్యక్తిత్వాన్ని అలవరచుకొని బహుజన బలమంటే శబ్దం కాదు సమగ్రమైన ఐక్యత అని నిరూపించాలి.
-డా. కేశవులు ఎండి.
చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం.
85010 61659






