మానవ స్పర్శ ఉంటేనే ఏఐకి శోభ

by Ravi |   (  Updated:2025-07-11 01:00:57  IST  )

కృత్రిమ మేధస్సు (ఏఐ) అనేది యంత్రాలు మానవులలాగా ఆలోచించి, మానవ సామర్థ్యాలను అనుకరించే పనులను చేయగల

మానవ స్పర్శ ఉంటేనే ఏఐకి శోభ
X

కృత్రిమ మేధస్సు (ఏఐ) అనేది యంత్రాలు మానవులలాగా ఆలోచించి, మానవ సామర్థ్యాలను అనుకరించే పనులను చేయగల సాంకేతికత. ఈ సాంకేతికత భారీ డేటాను సేకరించి, గణిత నమూనాలు లేదా అల్గారిథమ్‌ల ద్వారా నమూనాలను గుర్తించి, ఊహలు చేసేందుకు శిక్షణ పొందుతుంది.

శిక్షణ తర్వాత, ఈ అల్గారిథమ్‌లు వివిధ అనువర్తనాల్లో ఉపయోగించబడతాయి, కొత్త డేటా నుండి నేర్చుకుంటూ, చిత్రాన్ని గుర్తించడం, భాషా ప్రాసెసింగ్, డేటా విశ్లేషణ వంటి సంక్లిష్ట పనులను మరింత ఖచ్చితత్వంతో నిర్వహిస్తాయి.

మానవ భాషలో సంభాషించే ఏఐ

ఏఐలో ప్రధాన రకాలు ఉన్నాయి. మెషిన్ లెర్నింగ్ డేటా నుండి నేర్చుకుని నిర్దిష్ట పనులను చేస్తుంది. దాని ఖచ్చిత త్వం అనుభవంతో పాటు పెరుగుతుంది. డీప్ లెర్నింగ్ మానవ మెదడును పోలి ఉంటుంది. అది న్యూరల్ నెట్‌ వ‌ర్క్‌ల ద్వారా సంక్లిష్ట నమూనాలను గుర్తిస్తుంది. వైద్య చిత్రాల విశ్లేషణ, ఉపగ్రహ చిత్రాల్లో కదలికలు, ప్రకంపనల ను గుర్తించడం వంటి పనులకు ఉపయోగపడుతుంది. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్‌ఎల్‌పీ) మానవ భాషను అర్థం చేసుకుని, సంభాషించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. జనరేటివ్ ఏఐ టెక్స్ట్, చిత్రాలు, వీడియోల వంటి కొత్త కంటెంట్‌ను సృష్టిస్తుంది. కళ, వినోదం, మార్కెటింగ్, సాఫ్ట్‌వేర్ మొదలైన అనేక రంగాల్లో, వాటి అభివృద్ధిలో అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఏఐ ఏజెంట్లు స్వయంచాలకంగా (తమకు తామే స్వయంగా) నిర్ణయాలు తీసుకుంటాయి. ఏజెంటిక్ ఏఐ బహుళ ఏజెంట్ల సమన్వయంతో సంక్లిష్ట పనులను నిర్వహిస్తుంది. ఉదాహరణకు, పరిశోధన లేదా సాఫ్ట్‌వేర్ సమస్యల వంటివి పరిష్కరిస్తుంది.

