- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మట్టివాసనకు దృశ్యరూపం ఇచ్చిన దార్శనికుడు..
పల్లె మట్టివాసనను, ప్రకృతి సౌందర్యాన్ని, మానవ సంబంధాల సహజత్వాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు భారతీరాజా జీవితం, సినీ ప్రస్థానం, ఆయన సృష్టించిన విప్లవాత్మక మార్పులు, చిరస్థాయి వారసత్వంపై ప్రత్యేక కథనం.

భారతీయ సినీ చరిత్రలో కొంతమంది దర్శకులు సినిమాలు మాత్రమే తీయరు.. ఒక సంస్కృతిని, ఒక జీవన విధానాన్ని, ఒక కాలాన్ని వెండితెరపై శాశ్వతంగా నిలిపివేస్తారు. అలాంటి అరుదైన దర్శకుల్లో భారతీరాజా అగ్రగణ్యుడు. ఆయన చిత్రాలను చూస్తే కథ కంటే ముందు మనకు కనిపించేది పల్లె మట్టి, పచ్చని పొలాలు, చెట్ల నీడలో పుట్టే ప్రేమ, మనుషుల మధ్య ఉండే సహజ మైన అనుబంధాలు. అందుకే భారతీరాజా సినిమాలు కేవలం వినోదం కాదు అవి గ్రామీణ భారతదేశ ఆత్మకు ప్రతిబింబాలు.
సహాయ దర్శకుడిగా మొదలై..
తేని జిల్లా అల్లి నగరం అనే చిన్న గ్రామంలో 1941 జూలై 17న జన్మించిన చిన్నసామి పెరియమాయ తేవర్, తర్వాత భారతీ రాజాగా భారతీయ చిత్రసీమలో చిరస్థాయిగా నిలిచి పోయారు. సినిమా రంగంలోకి రావడం ఆయనకు అంత సులభం కాలేదు. ఎన్నో కష్టాలు, నిరీక్షణలు, ప్రయత్నాల తర్వాత సహాయ దర్శకుడిగా అవకాశం సంపాదించి, పుట్టణ్ణ కనగల్, పి. పుల్లయ్య వంటి ప్రముఖుల వద్ద శిక్షణ పొందారు. ఆ అనుభవమే తర్వాత ఆయనను భారతీయ సినీ ప్రపంచంలో ఒక ప్రత్యేక పాఠశాలగా నిలబెట్టింది.
తమిళ సినిమా కొత్తపుంతలు..
1977లో విడుదలైన “16 వయతినిలే” చిత్రం తమిళ సినిమాను కొత్త దిశలో నడిపించింది. అప్పటివరకు స్టూడియో సెట్లకే పరిమితమైన సినిమాలను నిజమైన పల్లెల్లోకి తీసుకెళ్లి, అక్కడి జీవితాన్ని యథాతథంగా చూపించిన తొలి దర్శకుల్లో భారతీరాజా ఒకరు. మేకప్ ఆర్భాటం లేకుండా, ప్రకృతి మధ్యలో మనుషుల సహజ జీవనాన్ని చిత్రీకరించడం ద్వారా ఆయన ఒక విప్లవానికే శ్రీకారం చుట్టారు. తెలుగు ప్రేక్షకులకు కూడా భారతీరాజా సుపరిచితమే. “సీతాకోకచిలుక” చిత్రం ద్వారా ప్రేమను, భావోద్వేగాలను ఎంతో సున్నితంగా ఆవిష్కరించి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు. కులవివక్ష వంటి సామాజిక సమ స్య లపై “వేదం పుదిదు” వంటి చిత్రాల ద్వారా సమాజాన్ని ఆలోచింపజేశారు.
ప్రకృతికాంతను ప్రేమించినవాడు..
భారతీరాజా ప్రకృతి ప్రేమను ప్రస్తావించకుండా ఉండలేం. “నేను ప్రేమించిన అమ్మాయి ప్రతిసారీ పల్లెల్లోనే కనిపించేది. ఆమె ఎవరో కాదు, ప్రకృతికాంత” అని ఆయన చెప్పిన మాటలు ఆయన సినీ తత్వానికి అద్దం పడతాయి. ఆయన కెమెరా ఎప్పుడూ ప్రకృతిని వెతికింది. అందుకే ఆయన చిత్రాల్లో పచ్చని పొలాలు, గాలికి ఊగే చెట్లు, వర్షపు చినుకులు కూడా పాత్రల్లా కని పిస్తాయి. భారతీరాజా గొప్పతనం ఆయన పరిచయం చేసిన నటీనటుల్లోనూ కనిపిస్తుంది. ఎందరో నటీనటులకు ఆయన సినీ జీవితాన్ని అందించారు.
ఆయన వారసత్వం శిష్యుల్లోనూ...
దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగానూ భారతీరాజా తన ప్రత్యేకతను చాటుకున్నారు. “ఆయుధ ఎళుతు”, “పాండియనాడు”, “తిరుచిత్రంబలం”, “మహారాజా” వంటి చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. చివరి వరకు కళాకారుడిగా జీవిస్తూ, సినిమానే తన శ్వాసగా కొనసాగించారు. తర్వాతి తరానికి తన అనుభవాన్ని అందించాలనే సంకల్పంతో భారతీరాజా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సినిమాను స్థాపించి అనేకమంది యువ సినీ కళాకారులకు మార్గదర్శకుడిగా నిలిచారు. ఆయన వారసత్వం కేవలం సినిమాల్లోనే కాదు, ఆయన తీర్చిదిద్దిన శిష్యుల్లోనూ కొనసాగుతోంది.
ఆయన 'పల్లెబాట' అజరామరం
నేడు భారతీరాజా భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన చూపించిన పల్లె బాటలు, ఆయన కెమెరా బంధించిన మట్టివాసనలు, ఆయన కథల్లో పలికిన ప్రేమలు ఎప్పటికీ చెరగవు. ప్రతి గ్రామీణ కథలో, ప్రతి సహజమైన ప్రేమకథలో, ప్రతి మట్టివాసనతో కూడిన ఫ్రేమ్‌లో భారతీరాజా చిరస్థాయిగా జీవిస్తూనే ఉంటారు. సినిమా చరిత్రలో కొన్ని అధ్యాయాలు ముగిసినా, కొన్ని వ్యక్తులు చరిత్రగానే మారిపోతారు. భారతీరాజా అలాంటి చరిత్ర. ఆయన మరణంతో ఒక మహానుభావుడి జీవితం ముగిసినా, భారతీయ సినీ ప్రపంచంలో ఆయన వెలిగించిన దీపం ఎన్నటికీ ఆరిపోదు.
- శ్రీధర్ వాడవల్లి
99898 55445






