కిరాయిదార్ పరాయిదారేనా? పట్నంలో రెంట్ కష్టాలు ఎదుర్కొన్న కుటుంబ కథ ఈ వారం కామన్ మ్యాన్ డైరీలో

by Disha edit |
కిరాయిదార్ పరాయిదారేనా? పట్నంలో రెంట్ కష్టాలు ఎదుర్కొన్న కుటుంబ కథ ఈ వారం కామన్ మ్యాన్ డైరీలో
X

హైదరాబాద్​‌లోని టోలీచౌకీ ప్రాంతంలోని ఓ బస్తీ, ఉదయాన్నే నలుగురు మనుషులు వచ్చి ఓ ఇంట్లోని సామానంతా బయటపడేస్తున్నారు. కిషన్ టెన్షన్ పడుతున్నాడు. భార్య, తల్లి, పిల్లలు ఏడుస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పోలీసులకు ఫోన్ చేసే ప్రయత్నం చేశాడు. ఎక్కడికెళ్లాలి. కొంచెం సామాన్ లేదు. లారీ నిండుతుంది. మంచం పట్టిన తల్లి, గర్భిణిగా ఉన్న భార్య. వీళ్లను తీసుకొని ఎటు పోవాలె. అంతలోనే ఓనర్ వచ్చాడు. మొత్తం బయటపడేయండి. ఒక్కటి కూడా ఇంట్లో ఉండద్దు అంటూ సామాన్లు బయటపడేస్తున్న ఆ నలుగురిని ఆదేశిస్తున్నాడు. 'సర్, నెల రోజులు టైం అడిగాను కదా, ఏంది సర్ ఇదంతా'అంటూ ప్రాధేయపడుతున్నాడు కిషన్. 'నీతోనే నాకేం మాట వయా, పక్కకు జరుగు. మీరు నలుగురే ఉంటమన్నరు. మీ అమ్మను తీసుకొచ్చినవ్. ఆమె క్యాన్సర్ పేషెంట్. ఎప్పుడేం జరుగుతుందో తెల్వది. సూసుకుంట ఇల్లు ఖరాబ్ చేసుకుంటమా. పక్కకు జర్గు''ఇప్పటికిప్పుడు అంటే నేను ఎక్కడికి పోవాలె సార్?''గంగల కలువు నాకేం చెప్తున్నవ్'అంటూ గద్దించాడు.

*

వరంగల్ జిల్లాకు చెందిన కిషన్ ఓ ప్రైవేటు ఉద్యోగి. పదేళ్లుగా ఒకే సంస్థలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. భార్య శ్వేత గృహిణి. డిగ్రీ వరకు చదువుకున్నా పిల్లలను బడికి పంపడం, వాళ్ల బాగోగులు చూడటానికే సరిపోతుంది. ఆరు నెలల క్రితం వరకు వరంగల్ కేంద్రంగా నడిచిన కిషన్ ఆఫీసు అక్కడి సంస్థను మూసేసింది. ఉద్యోగులందరూ ఉన్న పళంగా హైదరాబాద్​లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఊరొదులుకోలేని వాళ్లు అక్కడే ఉండిపోయారు. కొందరు సొంతూళ్లకు వెళ్లిపోయారు. కిషన్ జిల్లా కేంద్రం పక్కనే పల్లెటూరు. అక్కడ సొంత ఇల్లు తప్ప మరేం లేదు. ఊరికి వెళ్లినా ఫలితం లేదు. వరంగల్‌లోనే వేరే సంస్థలో కొలువు వెతుక్కునే ప్రయత్నం చేశాడు. వర్కవుట్ కాలేదు. జీతం తక్కువగా ఇస్తామని కొందరు చెబితే, అకౌంటెంట్ మాకు ఆల్రెడీ ఉన్నారు. ఆయనకు అసిస్టెంట్ గా చేరుతారా? అనే ప్రశ్నలు వచ్చాయి. అలా చేరినా ఇప్పుడు మీకొస్తున్నంత జీతం ఇచ్చుకోలేమని మొహం మీదే చెప్పేశారు. మంచం పట్టిన తల్లి, ఇద్దరు ఆడపిల్లలు, గర్భిణి అయిన భార్య, గత్యంతరం లేక హైదరాబాద్​బాట పట్టాడు కిషన్. సంస్థ హెడ్డాఫీసులో జాయిన్ అయ్యాడు.

