- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జానపద కళల గర్వకారణం.. తీజన్ బాయి
పురుషులకు మాత్రమే పరిమితమైన పాండవని కాపాలిక శైలిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన ప్రముఖ జానపద కళాకారిణి తీజన్ బాయి జీవితం, ఆమె కళా ప్రస్థానం, సాధించిన పద్మ పురస్కారాలు..

సంప్రదాయాలు కొన్నిసార్లు కళను కాపాడతాయి.. మరికొన్నిసార్లు కళాకారులను కట్టడి చేస్తాయి. అలాంటి సంప్రదాయాన్నే సవాలు చేసి, పురుషులకు మాత్రమే పరిమిత మైన 'పాండవని' కాపాలిక శైలిని తన గంభీర గాత్రంతో ప్రపంచ వేదికపై నిలబెట్టిన అసాధారణ కళాకారిణి తీజన్ బాయి. గిరిజన జానపద కళకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ఆమె జీవితం, కళకు లింగభేదం ఉండదని నిరూపించిన స్ఫూర్తిదాయక గాథ. ఆమె మరణంతో భారత జానపద కళారంగం ఒక అపూర్వ కళా మణిని కోల్పోయింది.
మహాభారతంను కథలుగా చెప్పే ఛత్తీస్‌గఢ్ గిరిజన సాంప్రదాయ కళ 'పాండవని'. ఈ ప్రదర్శనను స్త్రీలు కూర్చొని సంగీత కచేరీలా ప్రదర్శిస్తే, పురుషులు నిలబడి ఏకపాత్రా భినయంలా ప్రదర్శిస్తారు.. కూర్చొని చెప్పే పాండవని విధానాన్ని ‘వేదమతి’ అంటే, నిలబడి భావ ప్రకటన చేసే పద్దతిని ‘కాపాలిక’ అంటారు. మగవారికి పరిమితమైన కాపాలిక విధానం ఆడ వారికి నిషేధం. ఈ వివక్షను ఎదిరించి 'పాండవని'ని మగరాయుడిలా ప్రదర్శించిన తొలి మహిళ తీజన్ బాయి. అందుకోసం అన్ని అడ్డంకులను దాటి ఆమె కళలకు ఆడ, మగ తేడా లేదని నిరూపించించారు.
తాత ప్రదర్శనలకు ఆకర్షితురాలై..
తీజన్ బాయి ఆదివాసీ ఆహార్యంతో చేతిలో గజ్జెలు, నెమలీకలు అలంకరించిన తంబూరా చేపట్టి తన గంభీర గాత్రంతో మహాభారత సన్నివేశాలను ఆలపిస్తుంటే సభికులు మంత్ర ముగ్దులు అయ్యేవారు.. ఇక్కడే కాకుండా పలు దేశాల్లో పాండవని గాథలు వినిపించిన తీజన్ బాయి ఈ నెల 5న మరణించారు. ఆమె ఛత్తీస్‌గఢ్‌లోని పార్థి అనే గిరిజన తెగలో 1956లో పుట్టారు. తన తాత ప్రదర్శనలను చిన్నతనంలో చూసిన తీజన్ తాను కూడా పాండవని గాయని కావాలని అనుకున్నారు. పదేళ్లు రాగానే ఆ పాటలు పాడడం మొదలు పెట్టారు. ఇంట్లోవారు అందుకు ఒప్పుకోలేదు.. అత్తవారింటికి వెళితే పాడడం మానేస్తుందని 12వ ఏటనే పెళ్లి చేశారు.. కానీ కాపురానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఆమె 13 ఏళ్లకే తొలి ప్రదర్శన ఇచ్చారు. మగవాడిలా కాపాలిక విధానంలో పాండవని చెప్పడాన్ని వ్యతిరేకిస్తూ ఆమెను తమ జాతి వెలివేసింది. ఇంట్లో వాళ్లు సైతం వ్యతిరేకించడం తట్టుకోలేక బయటకి వచ్చి చిన్న గుడిసెలో ఒంటరిగా ఉంటూ ప్రదర్శనలు కొనసాగించారు. తనకు తానే గురువుగా పగలు, రాత్రి ప్రాక్టీసు చేసేవారు. కొందరు మాత్రం చాటుమాటుగా అన్నం పెడుతూ ఆమెను ప్రోత్సహించారు.. వీరి ప్రోద్బలమే లేకుంటే తన ఆట, పాట అక్కడే ఆగిపోయేది అని ఆమె చెప్పిన సందర్భాలున్నాయి.
