పెరుగుతున్న టెక్నాలజీ, కరుగుతున్న ఉద్యోగాలు.. సమతుల్యం సాధ్యం కాదా?

by Ravi |   (  Updated:2025-11-17 01:15:57  IST  )

పాలకులు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు ప్రయత్నించడం మంచిదే కానీ ఉపయోగించే సాంకేతికతో దేశంలో ఏర్పడే సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మంచిది.

పెరుగుతున్న టెక్నాలజీ, కరుగుతున్న ఉద్యోగాలు.. సమతుల్యం సాధ్యం కాదా?
X

పాలకులు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు ప్రయత్నించడం మంచిదే కానీ ఉపయోగించే సాంకేతికతో దేశంలో ఏర్పడే సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మంచిది. నేడు ఏఐ అనే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో యువత నిరుద్యోగంలోకి పోయి దేశంలో అశాంతి ఏర్పడే పరిస్థితులు రాకూడదు.

ప్రస్తుతం ప్రభుత్వాల దృష్టి అంతా భారీ స్థాయి మెగా ఇండస్ట్రీస్ వైపుకే పోతోంది. పెద్ద పరిశ్రమలకు, అంతర్జాతీయ సంస్థలకు ఒకదాని తర్వాత ఒకటి ప్రోత్సాహకాలు సబ్సిడీలు, భూములు టారిఫ్ రాయితీలు లభిస్తున్నాయి. కానీ సాఫ్ట్‌వేర్ కంపెనీలు లక్షల మంది ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. దీనికి కారణం ఏఐ అనే నూతన సాంకేతిక పరిజ్ఞానం. దీనివల్ల దేశంలో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. మానవ మనుగడే భారంగా మారింది.

ఉపాధి కల్పనకు ఆమడదూరంలో..

పెట్టుబడిదారీ వ్యవస్థ ఉద్యోగ కల్పనలో ఎంత నిబద్ధత కలిగి ఉన్నదో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ప్రవేశపెట్టడమే తెలియజేస్తోంది. టెక్నాలజీ అనేది మనిషి శ్రమను తగ్గించడానికి దోహదం చేయాలి. కానీ మనిషికి జీవనాధార అవకాశాలను దూరం చేయడానికి దారి తీయకూడదు. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థలో అదే జరుగుతోంది. కొత్త టెక్నాలజీని పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రవేశపెట్టినప్పుడు కార్మికుల ఉపాధి అవకాశాలు తగ్గి నిరుద్యోగానికి దారితీస్తుంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో ఆదాయ అసమానతలు పెరగడం, ఇది కొంతమం ది పెట్టుబడిదారుల చేతుల్లోకి పోవడం అశేష ప్రజానీకం వినియోగ స్థాయి పడిపోవడం డిమాండ్ తగ్గిపోవడం ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి దిగజారిపోతుంది.

లక్షలాది ఉద్యోగాలు హరీ..

ఇటీవల కృత్రిమ మేధ వినియోగం వలన 14 వేల ఉద్యో గాలు పోతున్నాయని అమెజాన్ కంపెనీ తెలియజేసింది. ఇలా ఎప్పటికప్పుడు పెట్టుబడిదారులు ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టకుండా ఆదాయాలను పెంపొందించుకునే దిశగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నిరుద్యోగాన్ని పెంచుతున్నాయి. ఇప్పటికే అమెజాన్ నుంచి మైక్రోసాఫ్ట్ కంపెనీ వరకు ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య 80000 వరకు ఉంటుందని ఒక అంచనా. ఈ సంవత్సరమే 1.12 లక్షల ఉద్యోగస్తులను 218 కంపెనీలలో తొలగించడం జరిగింది. 2022లో 1.65 లక్షల మందిని 2023లో 2.64 లక్షలు 2024లో 1.53 లక్షల మందిని ప్రపంచవ్యాప్తంగా ఏఐ కారణంగా తొలగించడం జరిగింది.

విశాఖలో గూగుల్ ఏఐ హబ్!

