- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమా ఆలయం.. సుచిత్ర ఫిల్మ్ సొసైటీ
బెంగళూరు సుచిత్ర ఫిల్మ్ సొసైటీ ఐదు దశాబ్దాల ప్రస్థానం, భారత ఫిల్మ్ సొసైటీ ఉద్యమ చరిత్ర, సినీ అవగాహన సంస్కృతిని ఆవిష్కరించిన ‘ది సినిమా టెంపుల్’ డాక్యుమెంటరీపై సమగ్ర సమీక్ష.

వాస్తవిక, కళాత్మక, అర్థవంతమైన సినిమాలను వీక్షించే ప్రేక్షకులను తయారు చేయడం, మంచి సినిమా సంస్కృతిని వ్యాప్తి చేయడం లక్ష్యాలుగా దేశవ్యాప్తంగా ఆ రోజుల్లో ఫిలిం సొసైటీలు ఏర్పడ్డాయి. అలా భారతదేశంలో సినీ సంస్కృతీ వికాసానికి విశేషంగా దోహదపడిన ఫిల్మ్ సొసైటీలలో బెంగళూరు సుచిత్ర ఫిల్మ్ సొసైటీ (SFS) ప్రముఖమైంది. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆ సంస్థ ప్రస్థానాన్ని, దేశ ఫిల్మ్ సొసైటీ ఉద్యమ చరిత్రను, సినీ అవగాహన సంస్కృతిని ఒకేసారి ఆవిష్కరించే ప్రయత్నమే “ది సినిమా టెంపుల్” (The Cinema Temple) డాక్యుమెంటరీ.
దీని దర్శకుడు హెచ్.ఎన్. నరహరి రావు.. ఆయన కేవలం ఈ డాక్యుమెంటరీ దర్శకుడు మాత్రమే కాదు, భారతీయ సినీ సంస్కృతి ఉద్యమంలో జీవితాంతం అంకితభావంతో పని చేసిన అరుదైన వ్యక్తి. నిజానికి ఒక మంచి సినిమా చూడాలంటే కేవలం టికెట్ కొంటె సరిపోదు. ఆ సినిమాను అర్థం చేసుకునే మనసు, దృక్కోణం కావాలి. ఆ మనసును తీర్చిదిద్దే గురువులు కావాలి. సినిమా తెరపై కనిపించే వెలుగుల వెనుక దాగి ఉన్న జీవితం, సమాజం, రాజ కీయాలు, తత్వం, కళలను గుర్తించే చూపు కావాలి. ఆ చూపును పెంచిన ఉద్యమమే ఫిల్మ్ సొసైటీ ఉద్యమం. భారతదేశంలో ఆ ఉద్యమానికి ఒక చిరునామాలా ప్రేరణాత్మక పాత్ర పోషించింది సుచిత్ర ఫిల్మ్ సొసైటీ.
ఒక తరం కలలను చూపిన భవనం..
ఈ చిత్రం చూస్తున్నంతసేపూ మనం ఒక సుచిత్ర భవనాన్ని చూడం. ఒక అర్థవంతమైన సినిమా కాలాన్ని చూస్తాం. ఒక తరం కలలను చూస్తాం. సినిమా పట్ల ప్రేమతో, లాభనష్టాల లెక్కలు లేకుండా, ప్రపంచ సినిమా వెలుగులను తమ ప్రజలకు చూపించాలని తపించిన మనుషుల ముఖాలను చూస్తాం. బెంగళూరులో సుచిత్ర కథ 1971లో ప్రారంభమైంది. కానీ అది ఒక సంస్థ పుట్టుక మాత్రమే కాదు. అది గొప్ప ప్రేక్షకుడి పునర్జన్మ. ఎందుకంటే సినిమా కేవలం వినోదం కాదని, అది మనిషిని మరింత మనిషిగా మార్చే కళ అని విశ్వసించిన కొందరు యువకులు కలసి వేసిన అడుగు అది.
ప్రపంచ సినిమాను ఇండియాకు చేరువ చేసి...
హెచ్.ఎన్. నరహరి రావు 1971లో సుచిత్ర ఫిల్మ్ సొసైటీ స్థాపక కార్యదర్శిగా ప్రారంభమైంది. రాఘవేంద్ర కోశాధి కారిగా వ్యవహరించారు. అప్పటినుండి హెచ్.ఎన్. నరహరి రావు ప్రయాణం, భారతీయ ఫిల్మ్ సొసైటీ ఉద్యమంతో మమేకమైంది. ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా, ఫి ప్రెస్ ఇండియా అధ్యక్షుడిగా, బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ప్రారంభ సంచికల కళా దర్శకుడిగా ఆయన చేసిన సేవలు విశేషమైనవి. కాన్స్, బెర్లిన్, కార్లోవీ వెరీ, బుసాన్, రోమ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత చలనచిత్రోత్సవాలలో జ్యూరీ సభ్యుడిగా, ప్రతినిధిగా పాల్గొని ప్రపంచ సినిమాను భారతీయ ప్రేక్షకులకు చేరువ చేసిన వారిలో ఆయన ఒకరు. అనేక ఒడిదొడుకులు, అనేక మంది కృషి ఫలితంగా సుచిత్ర సొంతంగా ఆధునిక వసతులతో కూడిన ఆడిటోరియం నిర్మించుకున్న మొదటి సంస్థగా నిలబడింది.
