ఒక సామాజిక వ్యాఖ్యాత... ఓ సాంస్కృతిక స్వరం

by Bhoopathi Nagaiah |

భారతీయ సినీ ఆవరణలో మలయాళ సినిమా ఒక చిన్న పరిశ్రమలా కనిపించినా, దాని సాంస్కృతిక ప్రభావం విస్తృతమైనది.

ఒక సామాజిక వ్యాఖ్యాత... ఓ సాంస్కృతిక స్వరం
X

“నేను చెప్పేదంతా ఇదే… ఒక క్రైస్తవుడయిన మిత్రుడు ఇన్సేంట్ నుంచి వచ్చిన 400 రూపాయలు, ఒక ముస్లిం అయిన మమ్ముట్టి ఇచ్చిన 2000 రూపాయల డబ్బుతో నా హిందూ భార్య మెడలో బంగారు తాళి కట్టాను, ఇందులో మతం ఏది ఎవరి మతం మతం ఎక్కడ ఉంది” అన్నాడు నటుడు రచయిత దర్శకుడు కీ.శే. శ్రీనివాసన్. మలయాళ సినిమా ఒకరకమయిన వ్యాపార దృష్టి మాత్రమే గల స్థిరమైన ఫార్ములాతో నడిచే పరిశ్రమ కాదు. అది నిరంతరం తనను తాను ప్రశ్నించుకుంటూ ముందుకు సాగుతున్న గొప్ప సాంస్కృతిక ప్రయోగశాల.

భారతీయ సినీ ఆవరణలో మలయాళ సినిమా ఒక చిన్న పరిశ్రమలా కనిపించినా, దాని సాంస్కృతిక ప్రభావం విస్తృతమైనది. మలయాళ సినిమా కేవలం వినోదం అందించే మాధ్యమం కాదు. అది కేరళ సమాజం తనను తాను అర్థం చేసుకునే ఒక సాంస్కృతిక సంభాషణా వేదిక (Cultural Forum)కూడా. ఈ లక్షణమే మలయాళ సినిమాను ఇతర భారతీయ సినిమాల నుంచి వేరు చేస్తుంది. కేరళలోని ఈ మలయాళ సినిమా ఆరంభ దశలో పురాణ నాటక ప్రభావంలోనే ఉన్నా, 1970ల తర్వాత దాని దిశ మారింది. అందుకు అదూర్ గోపాలకృష్ణన్, జి. అరవిందన్, జాన్ అబ్రహాం వంటి దర్శకులు కీలక పాత్ర పోషించారు. వీరి సినిమాలు కథనంలో రియలిజాన్ని, ఫ్రేమ్‌లో మౌనాన్ని, పాత్రల్లో లోతును ప్రవేశపెట్టాయి.

కథలను నియంత్రించిన మలయాళీలు

ఇదే కాలంలో కమర్షియల్, ఆర్ట్ సినిమాల మధ్య ఉన్న గోడ క్రమంగా కూలడం ప్రారంభమైంది. ఈ కలయికే తరువాతి మలయాళ సినిమాకు పునాదిగా మారింది. మలయాళ సినిమా Writer-Centric Cinema. ఎం.టి. వాసుదేవన్ నాయర్, శ్రీనివాసన్, లోహితదాస్, సత్యన్ ఆంథికాడ్ వంటి రచయితలు ఆ సినిమాల కథనాన్ని నియంత్రించారు. ఇక్కడ సినిమా హీరో ఆధారితంగా కాకుండా, స్క్రీన్‌ప్లే ఆధారితంగా నడిచింది. ఇది నటులకు పాత్రల లోతును, ప్రేక్షకులకు ఆలోచనను ఇచ్చింది. మళయాళ సినిమా మరో బలం రియలిజం, రచయితల ప్రాధాన్యం సామాజిక స్పృహ. సీరియస్ అధ్యయన దృష్టిలో చూస్తే మలయాళ సినిమా భారతీయ సినిమాలో అంతర్ముఖ స్వరం (Introspective Voice) స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి మళయాళ సినిమా రంగంలో అనేకమంది రచయితలు కళాకారులు నటులు విశేషంగా కృషి చేసి త్యాగాలు చేసి ఆ రంగానికి స్వీయ స్వరాన్ని రూపొందించారు. భారతీయ ప్రాంతీయ సినిమాల్లో మలయాళ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.

మన చుట్టూ ఉన్న మనుషుల్లానే పాత్రలు

సహజత్వం, సామాజిక స్పృహ, లోతైన మానవ సంబంధాల చిత్రణ లాంటి పలు లక్షణాలకు రూపం ఇచ్చిన కొద్దిమంది సృజనకారుల్లో శ్రీనివాసన్ ఒకరు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, మలయాళ మధ్యతరగతి మనస్తత్వానికి, రాజకీయ వ్యంగ్యానికి, సామాజిక వైవిధ్యాలకు, నటనలకు అద్దం పట్టిన రచయిత దర్శకుడు కూడా. డిసెంబర్ 20 న మరణించిన శ్రీనివాసన్ నటనలో అతి లేదు. గొంతు బిగ్గరగా పెంచడం, ముఖ కవళికల్లో అతిశయనం, రంగస్థల శైలీ నటన ఇవేవీ ఆయనలో లేవు. ఆయన పాత్రలు మన చుట్టూ ఉన్న మనుషుల్లానే ఉంటాయి. బస్సులో పక్కన కూర్చున్న క్లర్క్, ప్రభుత్వ కార్యాలయంలో చిరాకు పడే ఉద్యోగి, కుటుంబంలో తనను తానే తక్కువగా భావించే భర్త ఇలాంటి పాత్రలను ఆయన అంత్యంత సహజంగా పోషించారు. ప్రేక్షకుడు ఆయనలో నటుడిని కాదు, సాటి మనిషినే చూసాడు.

