తెలంగాణకు మళ్లీ అన్యాయమే!

by Ravi |   (  Updated:2025-02-06 00:45:46  IST  )

కేంద్ర బడ్జెట్ 2025-26 మళ్లీ ఒకసారి రాష్ట్రాల హక్కులను విస్మరించింది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన

తెలంగాణకు మళ్లీ అన్యాయమే!
X

కేంద్ర బడ్జెట్ 2025-26 మళ్లీ ఒకసారి రాష్ట్రాల హక్కులను విస్మరించింది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాధాన్యతను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్రం సముచితంగా స్పందించాల‌ని కోరినా.. తెలంగాణ‌పై కేంద్రం అంతులేని వివ‌క్ష కనబరచింది. రాష్ట్రానికి న‌యాపైసా కేటాయించ‌క‌పోవ‌డం బీజేపీ నిర్లక్షానికి నిద‌ర్శనం. బీజేపీకి తెలంగాణ ఓట్లు కావాలి.. కానీ తెలంగాణ అభివృద్ధి మాత్రం వారికి ప‌ట్టదన్నదే తాజా బడ్జెట్ సారాంశం.

పేదలు, యువత, రైతులు, మహిళల పురోభివృద్ధే లక్ష్యంగా కేంద్రం 2025-26 బడ్జెట్‌ను పార్ల మెంట్ ముందు ఉంచింది. వికసిత్ భారత్ దిశగా.. సంస్కరణలు కొనసాగిస్తామని చెబుతూనే బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేసింది. పది రంగాలకు ఊతమిచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ప్రకటించింది. దేశంలో ప్రాంతీయ అనుసంధానతను పెంచేందుకు కొత్త పద్దులో మరింత ప్రాధాన్యం ఇచ్చింది. ఎంఎస్‌ఎంఈల ద్వారా ఎగుమతులను రెట్టింపు చేస్తామని వెల్లడించింది. వేతన జీవులకు 12 లక్షల వరకూ ఆదాయ పన్ను మినహాయింపులు కల్పించింది. మొత్తంగా 50 లక్షలకు పైగా కోట్లతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను కేంద్రం ప్రతిపాదించింది.

రాష్ట్రాల ఆర్థిక స్వతంత్రతను పరిగణించకుండా..

'ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించిన అభివృద్ధి చర్యలు పది విస్తృత రంగాల్లో ఉన్నాయి. పేదలు, యువత, అన్నదాత, మహిళలపై దృష్టిపెట్టడంతో పాటు వ్యవసాయ అభివృద్ధి, దిగుబడి పెంపు, గ్రామాల్లో నిర్మాణాత్మక అభివృద్ధి, సమగ్రాభివృద్ధి పథంలోకి అందరినీ కలుపుకుని వెళ్లడం, మేకిన్‌ ఇండియాలో భాగంగా ఉత్పత్తి పెంపు, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు మద్దతు, ఉద్యోగాలు కల్పించే అభివృద్ధి, ప్రజా ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణల రంగంలో పెట్టు బడులు, ఇంధన సరఫరా పరిరక్షణ, ఎగుమతులకు ప్రోత్సాహం, ఆవిష్కరణలు పెంచి పోషించడం ఇందులో భాగం. ఈ అభివృద్ధి యాత్రలో వ్యవసాయం, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు, పెట్టుబడులు, ఎగుమతులు మన శక్తివంతమైన ఇంజన్లు'. ప్రతీసారి బడ్జెట్‌ ప్రభుత్వ కోశాగారాన్ని నింపడంపై దృష్టి సారిస్తే.. ఈ సారి పద్దు మాత్రం ప్రజల జేబులను నింపడానికి, తద్వారా వారి పొదుపును పెంచడానికి ఉద్దేశించిందని మోడీ వివరించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ను ఈ పన్ను మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ఈ బడ్జెట్ కొన్ని వస్తువుల కస్టమ్స్ సుంకాలను తగ్గించినప్పటికీ, సెస్‌లను పెంచడం ద్వారా రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఆదాయపు వాటాను మరింత తగ్గించింది. ఈ విధానం కేంద్రం - రాష్ట్రాల ఆర్థిక సంబంధాల్లో రాష్ట్రాల న్యాయమైన వాటాను దెబ్బ తీసేలా ఉంది. రాష్ట్రాల ఆర్థిక స్వతంత్రతను పెంచాలనే రాష్ట్రాల డిమాండ్‌ను పరిగణించకుండా, సీఎస్ఎస్‌‌పై ఆధారపడే విధానాన్ని మరింత పెంచడం ఆర్థిక సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.

సమర్థవంతమైన వనరులు ఉన్నప్పటికీ..

