- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెట్టుబడిదారీ విధానంతో ప్రజా శ్రేయస్సా?
ఆడమ్ స్మిత్ కేవలం మార్కెట్ ఆర్థిక వ్యవస్థను మాత్రమే సమర్థించలేదు, మానవ శ్రేయస్సు, సానుభూతి, నైతిక విలువలే సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు నిజమైన పునాదులు..

నాగరికతను నిలబెట్టేది మార్కెట్లు కావు, చట్టాలు కావు, భౌతిక సంపద అంతకంటే కాదు. ఒక మనిషి మరొక మనిషి బాధను తన బాధగా భావించే సామర్థ్యం మాత్రమే సమాజాన్ని కాపాడుతుంది. ఆ సామర్థ్యం ఉన్నంతకాలం మానవత్వం జీవిస్తుంది. అది క్షీణించిన రోజు ఎంత సంపన్నమైన పెట్టుబడిదారీ వ్యవస్థ అయినా లోపల నుంచి కూలిపోవడం ప్రారంభమవుతుందనీ అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ తెలియజేసినారు.
అంటే ఆడమ్ స్మిత్ మనకు చెప్పిన అత్యంత విలువైన పాఠం మార్కెట్ ఎకానమీ కాదు.. ప్రజా శ్రేయస్సు.. తన 'ఆన్ ఎంక్వయిరీ ఇన్ టూ నేచర్ అఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్' అనే గ్రంథాన్ని రాసేటప్పుడు (1776) పెట్టుబడి, మార్కెట్లు, లాభాల ద్వారా దేశాలు అభివృద్ధి చెందుతాయని నమ్ము కోవడం నిజమే కానీ ఆ తర్వాత రాసిన గ్రంథంలో 'ద థియరీ ఆఫ్ మోరల్ సెంటిమెంట్స్' ద్వారా సాటి మనిషి బాధను అర్థం చేసుకోకపోతే ఏ మార్కెట్ అయినా కుప్పకూలిపో తుందని ఆనాడే హెచ్చరించాడు.
లాభం కాదు.. మానవ శ్రేయస్సు ముఖ్యం
డబ్బు ప్రపంచాన్ని నడిపిస్తుందని మనం అనుకుంటాం. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థకు మేధోపరమైన పునాది వేసిన ఆడమ్ స్మిత్ మాత్రం మానవ శ్రేయస్సును నమ్మాడు. సాటి మనిషి బాధను అర్థం చేసుకునే సామర్థ్యం లేకపోతే ఏ మార్కెట్ అయినా చివరికి కూలిపోతుందని ఆడమ్ స్మిత్ నమ్మాడు. పెట్టుబడిదారీ వ్యవస్థకు పునాది వేసిన వ్యక్తి మార్కెట్ విధానాన్ని చివరి రోజుల్లో వ్యతిరేకించారు. మానవ నాగరికత ప్రయాణాన్ని అసలు ముందుకు నడిపించింది ఏమిటి? సంపదా? పోటీనా? లేక ఒకరి బాధను మరొకరు అర్థం చేసుకునే మానసిక సామర్థ్యమా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో మనం తరచుగా ఆర్థిక సూత్రాల వైపు చూస్తుంటాం. ఆడమ్ స్మిత్ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది మార్కెట్, లాభాలు, పోటీ, స్వప్రయోజనం. ఈ పరుగు పందెంలో మనం ఆయనను ఒక క్రూరమైన పెట్టు బడిదారీ విధానానికి చిహ్నంగా మార్చేశాం. లాభాల వేటను మాత్రమే ఆయన బోధించారని తప్పుగా నమ్మాం.
ఆధునిక అర్థశాస్త్రానికి పునాది గ్రంథం!
1776లో ఆడమ్ స్మిత్ 'యాన్ ఎంక్వైరీ ఇన్‌టు ది నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ ది వెల్త్ ఆఫ్ నేషన్స్' అనే గ్రంథాన్ని ప్రచురించారు. ఆధునిక అర్థశాస్త్రానికి అది పునాదిగా మారింది. వ్యక్తిగత ప్రయోజనం కోసం పనిచేసే వ్యక్తులు తమకు తెలియకుండానే సామాజిక ప్రయోజనానికి ఎలా దోహదపడతారో ఆయన వివరించారు. దీనినే తర్వాత ప్రపంచం 'ఇన్విజిబుల్ హ్యాండ్' లేదా అదృశ్య హస్తం అనే భావనగా స్వీకరించింది. ఈ సిద్ధాంతం పెట్టుబడిదారీ వ్యవస్థకు మేధోపరమైన బలాన్ని ఇచ్చింది. స్మిత్ మరో అద్భుతమైన గ్రంథాన్ని రాశారు. అదే 'ది థియరీ ఆఫ్ మోరల్ సెంటిమెంట్స్'. మోరల్ సెంటిమెంట్స్ పుస్తకాన్ని మాత్రమే మళ్లీ మళ్లీ తిరగేస్తూ, కొత్త విషయాలు చేరుస్తూ, విస్తరిస్తూ గడిపారు. చనిపోయే చివరి రోజు వరకు ఆయన ఈ పనిచేస్తూనే ఉన్నారు. నేడు ఆయనను అభిమానించే వారిలో చాలామంది ఈ పుస్తకాన్ని చదవకపోవడం ఒక చారిత్రక విషాదం.