*

అద్దె ఇంటి కోసం వేట ప్రారంభించాడు. బంధువుల, తెలిసిన వాళ్లున్న చిక్కడపల్లి బెటర్ అనుకొని ఇండ్లను వెతకసాగాడు. అద్దెలు ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది వెజిటేరియన్లకు మాత్రమే రెంట్ కు ఇస్తామంటూ బహిరంగంగానే బోర్డులు తగిలించారు. ఏం చేయాలో అర్థం కాలేదు. టోలిచౌకిలో ట్రై చేయండంటూ తన సహోద్యోగి ఒకరు సలహా ఇచ్చారు. వెతకగా ఓ ఇల్లు కనిపించింది. ఓనర్లను అడిగితే ఇల్లు చూపించారు. ఎంత మంది ఉంటారు? పిల్లలెంతమంది? ప్రతి నెలా ఫస్ట్ కే రెంట్ పే చేయాలి. నీళ్ల బిల్లు ఎంతోస్తే అంత షేర్ చేసుకోవాలి. కరెంటు బిల్లు మీరే కట్టుకోవాలి. మెయింటెనెన్స్ అమ్మాయికి నెలకు వెయ్యి రూపాయలిస్తున్నం. మీ వాటాగా రూ. 350 ఇవ్వాలి. అంటూ కండిషన్ల చిట్టా చదివి వినిపించాడా ఇంటి ఓనర్. అప్పటికే తిరిగి తిరిగి విసిగి వేసారిన కిషన్ సరేనంటూ తలూపాడు. రెండు నెలల అడ్వాన్సు కట్టాలని చెప్పడంతో 'రేపు వస్తానంటూ'రెండు వేలు టోకెన్ అడ్వాన్సుగా చెల్లించాడు.ఆఫీసుకు వెళ్లి 20 వేలు అడ్వాన్సుగా తీసుకొని మరుసటి రోజు రెండు నెలల అద్దె అడ్వాన్సు కింద 16 వేలు కట్టేశాడు. విషయం భార్యకు చెప్పాడు. అత్తమ్మ ఉంటుందని చెప్పలేకపోయావా? ఇప్పుడెలా? వాళ్లు గొడవ చేస్తారమో? ముందే చెప్పి ఉంటే బాగుండేదన్నది శ్వేత. ఎట్టకేలకు సామానంతా ఓ లారీలో వేసుకొని హైదరాబాద్​ చేరుకున్నది కిషన్ కుటుంబం.

*

అత్తమ్మను, పిల్లలను తీసుకొని కార్లో వచ్చింది శ్వేత. కిషన్ తల్లి గంగవ్వ ఆరు నెలల క్రితం గొంతు క్యాన్సర్ బారిన పడింది. రేడియేషన్లు, ట్రీట్మెంట్ కారణంగా బక్కచిక్కిపోయింది. వెంటుకలూ ఊడిపోయాయి. కనీసం నడవడానికి ఇబ్బంది పడుతున్నది. ఆమెను మొదటి అంతస్తులోకి తీసుకుపోవడానికి భార్యాభర్తలిద్దరూ ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు ఇంట్లో సామానంతా డంప్ అయ్యింది. మరుసటి రోజు ఉదయమే ఇంటి ఓనర్ వచ్చాడు.. కాలింగ్ బెల్ నొక్కాడు. డోర్ తీశాడు కిషన్. 'మీరు నలుగురే ఉంటామన్నారు. మీ అమ్మను కూడా తీసుకొచ్చినట్టున్నారు'అన్నాడు ఓనర్ నారాయణ. అవును సర్ నాలుగు రోజులుండి ఊరికి వెళ్లిపోతుంది. అని తడుముకుంటూ సమాధానం ఇచ్చాడు. నేను మీకు ముందే కండిషన్స్ చెప్పాను. తర్వాత మాట రావద్దు.! ఆమెను చూస్తే పేషంట్‌లా ఉందన్నాడు నారాయణ. 'ఔను సర్ అమ్మకు క్యాన్సర్.. ట్రీట్మెంట్ చేయిస్తున్నం.. ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నదన్నాడు'నాలుగు రోజుల్లో పంపించేయండి. లేకుంటే అందరం ఇబ్బంది పడతాం.. అంటూ వెళ్లిపోయాడు ఓనర్. ఏం చేయాలో అర్థం కాలేదు.. సరే చూద్దాం అనుకున్నాడు కిషన్.. పిల్లలను దగ్గర్లో ఉన్న ఓ కాన్వెంట్ స్కూళ్లో చేర్పించాడు. నెలరోజులు గడిచింది. గంగవ్వ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్నది. హైదరాబాద్​ లో బతకడం అంటే మామూలు వ్యవహారం కాదు.. వచ్చిన జీతం చాలడం లేదు. పిల్లల ఫీజులు, రెంట్, పెట్రోలు, తల్లి దవాఖాన ఖర్చలు, భార్యకు ప్రతినెలా మెడికల్ చెకప్, మందులు అన్నీ కలిసి నెలకు 10 వేల వరకు అప్పు చేయాల్సి వస్తున్నది. జాబ్ మానేద్దామంటే వేరే ఆప్షన్ లేదు. హెడ్డాఫీసుకు బదిలీపై వచ్చినా జీతం పెంచడం లేదు ఆ సంస్థ వాళ్లు.