రాబోయే ఐదేళ్లలో 2026-2030 సుమారు లక్ష 30 వేల కోట్లతో దేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌ని విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేస్తోంది. ఏఐ అభివృద్ధికి కేంద్రంగా పనిచేయడంతో పాటు విశాఖపట్నం ఒక ప్రధాన కనెక్టివిటీ హబ్‌గా మారబోతోందని మన పాలకులు అంటున్నారు. ఎందుకంటే గూగుల్ విశాఖ సముద్రం అడుగున కేబుల్ మౌలిక సదుపాయాలను అక్కడకు తీసుకువచ్చి వాటిని ప్రపంచవ్యాప్త నెట్వర్క్‌తో అనుసంధానం చేయబోతోంది. అంటే గూగుల్ ఏఐ టెక్నాలజీని తీసుకురావడమే కాకుండా సముద్ర కేబుల్ నెట్వర్క్ కనెక్టివిటీ హబ్ ద్వారా డిజిటల్ మౌలిక సదుపాయాలను కూడా నిర్మిస్తుంది. దీనితో ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు ప్రత్యక్ష సంబంధం ఏర్పడడమే కాకుండా దానితో వచ్చే హై స్పీడ్ ఇంటర్నెట్, ఇతర కంపెనీల డేటా సెంటర్లు విశాఖపట్నం రావడానికి అవకాశం ఏర్పడుతుంది. దీని ద్వారా రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ కంపెనీ శాఖల్లోని ఉద్యోగాల సంఖ్య 1,82,000 మాత్రమే.

ఏఐ, క్వాంటం పరుగుల పర్యవసానం!

రాబోయే రోజుల్లో ఏఐ కారణంగా మనదేశంలో 20 లక్షల సంప్రదాయ ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని, కానీ సరైన అనుకూల వాతావరణాన్ని ముందు నుంచే ఏర్పాటు చేయగలిగితే కొత్తగా 80 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చని కేంద్రం భావిస్తోంది. అందుకోసమే మూడో తరగతి నుంచి విద్యను ఏఐతో అనుసంధానం చేసే పనిలో దిగింది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంలో మన దేశం 25 దేశాల కన్నా తక్కువ స్థాయిలో ఉన్నదని PEW సర్వే తెలియజేసింది. 14% భారతీయులకు మాత్రమే ఈ పరిజ్ఞానం గురించి ఇంతో అంతో తెలుసు. ముఖ్యంగా 18-34 వయసు మధ్య ఉన్న వారిలో 19 శాతం మందికి మాత్రమే మన దేశంలో ఏఐ గురించి తెలుసు. ఏఐ పరిజ్ఞానం లేని మనదేశంలో ప్రస్తుతం ఏఐ ప్రవేశపెట్టడం ద్వారా నిరుద్యోగం ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది మన పాలకులు ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ యుగం కోసం పరుగులు తీయాలని తాపత్రయపడుతున్నారు.

నిరుద్యోగుల పెంపుదలే ప్రాతిపదికగా..

నేటి ఆర్థిక విధానాలన్నీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో జరిగి ఉత్పత్తులు గణనీయంగా పెరిగినప్పటికీ మానవ శ్రేయస్సు పెంపొందించలేకపోవడం శోచనీయం. అందుకే ఆనాడు గాంధీజీ, భారీ ఉత్పత్తులు కాదు ముఖ్యం.. భారీ సంఖ్యలో ప్రజలు ఉత్పత్తిలో పాల్గొనాలి. తద్వారా ఉపాధి ఆదాయం ఉండి ప్రజలు సౌభాగ్యంతో ఉంటారు. పెట్టుబడిదారీ విధానం చిన్న చిన్న ఉత్పత్తిదారులను నిర్వీర్యం చేసి నిరుద్యోగం పెరిగేటట్టుగా చేస్తుందని, స్వాతంత్రోద్యమం కాలంలోనే అన్నారు. 1920లో బ్రిటిష్ పెట్టుబడిదారులను వ్యతిరేకించిన భారతీయ పెట్టుబడిదారులు తర్వాత వారితో లాలూచీ పడ్డారు. అందుకే స్వదేశీ విదేశీ ఫైనాన్స్ పెట్టుబడిదారుల చారిత్రక నేపథ్యం తెలుసుకోకుండా, వారి స్వలాభాపేక్ష విధానాన్ని అర్థం చేసుకోకుండా మన ఆర్థిక వ్యవస్థను పెట్టుబడిదారులకు అప్పగించడం ఎంతవరకు సమంజసమో పాలకులు ఆలోచించాలి. తాము ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ప్రజల కోసమా, పెట్టుబడిదారుల కోసమా అనే ప్రశ్న వేసుకోవాలి. రోజురోజుకు ప్రస్తుత పాలకులు గాంధీజీ ఆర్థిక విధానాలకు ఎంత దూరం అవుతున్నారో గమనించాలి.

-డాక్టర్ ఎ. నాగరాజ నాయుడు

డిగ్రీ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్

98663 22172

Next Story