25 ఏళ్ల సర్వీస్ తర్వాత ఇప్పుడు టెట్ నిబంధన.. న్యాయమా?

by Ravi |   (  Updated:2025-09-27 01:01:16  IST  )

25 ఏళ్ల సర్వీస్ తర్వాత ఇప్పుడు టెట్ నిబంధన.. న్యాయమా?
X

‘వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్లు ఉంది ఉపాధ్యాయుల పరిస్థితి. టెట్ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఉపాధ్యాయులుగా నియమించబడ్డ వారు ప్రస్తుతం సర్వీస్ కొనసాగించాలన్నా, పదోన్నతి పొందా‌లన్నా టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిందేనని ఇటీవల తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఉపాధ్యాయు‌లలో ఆందోళన నెలకొని ఉంది. ఎప్పుడో 20, 25 సంవత్సరాల క్రితం పాఠశాల ఉపాధ్యాయులుగా నియమించబడ్డ వారు ఈ వయస్సులో టెట్ రాసి ఉత్తీర్ణత సాధించడం సాధ్యమౌతుందా?

రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2012 డీఎస్సీ, 2017 టీఆర్టీ, 2024 టీఆర్టీ ద్వారా నియామకమైన సుమారు 30వేల మంది ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ అర్హత ఉంది. ఇప్పటికే సుమారు 20 వేల మంది ఉపాధ్యాయులు టెట్ పాసై ఉండవచ్చు. మొత్తంగా 50 వేల మంది ఉపాధ్యాయులు మాత్రమే టెట్‌లో అర్హత కలిగి ఉన్నారు. సుమారు 70 వేల మంది ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాయలేదు. ఇప్పుడు సుప్రీం తీర్పుతో పదోన్నతులకు టెట్ కచ్చితంగా పాస్ కావాలనే షరతు, అదీ రెండు సంవత్స‌రాల్లో పాస్ కావాలన్న నిర్ణయం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రమౌతుంది. దానివల్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు నష్టపోతారు.

ఇతర సబ్జెక్టులను ఎలా రాయగలరు?

ప్రధానోపాధ్యాయుల, ఇతర శాఖలలో పదో న్నతుల కోసం జీ‌ఓ‌టి, ఈ‌ఓ‌టి లాంటి శాఖాపరమైన పరీక్షలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. అదే మాదిరి విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చినప్పటి (2010) నుంచే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ పదోన్నతులకు కూడా టెట్ తప్పనిసరి చేస్తూ అమలు చేసి ఉంటే ప్రారంభంలోనే ఉపాధ్యాయులు దానిపై దృష్టి పెట్టి పరీక్షలు రాసి పాస్ అయ్యి ఉండేవారు. కానీ 2012, 2017, 2024 ఉపాధ్యాయ నియామకాల్లో ఈ నిబంధనలు అమలు చేసిన విద్యాశాఖ పదోన్నతిలో ఎందుకు అమలు చేయలేదు? ప్రస్తుతం పేపర్- 2 అభ్యర్థులు రాస్తున్న టెట్‌లో ఉపాధ్యాయులు అర్హత సాధించడం కొంత కష్టం. ఎందుకంటే ఉపాధ్యాయులు పదోన్నతి పొందే సబ్జెక్టులో తప్పనిసరిగా డిగ్రీ లేదా తత్సంబంధ అర్హత సాధించి ఉంటారు. టెట్‌లో ఆ సబ్జెక్టులో ఎంత కఠినమైన ప్రశ్నలు అడిగిన సమాధానాలు రాయగలరు. కాబట్టి సులభంగానే టెట్ పాస్ కాగలరు.. కానీ పేపర్‌-2‌లో అడుగుతున్న ప్రశ్నలు విచిత్రంగా ఉన్నాయి. సాంఘిక శాస్త్ర పదోన్నతి కోసం అర్హత ఉన్న ఉపాధ్యాయులకు తెలుగు పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. జీవశాస్త్ర పదోన్నతి కోసం అర్హత ఉన్న ఉపాధ్యాయులకు గణిత సంబంధ ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. గణిత శాస్త్ర పదోన్నతి కోసం అర్హత ఉన్న ఉపాధ్యాయుడు జీవశాస్త్ర సంబంధ ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. 20, 25 సంవత్సరాల సర్వీస్ ఉన్న సీనియర్ ఉపాధ్యాయులు ఇప్పుడు తమ సబ్జెక్ట్ కాకుండా ఇతర సబ్జెక్టను ఎలా ప్రిపేర్ కాగలరు?

పరిష్కారం ఏమిటి?

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తీర్పును పునర్ సమీక్షించమని సెప్టెంబర్ 30లోపు రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయాలి. విద్యాహక్కు చట్టం-2009 సెక్షన్ 23 (2) ప్రకారం టెట్‌కు తాత్కాలిక మినహాయింపు ఇవ్వవచ్చు. కాబట్టి 2010 ఆగస్టు 23 కంటే ముందు నియామకమైన ఇన్స్ సర్వీస్ టీచర్లకు సర్వీస్‌లో కొనసాగడానికి, ప్రమోషన్ పొందడానికి టెట్ నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చే విధంగా చట్ట సవరణ చేయాలి. అది సాధ్యం కాకపోతే 44 సంవత్సరాలు దాటిన వారికి టెట్ రాసే అర్హత లేదు, కాబట్టి సుమారు 20,25 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులకు వారి బోధన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఉపాధ్యాయులకు ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగడానికి, 50 సంవత్సరాలు దాటిన వారికి పదోన్నతి పొందడానికి టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలి. లేదా ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతూ టెట్ పాస్ కావడానికి ఐదు సంవత్సరాలు, పదోన్నతి తర్వాత టెట్ పాస్ కావడానికి మూడు సంవత్సరాల సమయాన్ని ఇవ్వాలి. టెట్ అర్హత లేకుండా సర్వీస్‌లో కొనసాగించడం, పదోన్నతి ఇవ్వడం కుదరకపోతే ఆ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి. అదీ కుదరకపోతే సాధారణంగా నిర్వహించే టెట్‌లా కాకుండా వారి బోధన అనుభవాన్ని, బోధన మెలకువలను పరీక్షించే విధంగా సులభతరంగా ఉండేటట్లు ప్రత్యేక టెట్ నిర్వహించాలి. ఇంకా అవసరమైతే జీఓ‌‌టి, ఈ‌ఓ‌టి మాదిరి చూసి రాసే పద్ధతిలో టెట్ నిర్వహించాలి. దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

-జుర్రు నారాయణ యాదవ్,

తెలంగాణ టీచర్స్ యూనియన్,

94940 19270

Next Story