ఈ బడ్జెట్‌లో బిహార్ రాష్ట్రానికి వివిధ పథకాల ద్వారా అధిక నిధులు కేటాయించబడినప్పటికీ, గతంలో ఆ రాష్ట్రం ఆదాయంలో ప్రాశస్త్యాన్ని చూపింది. ఆర్థిక లోటు అనుమతించిన పరిమితికి తక్కువగా ఉంది. అయితే, సమర్థవంతమైన వనరుల వినియోగ సామర్థ్యం ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాలను నిర్లక్ష్యం చేయడం కేవలం తెలంగాణకే కాకుండా, దేశ అభివృద్ధికి కూడా నష్టం కలిగించే అంశం. తెలంగాణ రాష్ట్రం సాగు ప్రాజెక్టులను ప్రాధాన్యతగా భావిస్తూ నిరంతరం పనిచేస్తుంది. కానీ, ఈ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర సాగు ప్రాజెక్టులకు గణనీయమైన నిధులు కేటాయించలేదు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడంలో ఈ బడ్జెట్ వైఫల్యం చెందింది. కేంద్రం వ్యవసాయ అభివృద్ధి గురించి గొప్పగా మాట్లాడుతున్నా, తెలంగాణలోని సాగు ప్రాజెక్టులను పక్కన పెట్టడం దారుణం. అలాగే కొత్త గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధి విషయంలో బిహార్‌కి నిధులు కేటాయించింది కానీ వరంగల్ విమానాశ్రయాన్ని పట్టించుకోలేదు. అలాగే తెలంగాణ, దేశంలో కృత్రిమ మేధస్సు రంగంలో అగ్రగామిగా నిలుస్తోంది. ఎన్‌విడియా, ఇంటెల్‌, అడోబ్ వంటి గ్లోబల్ సంస్థల భాగస్వామ్యంతో “తెలంగాణ ఎఐ మిషన్” (టి- ఎ ఐ ఎం) విజయవంతంగా అమలవుతోంది. కానీ గతంలో కేంద్రం ప్రకటించిన మూడు ఏఐ కేంద్రాల స్థాపనలో తెలంగాణను పూర్తిగా విస్మరించింది.

సామాన్యుల బడ్జెట్ కాదు!

కేంద్రానికి, ప‌న్నుల రూపంలో తెలంగాణ రూపాయి ఇస్తే..తెలంగాణ‌కు నిధుల రూపంలో తిరిగి వ‌స్తుంది 42 పైస‌లే. తెలంగాణ‌కు చెందిన 48 పైస‌ల‌ను త‌న ఖాతాలో వేసుకుంటున్న కేంద్రం.. తెలంగాణ డిమాండ్లను మాత్రం బుట్టదాఖ‌లు చేస్తోంది. తెలంగాణ‌కు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తుంది. కేంద్రం నుంచి తెలంగాణ‌కు కొత్త ప్రాజెక్టులు లేవు.. అద‌న‌పు ప్రయోజ‌నాలు లేవు. బీజేపీకి తెలంగాణ ఓట్లు కావాలి. కానీ తెలంగాణ అభివృద్ది మాత్రం బీజేపీకి ప‌ట్టదు. ఎన్నిక‌ల బ‌డ్జెట్...సామాన్యుల క‌ల‌ల‌ను వంచించిన బ‌డ్జెట్. రైతులకు పంట పెట్టుబ‌డి స‌హాయం కోసం కిసాన్ స‌మ్మాన్ యోజ‌న మొత్తాన్ని పెంచుతామ‌ని ప్రక‌టించి బ‌డ్జెట్‌లో మాత్రం పెంపు ప్రతిపాద‌న లేదు. 60 ఏండ్లు దాటిన రైతుల‌కు నెల‌వారి పింఛన్లు అందిస్తామ‌ని 6 ఏండ్ల కింద హ‌మీ ఇచ్చిన కేంద్రం.. ఈ బ‌డ్జెట్‌లో కూడా వాటి ప్రస్తావ‌న చేయ‌లేదు. వ్యవ‌సాయ రంగానికి గ‌త ఏడాదితో పోలిస్తే నాలుగు వేల కోట్లు త‌గ్గించారు. పంటల బీమా ప‌థ‌కాన్ని పాడెనెక్కించేలా నాలుగు వేల కోట్లు త‌గ్గించారు. యూరియా స‌బ్సిడీలో వేయి కోట్లు కోత విధించారు. అందుకే ఇది సామాన్యుల బ‌డ్జెట్ కాదు.. సంప‌న్నుల బ‌డ్జెట్!

డా. కృష్ణ సామల్ల

97058 90045

Next Story