భవిష్యత్తులో ఏఐ వాటా 90 శాతం

ఏఐ నైపుణ్యాల డిమాండ్ గత దశాబ్దంలో నాలుగు రెట్లు పెరిగింది. ప్రస్తుతం ఏఐ సంబంధిత ఉద్యోగులకు 11 శాతం ఎక్కువ వేతనం లభిస్తున్నాయి. సమాచారం, ఆర్థిక శాఖ, పరిపాలన రంగాల్లో ప్రత్యేకంగా ఏఐని ఉపయోగిస్తున్నారు. అనేక ఇతర రంగాలలో ఏఐ వాడకం నానాటికీ అనూహ్యంగా పెరుగుతోంది. ఏఐ డేటా ఎంట్రీ వంటి పునరావృత (రొటీన్) పనులను ఆటోమేటిక్‌గా వేగంగా పని చేస్తుంది. భారీ డేటాను సైతం విశ్లేషించి, తార్కిక నిర్ణయాలకు సహాయపడుతుంది. చాట్‌ బాట్‌లు కస్టమర్ డిమాండ్ మేరకు స్ట్రీమ్‌లైన్ చేస్తాయి. జే.పీ. మోర్గాన్ ఒమ్ని ఏఐ ప్లాట్‌ఫారమ్ ఆర్థిక అంతర్దృష్టులను అందించి, ఖర్చులను తగ్గిస్తుంది. 2028 నాటికి 90 శాతం యజమానులు ఏఐని అమలు పరచాలని చూస్తున్నారు. ఏఐ ఆటోమేషన్ ద్వారా 25 శాతం ఉద్యోగాలను భర్తీ చేయవచ్చు. కానీ సైబర్‌ సెక్యూరిటీ, డేటా విశ్లేషణ వంటి కొత్త రంగాల్లో అవకాశాలను మరింత ఎక్కువగా సృష్టించే అవకాశం ఉంది.

లైబ్రేరియన్లను రీప్లేస్ చేయలేవు...

గ్రంథాలయలలో ఏఐ వాడకం ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, జ్ఞాన ప్రాప్యతను అది విస్తరిస్తుంది. చాట్‌బాట్‌లు కస్టమర్‌ను గుర్తించటం, నిర్ధారణ చేసుకోవటం, డేటా పర్యవేక్షణ, ఖర్చు ఆదాలో సహాయపడుతున్నాయి. కానీ ప్రస్తుతం అసమర్థమైన స్పందనల కారణంగా మానవ లైబ్రరీయన్‌లను పూర్తిగా రీప్లేస్ చేయలేవు. ఏఐ సర్క్యులేషన్, కాటలాగింగ్ వంటి పనులను ఆటోమేట్‌గా చేస్తుంది, "టెక్స్ట్-టు-స్పీచ్" ద్వారా సౌలభ్యతను మెరుగుపరుస్తుంది, డేటా విశ్లేషణ,విషయ సేకరణ, విషయ నిర్వహణ, మెటా డేటా ఖచ్చితత్వాన్ని పెంచుతుంది. అందుకే లైబ్రరీయన్‌లు ఏఐని గురించిన అవగాహనను పెంచుకోవాలి.

ఏఐ ఖచ్చితమైనది కాదు

ఏఐ ఎల్లప్పుడూ ఖచ్చితమైనది కాదు. ఏఐ పై మానవ తనిఖీ, పర్యవేక్షణ అవసరం. న్యాయ శాస్త్రంలో, పరిశోధనా రంగాల్లో దీనిని జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే ఇది కొంత తప్పుడు సమాచారాన్ని ఇవ్వ‌వచ్చు. ఇది వేగంగా సమాచారాన్ని తీసుకుని విశ్లే‌షణ చేస్తుంది. అయితే అది విషయాన్ని నేర్చుకునే సమయంలో తప్పు సమాచారం ఇస్తే దానినే యధాతధంగా నేర్చుకొని తప్పు సమాధానమే మనకు ఇస్తుంది. రఫ్ డ్రాఫ్ట్‌లు, రాయడంలో లోపాలను తగ్గిస్తుంది. అయితే పదేపదే చేయవలసిన రొటీన్ పునరావృత పనులకు ఏఐ బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ భావోద్వేగాలను వ్యక్తీ కరించలేదు. భవిష్యత్తులో చెప్పలేం. అందుకే దీనికి మానవ స్పర్శ అవసరం. ఏఐ సాక్షరత పాఠశాల పాఠ్యాంశాల్లో భాగం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది భవిష్యత్తు కెరీర్‌లకు ఉపయోగ పడుతుంది. సామాజిక అభివృద్ధికి ఇది కీలకం కానుంది.

డాక్టర్ రాధికా రాణి,

అసిస్టెంట్ ప్రొఫెసర్, కేయూ

80743 17172

Next Story