- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదివాసులకు వరం ఆది కర్మయోగి
ఆది కర్మయోగి కార్యక్రమం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ ఉద్యమం. ఇది గిరిజన ప్రాంతాల్లో పాలనను మెరుగుపరచడానికి

ఆది కర్మయోగి కార్యక్రమం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ ఉద్యమం. ఇది గిరిజన ప్రాంతాల్లో పాలనను మెరుగుపరచడానికి, గిరిజనులకు సాధికారతనివ్వడానికి ఉద్దేశించబడింది. ఈ కార్యక్రమంలో గిరిజనులకు శిక్షణ ఇచ్చి వారిని మార్పుకు మార్గదర్శకులుగా తీర్చిదిద్దుతారు. వీరు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో సంఘాలను సమీకరించడంలో, యంత్రాంగం తో సమన్వయం చేయటంలో సహాయపడతారు.
అవగాహనా లేమితో వెనుకబాటు..
దీన్ని కేంద్ర పథకమైన 'ధార్తి ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్'తో అనుసంధానం చేస్తూ గిరిజనాభివృద్ధికి తోడ్పడాలని సంకల్పించారు. ప్రభుత్వ అధికారులు గిరిజనులకు ప్రభుత్వ పథకాలు పాలన పట్ల అవగాహన కల్పించడంతో పాటు సామర్ధ్య పెంపు శిక్షణ అందిస్తారు. ‘వాస్తవానికి దేశవ్యాప్తంగా గిరిజనులు వెనుకబాటుతనానికి కారణం పథకాలు లేకపోవడం కాదు, అమలు చేసే వారిలో ప్రేరణ లేకపోవడం’. అవగాహన లేకపోవడం వలన ఆదివాసీ గిరిజనులు నేటికీ అభివృద్ధి అంచుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. గిరిజనేతర దళారుల కబంధ హస్తాల కింద నలిగిపోతున్నారు, అమాయక ఆదివాసీలు మోసపోతున్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అనాగరికులుగా మిగిలిపోతున్నారు.
లక్ష గిరిజన గ్రామాల్లో..
అటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పరిస్థితులు, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సేవలు మొదలైన పథకాలు అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాటు అయినదే ఆది కర్మయోగి కార్యక్రమం. దేశవ్యాప్తంగా గిరిజన సంక్షేమ రంగంలో పనిచేస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులను ప్రోత్సహించి ఒక లక్ష గిరిజన గ్రామాల్లో ఆది కర్మయోగి అభియాన్‌ను గిరిజన నాయకుల చొరవతో ప్రారంభించింది. ఒక లక్ష గిరిజన ఆధిపత్య గ్రామాలలో 20 లక్షలకు పైగా మార్పు నాయకులను సమీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2047 నాటికి వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా ప్రజా కేంద్రీకృత, సమగ్ర అభివృద్ధి నమూనాకు పునాదిని ఏర్పరుస్తుంది.
భవిష్యత్తు సృష్టికర్తలుగా ఆదివాసీలు..
ఈ కార్యక్రమం గిరిజన సాధికారికత కోసం నిర్మాణాత్మక చట్టాన్ని నిర్మించడంపై దృష్టి పెడుతుంది. లక్ష్యాలు పెట్టుబడులు, స్థానిక వ్యూహాలను వివరించే ఒక లక్ష గిరిజన గ్రామాల్లో విజన్ 2030 కింద గిరిజన వర్గాలతో కలిసి అభివృద్ధి ప్రణాళికను రూపొందించడం. 550 జిల్లాలు 30 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో 20 లక్షల మంది గిరిజనులను మార్పును తీసుకురావటం గిరిజన సమాజాలు అభివృద్ధి పథకాల లబ్ధిదారులు మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తు సృష్టికర్తలు కూడా కావాలని ఉద్దేశం.
గిరిజన గ్రామ కార్యాచరణ పథకం
గిరిజన ప్రాబల్య గ్రామాలలో సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం రాష్ట్ర,జిల్లా బ్లాక్ మాస్టర్ ట్రైనర్లతో గవర్నెన్స్ ల్యాబ్ వర్క్ షాపులు, గిరిజన గ్రామ కార్యాచరణ ప్రణాళికతో విజన్- 2030 రోడ్ మ్యాపులు రూపొందించడం, కమ్యూనిటీ లీడర్ షిప్ & వాలంటరీ నెట్వర్క్ ద్వారా ఉపాధ్యాయులు, వైద్యులు, సమాజానికి మార్గ నిర్దేశం చేసే మార్గదర్శకులు వంటి నిపుణులు, స్వయం సహాయక సంఘాలు, గిరిజన పెద్దలు, యువ నాయకుల సంకల్పంతో స్థిరమైన పురోగతి పెంపొందించడానికి కృషి చేస్తారు. ఏదేమైనా ఆదివాసీ గిరిజన గ్రామాలు అభివృద్ధికి చేరువ కావాలంటే వాస్తవానికి నిజమైన సాధికారిక పథకాల ద్వారా మాత్రమే రాదని, హక్కులను గుర్తించడం ద్వారానే ఏర్పడుతుందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నొక్కి చెప్పారు.
-పెనుక ప్రభాకర్,
94942 83038






