కార్యకర్తా.. కదలి రా!

by Ravi |   (  Updated:2025-05-27 00:31:08  IST  )

రాయలసీమ జిల్లాల నడిబొడ్డున కడప వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మంగళవారం

కార్యకర్తా.. కదలి రా!
X

రాయలసీమ జిల్లాల నడిబొడ్డున కడప వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమం.. కార్యకర్తలకు పెద్దపీట వేయడంతో పాటు పలు చరిత్రాత్మక నిర్ణయాలకు వేదికగా నిలవనుంది. పార్టీ ప్రతినిధుల సభ, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, మంత్రి లోకేశ్‌ ప్రతిపాదించిన 6 సూత్రాల ఆవిష్కరణ, పార్టీ నియామవళిలో సవరణలపై ప్రధాన చర్చ జరగనుంది.

పేరు పెట్టింది పెద్దాయనే..

మహానాడు అనే పదం.. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో మినహా.. మరెక్కడా కనిపించదు. మహానాడు అనే పేరు పెట్టింది సీనియర్ ఎన్టీఆర్. టీడీపీ నాయకత్వం నుంచి కార్యకర్తల వరకు అందరూ కూడా మహానాడుకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. పార్టీ కార్యక‌ర్తల నుంచి అధ్యక్షుడి వ‌ర‌కు అంతా క‌ల‌సి తీర్మానాలు ఆమోదించుకోవ‌టం పార్టీ ఆరంభం నుంచి వస్తున్నదే. ఈ తీర్మానాల ద్వారా రాజకీయ వ్యూహాలు, కార్యచరణ అమలు ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ పరంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే కార్యక్రమం వంటివి ఉంటాయి. అందుకే పార్టీ నాయకత్వమైతే ఈ మహానాడును ఘనంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తుంది.. పార్టీ అధ్యక్షుల్ని కూడా ఇక్కడే ఎన్నుకుంటారు. భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తారు.

కార్యక్రమం జరిగేది ఇలా..

మంగళవారం ఉదయం 8.30 గంటలకు ప్రతి నిధుల నమోదుతో పసుపు పండగ ప్రారంభమవుతుంది. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్‌, రక్తదాన శిబిరాలు ప్రారంభించనున్నారు.. పార్టీ జెండాను ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేసి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. అనతరం ‘మా తెలుగు తల్లికి’ గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పార్టీ కోసం పనిచేసి మృతి చెందిన కార్యకర్తలు, నేతలకు సంతాపం తెలియ జేస్తారు. తర్వాత ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పిస్తారు. 11.30 గంటలకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వాగతోపన్యాసం చేస్తారు. 11.50 గంట లకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్ర బాబు ప్రారంభోపన్యాసం చేస్తారు.

కార్యకర్తే అధినేత

అనంతరం టీడీపీ మౌలిక సిద్ధాంతాలపై చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర సాధన, పార్టీ నిర్వహణ, మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ రూపొందించిన 6 సూత్రాల ఆవిష్కరణ, పార్టీ నియమావళిలో సవరణలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. మండల స్థాయిలో మూడు విడతలు ఒకే పదవి చేసిన వారిని అంతకన్నా పెద్ద పదవికి పంపాలన్న నిర్ణయంతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. భోజన విరామం తర్వాత ఆరు సూత్రాల్లో మొదటిదైన ‘కార్యకర్తే అధినేత’, రెండోదైన ‘యువగళం’లో అంశంపై చర్చ జరుగుతుంది. మై టీడీపీ యాప్‌తో పాటు కార్యకర్తల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా చర్చిస్తారు. ఈ కార్యక్రమానికి వంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మహానాడు తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి సామాన్య కార్యకర్త వరకు అందరికీ ఓ పండుగలాంటిది. రాజకీయ తీర్మానాలు చర్చలే కాకుండా కనువిందు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు నోరూరించే వంటకాలు మధుర జ్ఞాపకాల్ని పంచి కార్యకర్తలను ఉత్సాహపరుస్తాయి. కార్యసాధకులై ధ్యేయం దిశగా సాగమని స్పూర్తిని పంచుతాయి.

-వి. సుధాకర్

Next Story