పాత్రలకు తగ్గట్టుగా గొంతు మార్చుతూ..
తీజన్ బాయి గాత్రం గరుకుగా, గంభీరంగా ఉంటుంది. పలు వాద్యకారులు వెనుకాల కూచొని ఉండగా మధ్యలో తాను నిలబడి హావభావాల ప్రదర్శనతో, పాత్రలకు తగ్గట్లుగా గొంతు మార్చుతూ మహాభారత సన్నివేశాలను ఆలపిస్తారు.. ద్రౌపది వస్త్రాపహరణం లాంటి సందర్భాల్లో ఆమె ఏకకాలంలో కరుణ, రౌద్ర రసాలను పలికించే తీరు అమోఘం. చేతిలోని తంబురాను ఆమె పాత్రోచితంగా గద, పిల్లనగ్రోవి, బాణంగా మార్చడం మరో విశేషం. గ్రామాల్లో పది రూపాయల సంపాదనతో మొదలైన ఆమె ప్రదర్శన విదేశాల దాక వెళ్లింది. ఛత్తీస్‌గఢ్ పల్లెలో అయినా విదేశీ ఆడిటోరియంలో అయినా ప్రదర్శనలో మార్పు ఉండదు.. గ్రామీణ కళను ఉన్నదున్నట్లుగా కాపాడడం తన ధర్మమని ఆమె అంటారు. ఆమె ప్రతిభను తెలుసుకున్న రంగస్థల నిపుణుడు హబీబ్ తన్వీర్ ప్రధాని ఇందిరా గాంధీ ముందు తీజన్ ప్రదర్శించే అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆమె భారతీయ సంప్రదాయ కళలను యువతకు నేర్పే కేంద్ర ప్రభుత్వ సంస్థలో చాలా కాలం శిక్షణ ఇచ్చారు.
మహిళల పరిమితులను అధిగమించి..
తీజన్ బాయి జీవితం అనేక మంది కళాకారులకు స్ఫూర్తి. సంప్రదాయాల పేరుతో మహిళలపై విధించిన పరిమితులను అధిగమించి, ప్రతిభతో ప్రపంచాన్ని గెలవవచ్చని ఆమె నిరూపించారు. పాండవని కళకు ఆమె చేసిన సేవలకు గానూ 1988లో పద్మశ్రీ, 2003లో పద్మభూషణ్, 2019లో పద్మ విభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం తీజన్ బాయిని గౌరవించింది. మనకు చెందిన విశేషమేమిటంటే హైదరా బాద్‌కు చెందిన సుద్దాల హన్మంతు జానకమ్మ ఫౌండేషన్ 2015లో తమ జాతీయ పురస్కారాన్ని తీజన్ బాయికి అంద జేశారు. ఆ సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన అవార్డు ప్రధాన సభలోనే తీజన్ పాండవనిలోని కొన్ని సన్నివేశాలను ప్రదర్శించారు. తీజన్ బాయి సాహసం మహిళలను పాండవని కాపాలిక విధానం వైపు ఆకర్షించింది. పాండవని కళకు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి తీసుకొచ్చిన కళామూర్తిగా, జానపద కళల పరిరక్షణలో అపూర్వ సేవలు అందించిన మహానీయురాలిగా తీజన్ బాయి భారత సాంస్కృతిక చరిత్రలో శాశ్వతంగా గుర్తుండిపోతారు.
- బద్రి నర్సన్
94401 28169