సానుభూతే సామాజిక జీవన మూలాధారం..
నిజానికి స్మిత్ ఆలోచనల అసలు హృదయం ఈ రచనలోనే దాగి ఉంది అనేది సత్యం. ఈ పుస్తకంలో స్మిత్ ఒక మౌలికమైన ప్రశ్న అడిగారు. మనిషి ఎందుకు ఇతరుల బాధను చూసి కదిలిపోతాడు? ఒక అపరిచితుడి కన్నీరు మనలో ఎందుకు స్పందన కలిగిస్తుంది? మనం న్యాయం కోసం ఎందుకు పోరాడతాం? ఆయన ఇచ్చిన సమాధానం చాలా సులభమైనది, అదే సమయంలో విప్లవాత్మకమైనది. మనిషిలో సహజంగా ఉన్న సానుభూతే సామాజిక జీవనానికి అసలైన మూలాధారం. ఇది ఒట్టి భావోద్వేగపు వాదన మాత్రమే కాదు. ఆధునిక మనస్తత్వ శాస్త్రం, నర శాస్త్రం (Neuroscience) కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. మానవ మెదడులో ఉండే 'మిర్రర్ న్యూరాన్లు' ఇతరుల అనుభవాలను పరోక్షంగా అనుభూతి చెందే సామర్థ్యాన్ని మనకు కల్పిస్తాయని పరిశోధనలు సూచి స్తున్నాయి. ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు చూసిన క్షణంలో మన మెదడులోని నాడీ స్పందనలు కూడా చురుకవుతాయి. అంటే సానుభూతి అనేది ఒక సామాజిక అలవాటు మాత్రమే కాదు, అది మన జీవపరమైన లక్షణం. స్మిత్ ఈ సత్యాన్ని రెండు శతాబ్దాల ముందే తాత్వికంగా గుర్తించారు.
అనియంత్రిత దురాశ వినాశకరం..
స్మిత్ స్వార్థాన్ని ఘనపరిచాడు అని చాలామంది అను కుంటారు. వాస్తవానికి ఆయన స్వ ప్రయోజనాన్ని అర్థం చేసుకున్నారు, అంతేకానీ అనియంత్రిత దురాశను ఎప్పుడూ సమర్ధించలేదు. స్వప్రయోజనం ఉత్పాదకతను పెంచగలదు, కొత్త ఆవిష్కరణలకు దారి తీయగలదు, సంపదను సృష్టిం చగలదు. అయితే దానికి నైతిక నియంత్రణ లేకపోతే అదే శక్తి దోపిడీగా మారుతుంది. నమ్మకాన్ని నాశనం చేస్తుంది. ఈ నైతిక సత్యాన్ని నేటి ప్రవర్తనా అర్థశాస్త్రం (Behavioral Economics) కూడా బలంగా సమర్థిస్తోంది. ఆర్థిక నిర్ణయాలు పూర్తిగా హేతుబద్ధంగా ఉండవని అనేక అధ్య యనాలు చూపించాయి.
కనిపించని మూలధనం - కార్మికుడి గౌరవం
మనుషులు విశ్వాసం, న్యాయం, పరస్పర గౌరవం వంటి నైతిక అంశాల ఆధారంగానే ఆర్థిక నిర్ణయాలు తీసు కుంటారు. స్మిత్ దృష్టిలో మార్కెట్అ నేది నైతికతకు ప్రత్యామ్నాయం కాదు, నైతికతపై నిర్మించబడిన ఒక వ్యవస్థ. స్మిత్ కార్మికుడి గౌరవం గురించి మాట్లాడారు. సంపద పెరుగుతున్న కొద్దీ కార్మికుల జీవన ప్రమాణాలు, వేతనాలు మెరుగుపడకపోతే ఆ ఆర్థిక వ్యవస్థను విజయవంతమైనదిగా పరిగణించలేమని ఆయన స్పష్టం చేశారు. సమాజ శ్రేయస్సు లేని ఆర్థిక వృద్ధి ఎప్పటికీ అసంపూర్ణమే. నిరుద్యోగంతో ఆదాయ అసమానతలతో కూడుకున్న ఆర్థిక వృద్ధి కొనసా గలేదు. మానవత్వాన్ని విస్మరించిన ఆర్థిక వృద్ధి సమాజానికి శాపంగా మారుతుంది.
-డాక్టర్ ఎ. నాగరాజ నాయుడు
రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్
98663 22172






