- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మమ్మల్ని బీసీలలో చేర్చండి!
మన దేశంలోని ఒక పౌరుడు ఏ ప్రాంతంలోనైనా నివసించవచ్చు. అయితే స్థిరపడిన కాలాన్ని బట్టి ఆయా రాష్ట్రాల్లో లోకల్‌గా

మన దేశంలోని ఒక పౌరుడు ఏ ప్రాంతంలోనైనా నివసించవచ్చు. అయితే స్థిరపడిన కాలాన్ని బట్టి ఆయా రాష్ట్రాల్లో లోకల్‌గా పరిగణింపబడతారు. అయితే 1956 నుండి ఉమ్మడి రాష్ట్రంలో విద్యా, వ్యాపారం, ఉపాధి కోసం తెలంగాణకు వలస వచ్చి ఇక్కడే స్థిరపడి జీవనం కొనసాగిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. అయితే వీరిలో 26+1 కులాలను రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం బీసీ జాబితా నుండి తొలగించి అన్యాయం చేసింది.
50 ఏళ్లుగా రాష్ట్రంలో ఉన్నప్పటికీ..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ (వెనుకబడిన తరగతులు) కులాల జాబితా నుండి తొలగించిన 26+1 కులాల సమస్య గత 11 సంవత్సరాలుగా తెలంగాణ బీసీలకు కంట్లో నలుసుగా మారి బీసీల సమైక్యతకు గుదిబండగా తయా రైంది. తొలగించిన 26 కులాలు ఏపీలో మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో లేవని, వీరికి తెలంగాణతో ఏ సంబంధం లేదని, 1968లో అనంతరామన్ కమిషన్ ఆ విధంగా చెప్పిం దంటూ.. ఎటువంటి సర్వే గానీ విచారణ గానీ లేకుండా తొలగించడం సరికాదు. 50 ఏళ్లుగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడి జీవనం సాగిస్తున్న వారిని రాష్ట్ర విభజన తర్వాత బీసీలలో చేర్చబోమంటే ఎలా? తెలంగాణ రాష్ట్రానికి యూపీ, బిహార్ నుంచి వచ్చిన 17 కులాలను బీసీ జాబితాలో చేర్చడం హర్షనీయం. కానీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుండి వలస వచ్చిన వారిని తొలగించడం అంటే బీసీ ప్రజల మధ్య నిప్పు రాజేయడమే.
సమగ్ర విచారణ చేయకుండా..
బీసీ కమిషన్ యాక్టు 1993 ప్రకారం, ఇంద్రా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ ఒక్క బీసీ కులాన్ని తొలగించాలన్నా, కలపాలన్నా సమగ్ర విచారణ, సర్వే చేయాలి. అలా కాకుండా రాష్ట్ర సచివాలయం నుండి ప్రిన్సిపల్ సెక్రెటరీ 26+1 కులాలను తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గం. తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పెరిగిన వారికి రిజర్వేషన్లు తీసేయడం భావ్యం కాదు. గత ప్రభుత్వంలో తొలగించిన 26+1 కులాలను బీసీ జాబితాలో కలపడం కోసం బీసీ సంక్షేమ సంఘం గత 11 ఏళ్లుగా ఎంతో కృషి చేస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ ఆనాడు ఈ కులాలను బీసీ జాబితాలోంచి తొలగించారు. తెలంగాణాలో మర మగ్గాలు మూలన పడ్డప్పుడు తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లిన మన పద్మశాలి బిడ్డలు అనేక రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. అక్కడే కాదు వివిధ ప్రాంతాల్లో బీసీ రిజర్వేషన్లను ఆ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అనుభవిస్తున్నారు. ఇక సోలాపూర్‌లో మన తెలుగు పద్మశాలి బిడ్డ ఎంపీగా ఉండడం మనం గమనించవచ్చు.
బీసీ కమిషన్‌కు తెలియజేయండి!
రిజర్వేషన్లకు అర్హులైన వారందరినీ కూడా ప్రాంతీయ భేదంతో వారి అవకాశాల్ని హక్కుల్ని హరించడం రాజ్యాంగ విరోధం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ కులాన్ని అది తెలంగాణ ప్రాంతీయ కులమైన సరే వారిని బీసీ జాబితా నుంచి అక్కడ తొలగించడం జరగలేదు. వారందరూ వారి వారి హక్కులను ఆంధ్రప్రదేశ్‌లో అనుభ విస్తున్నారు. కానీ తెలంగాణలోనే ఈ పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు, తెలంగాణ బీసీ కమిషన్ తొలగించిన 26 కులాలను బీసీ జాబితాలో కలపాలా? వద్ద విషయంపై బహిరంగ విచారణ చేస్తున్నది. బీసీ సమస్యల కోసం అహర్నిశలు పోరాడుతూ బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్తున్న ప్రతి బీసీ సంఘాల నాయకులు ఈ విషయంపై తమ అభిప్రాయాలను బీసీ కమిషన్‌కు తెలియజేయాలి.
ఆళ్ల రామకృష్ణ
99669 44244