సినీ సంస్కతిని ఆరాధించే ఆలయం
ఐదు దశాబ్దాలకు పైగా సాగిన దాని ప్రస్థానాన్ని, భారతీయ ఫిల్మ్ సొసైటీ ఉద్యమ చరిత్రను, సినీ అవగాహన సంస్కృతిని ఒకేసారి ఆవిష్కరించే ప్రయత్నమే “ది సినిమా టెంపుల్” (The Cinema Temple) అనే డాక్యుమెంటరీ. ఇది సుచిత్ర చరిత్రను చెప్పే సాధారణ డాక్యుమెంటరీ కాదు. ఇది ఒక సాంస్కృతిక ఉద్యమానికి దృశ్యరూపంలో రాసిన చరిత్ర. ఇందులో అరుదైన ఛాయాచిత్రాలు, చారిత్రక పత్రాలు, పాత చిత్ర దృశ్యాలు, సినీ దర్శకులు, విమర్శకులు, సభ్యులతో చేసిన ఇంటర్వ్యూల ద్వారా సుచిత్ర ఫిల్మ్ సొసైటీ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తుంది. 1971లో ఆవిర్భావం నుంచి సొంత ప్రాంగణ నిర్మాణం వరకు, ప్రపంచ సినిమాను ప్రేక్షకులకు పరిచయం చేయడం నుంచి సినీ అభిరుచిని పెంపొందించడం వరకు, చలనచిత్రోత్సవాల నిర్వహణ నుంచి సినీ విద్యా కార్యక్రమాల వరకు సుచిత్ర చేసిన కృషిని ఈ చిత్రం నమోదు చేస్తుంది. సుచిత్రను ఒక భవనంగా కాక సినిమాను కళగా, సంస్కృతిగా, అధ్యయన విషయంగా ఆరాధించే ఒక ఆలయంగా దర్శకుడు చూపించాడు. ఇక్కడ సినిమా కేవలం వినోదం కాదు. అది ఒక ఆలోచన. ఒక అనుభవం. ఒక సంభాషణ. ఒక సామూహిక సాంస్కృతిక యాత్ర.
ఐదు దశాబ్దాల ప్రయాణానికి దృశ్యరూపం..
ఇక కళాత్మకంగా చూస్తే ఈ డాక్యుమెంటరీ బలం దాని నిరాడంబరత. అతిశయోక్తి లేకుండా, నాటకీయతకు తావివ్వ కుండా, ఆర్కైవ్ దృశ్యాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, ఆలోచనలతోనే కథనాన్ని నిర్మించింది. డాక్యుమెంటరీ నడక ప్రశాంతంగా ఉంటుంది. అది ప్రేక్షకుడిని ఉత్సాహపరచడం కన్నా ఆలోచింపజేస్తుంది. మంచి సినిమా ప్రేక్షకుడిలో గొప్ప ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఇదే ఫిల్మ్ సొసైటీ ఉద్యమ సారాంశం కూడా. ఈ చిత్రం చరిత్రకు సాక్ష్యం ఒక గొప్ప ఫిల్మ్ సొసైటీ ఐదు దశాబ్దాల ప్రయాణాన్ని దృశ్యరూపంలో నమోదు చేయడం ఈ చిత్ర ప్రధాన విజయం.
అరుదైన డాక్యుమెంటరీ ఫిల్మ్..
భారతదేశంలో ఫిల్మ్ సొసైటీ ఉద్యమంపై వచ్చిన డాక్యుమెంటరీలు చాలా అరుదు. ఇంతకుముందు నా దర్శకత్వంలో ‘కఫిసో-ఎ సాగా ఆఫ్ ఫిల్మ్ లవర్స్' అన్న డాక్యుమెంటరీ వచ్చింది. అది కరీంనగర్ ఫిల్మ్ సొసైటీపై తీసిన సినిమా. “మంచి ప్రేక్షకులు లేకుండా మంచి సినిమా పుట్టదు” అనే సత్యాన్ని అది మృదువుగా గుర్తు చేస్తుంది. సినిమాను ఒక కళగా, ఒక సంస్కృతిగా, ఒక సామాజిక చైతన్యంగా భావించే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన డాక్యుమెంటరీ ఇది.
-వారాల ఆనంద్
94405 01281