డొల్లతనాన్ని ప్రశ్నించిన కథలు

“వడక్కునొక్కియంత్రం”,“చింతావిష్టయాయ శ్యామల”, “వెల్లనకలుడే నాడు” వంటి సినిమాల్లో ఆయన పాత్రలు మానసిక సంఘర్షణలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా అసూయ, అహంకారం, అపరాధ భావన, మధ్యతరగతిలోని భయాలు ఆ భావాల్ని ఆయన తన నటనలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఆయన హాస్యం కూడా కేవలం వినోదం కోసం కాదు అది ఆయా పాత్రలోంచే పుడుతుంది. నిజానికి శ్రీనివాసన్ అసలైన బలం ఆయన కలం. మలయాళ సినిమాలో సామాజిక వ్యంగ్యానికి బలమయిన రూపం ఇచ్చింది ఆయన రచనలే. రాజకీయాలు, వ్యవస్థలు, కుటుంబ వ్యవహారాలు, సిద్ధాంతాల్లోని డొల్లతనం వీటన్నిటినీ ఆయన తన కథల్లో ప్రశ్నించారు. ((ఆయన “సందేశం” సినిమా రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరిపై చేసిన వ్యంగ్యం అది ఇప్పటికీ వాస్తవమే. “వరవెల్పు” లో ప్రవాసి కలలు నిరాశలు కనిపిస్తాయి “వడక్కునొక్కియంత్రం”లో పురుష అహంకారం, మానసిక అస్థిరత ఒక సామాజిక సమస్యగా మారుతుంది అని చెబుతారు))

లోపాలున్న మనుషులే ఉంటారు

ముఖ్యంగా శ్రీనివాసన్ రచనల్లో గొప్పతనం ఏమిటంటే వాటిల్లో ప్రసంగాలు ఉండవు. పాత్రల సంభాషణలే మౌలిక సిద్ధాంతాల్ని బయటపెడతాయి. ఆయన హాస్యం నవ్వించడానికే కాదు, ఆలోచింపజేయడానికీ ఉపయోగపడుతుంది. అందుకే ఆయన డైలాగులు నేటికీ అత్యంత ప్రాచుర్యం పొందాయి. దర్శకుడిగా శ్రీనివాసన్ ఎక్కువ సినిమాలు చేయకపోయినా, చేసినవి తనదయిన ముద్ర వేసిన సినిమాలే.“వడక్కునొక్కియంత్రం”, “చింతావిష్టయాయ శ్యామల” లాంటి చిత్రాలు ఆయన లోపల వున్న మానవతా కోణాన్ని చూపిస్తాయి. దర్శకుడిగా ఆయనలోని బలం ఆయన పాత్రల్ని ప్రేమించడమే. ఆయన సినిమాల్లో విలన్లు ఉండరు. లోపాలున్న మనుషులే ఉంటారు. కథనంలో వ్యాపార సినిమాల్లోలాగా అతి మెలోడ్రామా ఉండదు. నవ్వు వేదన రెండూ ఒకే ఫ్రేమ్‌లో సంయుక్తంగా కలిసి నడుస్తాయి.

నిజాయితీని మిగిల్చిపోయారు

నిజంగా చెప్పాలంటే కళాకారుడిగా శ్రీనివాసన్ ఒక అరుదైన మిశ్రమం. ఆయనలో నటుడిగా సహజత్వం, రచయితగా తీక్షణమైన వ్యంగ్యం, దర్శకుడిగా మానవీయ దృష్టి ప్రధానంగా కనిపిస్తాయి. ఈ మూడు కలిసినప్పుడు, ఆయన సినిమా ఒక వినోద సాధనం మాత్రమే కాకుండా, ఒక సామాజిక చిత్రం అవుతుంది. ఆయన సినిమాలు మనల్ని నవ్విస్తాయి, కానీ నవ్వు తగ్గాక మనల్ని మనమే ప్రశ్నించుకునేలా చేస్తాయి. శ్రీనివాసన్ మలయాళ సినిమాకు కేవలం ఒక వ్యక్తి కాదు ఒక ప్రత్యేక దృక్కోణం. ఆయన సినిమాలు చూస్తే మన సమాజం మన ముందు నిలబడి మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఆయనను “కామెడీ నటుడు” అని పరిమితం చేయడం సరయిందికాదు. శ్రీనివాసన్ ఒక సామాజిక వ్యాఖ్యాత, ఒక సాంస్కృతిక స్వరం. మలయాళ సినిమా చరిత్రలో శ్రీనివాసన్ పేరు నిలిచేది అవార్డుల వల్ల కాదు. ఆయన మన మనసుల్లో మిగిల్చిన నిజాయితీ వల్ల.

వారాల ఆనంద్

94405 01281

Next Story