*

ఈ సారి ఇంటి ఓనర్ నారాయణ భార్య లక్ష్మి ఇంటికి వచ్చింది.. ఉన్నవా శ్వేత.. ఏం చేస్తుండ్రు అంటూ మాట కలిపింది.. మీ అత్తమ్మ బాగున్నదా..? ఎప్పుడు పోతది.. ఇంకా పోదా..? ఇన్నే ఉంటదా..? అంటూ ఆరా తీసింది. పోతదంటూ అబద్ధం ఆడింది శ్వేత.. సరే మా ఇంట్లోకి ఎవరో వచ్చినట్టున్నరు మళ్లీ వస్తా అంటూ వెళ్లిపోయింది లక్ష్మి.. రాత్రి కిషన్ ఇంటికి రాగానే విషయం చెప్పింది శ్వేత..! విషయం చెప్పేస్తే ఓ పనైపోతుంది అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయమే ఓనర్ ఇంటికి వెళ్లాడు. నమస్తే సర్.. అంటూ కుర్చీలో కూర్చున్నాడు. తాను ఒక్కడినే కొడుకునని, తన తల్లి తనతోనే ఉంటుందన్నాడు. అట్లా అయితే కుదురదు ఇల్లు ఖాళీ చేయండి.. పేషెంట్ ను ఇంట్ల ఎట్లా పెట్టుకుంటం అంటూ సీరియస్ అయ్యాడు నారాయణ. వంటింట్లోంచి ఓనర్ భార్య లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చింది.. ముందు ఇద్దరమే ఉంటమంటివి కదా..? ఇదేం పద్ధతంటూ నిలదీసింది.. ఆంటీ ఒక్క నెల రోజులు టైం ఇవ్వండంటూ ప్రాధేయపడ్డాడు కిషన్. వెంటనే ఖాళీ చేయండి కుదురదు అంటూ వెళ్లిపోయాడు నారాయణ.. పైనుంచి ఆ మాటలన్నీ జాగ్రత్తగా వింటున్నది శ్వేత. భర్త ఇంటికి రాగానే సరే మీరు టెన్షన్ పడకండి నేను పక్క గల్లీలో చూస్తాను ఇండ్లేమైనా ఖాళీ ఉన్నాయేమో అంటూ భర్తకు సర్ది చెప్పింది. భర్త ఆఫీసుకు వెళ్లగానే పెద్దమ్మాయిని తీసుకొని అద్దె ఇంటిని వెతక సాగింది శ్వేత. టులెట్ బోర్డు చూసి ఏ ఇంటికి వెళ్లినా వచ్చే మొదటి ప్రశ్న.. ఎంత మంది ఉంటారు.. అని అడిగారు.. కడుపులో ఉన్న బిడ్డతోనే కాకుండానే అంటూ డిప్లమాటిక్ గా అడిగిందో ఆంటీ.. మాకు ఇద్దరు ఆడపిల్లలు క్యారీయింగ్ అని సమాధానం చెప్పింది శ్వేత..? మా అత్తమ్మ కూడా మాతోనే ఉంటుందన్నది. ఇద్దరు పిల్లలున్నోళ్లకు ఇవ్వడమే కష్టం.. ఇవ్వలేమన్నది.

*

భగవంతుడా ఏమిటీ పరీక్ష అంటూ మధ్యాహ్నానికి ఇల్లు చేరింది. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు విషయం చెప్పింది. సరే చూద్దాం లే అన్నాడు కిషన్.. నాలుగు రోజులు గడిచాయి. ఇంటి విషయం మర్చిపోయారు. సడెన్ గా నలుగురు వ్యక్తులు ఎంటరై ఏంరా ఇల్లు ఖాళీ చేయమంటే చేస్తలేవట.. అంటూ బెదిరించారు.. బలవంతంగా ఇంట్లోకి జొరబడి సామానంతా బయటపడేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు కిషన్ కు ఓనర్ ను ప్రాధేయపడ్డా వినలేదు. పిల్లలు ఏడుస్తున్నారు. తల్లి టెన్షన్ పడుతున్నారు. శ్వేత సామగ్రి బయటపడేసే వాళ్లను బతిమాలుతున్నది. అయినా వినడం లేదు. టెన్షన్ లో ఓ ఫ్రెండ్ గుర్తొచ్చాడు కిషన్ కు.. తన బాల్యమిత్రుడు ప్రమోద్ కు వారసిగూడలో సొంతిల్లు ఉంది. ఏమైనా కానీ ఫోన్ చేశాడు. విషయమంతా చెప్పాడు.. ఏం టెన్షన్ పడకురా మన ఫస్ట్ ఫ్లోర్ ఖాళీగా ఉంది.. నేనొస్తున్నా ఆగండి అంటూ అర్ధగంటలో టోలిచౌకిలో వాలిపోయాడు ప్రమోద్.. ఓనర్ ను చెడా మడా తిట్టేశాడు.. వీడికి దూరమవుతుందనుకున్నా అత్తమ్మా అని గంగవ్వకు సర్ది చెప్పాడు. నువ్వు టెన్షన్ పడకు అత్తమ్మా.. మనందరం మా ఇంట్లోనే ఉందాం అంటూ తీసుకెళ్లాడు.. అందుకే అంటారు.. ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్.. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్..!


ఎంఎస్ఎన్ చారి

79950 47580


Next Story